జపాన్ వెలికితీసిన పాక్ 'ఫేక్ ఫుట్‌బాల్ జట్టు'.. పరువు పాయే..
ఈ నకిలీ జట్టు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది.
By: A.N.Kumar | 18 Sept 2025 4:00 AM ISTజపాన్‌లో టోర్నమెంట్ ఆడటానికి వెళ్తున్నామని చెప్పి, పాకిస్తాన్ నుండి 22 మంది వ్యక్తులు బయలుదేరారు. వీరు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి నకిలీ 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు' పొంది, వాటిని ఉపయోగించారు. అయితే జపాన్‌లోని విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని విచారించగా, వారు నిజమైన క్రీడాకారులు కాదని, కేవలం అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని తేలింది. దీనితో వారిని వెంటనే వెనక్కి పంపారు. ఈ సంఘటన వెనుక పాకిస్తాన్ లోనే మాలిక్ వకాస్ అనే వ్యక్తి సూత్రధారిగా ఉన్నాడని దర్యాప్తులో వెల్లడైంది. అతను "గోల్డెన్ ఫుట్‌బాల్ ట్రయల్" అనే నకిలీ క్లబ్‌ను నడుపుతూ, ఒక్కో వ్యక్తి నుండి భారీగా డబ్బు వసూలు చేసి కోటికి పైగా లాభం పొందాడని తెలిసింది.
ఆటగాళ్లా లేక ఉగ్రవాదులా?
ఈ నకిలీ జట్టు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. నిజమైన ఆటగాళ్ల మాదిరిగా నకిలీ పత్రాలతో ప్రయాణించడం, వారు కేవలం అక్రమ వలసదారులా లేక మరొక ఉగ్రవాద ముసుగులో ఉన్నారా అనే సందేహాలకు తావిచ్చింది. ఇలాంటి సంఘటనలు భద్రతా సంస్థలకు మరింత సవాళ్లను సృష్టిస్తాయి.
పాకిస్తాన్ ప్రతిష్టకు నష్టం
ఈ సంఘటనతో పాకిస్తాన్ క్రీడా రంగానికి.. ఆ దేశ ప్రతిష్టకు భారీ నష్టం వాటిల్లింది. క్రీడల ద్వారా స్నేహాన్ని, సానుకూల వాతావరణాన్ని ప్రోత్సహించాల్సిన దేశం, నకిలీ జట్లను పంపి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిందన్న అపవాదు మూటగట్టుకుంది. నకిలీ పత్రాలు, మోసాలు, అక్రమ రవాణా వంటివి అంతర్జాతీయంగా ఆ దేశ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తాయి. ఈ వ్యవహారం పాకిస్తాన్‌లో జరుగుతున్న క్రీడా మోసాలను, వ్యవస్థాపరమైన లోపాలను కూడా స్పష్టం చేస్తుంది.
మొత్తంగా ఈ సంఘటన కేవలం ఒక ఫుట్‌బాల్ జట్టుకు సంబంధించినది మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వ మరియు వ్యవస్థాగత లోపాలను, అలాగే ఆ దేశ ప్రతిష్ట ఎంతగా దిగజారిందో కూడా సూచిస్తుంది.
