'నకిలీ' మద్యం: జయపై ఎందుకీ ప్రచారం.. టీడీపీకి మంచిదేనా.. ?
ఈ మొత్తం నకిలీల వెనుక ఎవరున్నా వదిలి పెట్టరాదని సీఎం చంద్రబాబు స్వయంగా పిలుపునిచ్చారు. అధికారులను కూడా ఆదేశించారు. ఇక, తంబళ్ల పల్లె టీడీపీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డి సహా పలువురు నాయకులను పార్టీ నుంచి పక్కన పెట్టారు.
By: Garuda Media | 8 Oct 2025 9:58 AM ISTరాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో కుదిపేస్తున్న ప్రస్తుత అంశం.. `నకిలీ మద్యం.` ఉమ్మడి చిత్తూరు జిల్ల తంబళ్ల పల్లె నియోజకవర్గం, ములకలచెరువు ప్రాంతంలో వెలుగు చూసిన ఈ మద్యం మూలాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా ఉన్నాయని తెలియడంతో సర్కారు ఉలిక్కిపడింది. ఈ మొత్తం నకిలీల వెనుక ఎవరున్నా వదిలి పెట్టరాదని సీఎం చంద్రబాబు స్వయంగా పిలుపునిచ్చారు. అధికారులను కూడా ఆదేశించారు. ఇక, తంబళ్ల పల్లె టీడీపీ ఇంచార్జ్ జయచంద్రారెడ్డి సహా పలువురు నాయకులను పార్టీ నుంచి పక్కన పెట్టారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ దిశగానే ప్రభుత్వం పనిచేసుకుని వెళ్లిపోతే.. వాస్తవాలు వెలుగు చూసేవి. కానీ, ఇక్కడ రోగమొకటైతే.. మందు మరొకటి వేసిన చందంగా.. టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ రొంపిలో నేరుగా వైసీపీ నాయకులకు ప్రమేయం లేదని అధికారులు చెబుతున్నా రు. అంతేకాదు.. అసలు తంబళ్లపల్లి ఎమ్మెల్యే కానీ.. ఆయన అనుచరులు కానీ.. ఈ వివాదంలో జోక్యం చేసుకోలేదని.. అంతా జయ చంద్రారెడ్డి స్వహస్తాలతోనే ఈ నకిలీ వ్యవహారం సాగిందని చెబుతున్నారు.
అయినా.. కూడా టీడీపీ నాయకులు వైసీపీ నేతలను లాగేస్తున్నారు. ఎప్పుడో.. ఎక్కడో వైసీపీతో టచ్‌లో ఉన్నారంటూ.. పూర్తిగా జయచంద్రారెడ్డిని పక్కన పెట్టే కార్యక్రమానికి.. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబం ధం లేదన్న వాదాన్ని తెరమీదికి తెస్తున్నారు. గతంలో వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న ఫొటోలను కూడా మీడియాకు లీకు చేస్తున్నారు. కానీ, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి.. ఇప్పుడు జయచంద్రా రెడ్డిని పార్టీ కేవలం సస్పెండ్ మాత్రమే చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించలేదు. సో.. మరో 3 మాసాల తర్వాతైనా.. ఆయన సైకిల్‌పై తిరుగుతారు.
కానీ.. ఈలోగానే అసలు పార్టీతో సంబంధమే లేదన్నట్టుగా.. జయచంద్రారెడ్డి ఆయన వర్గంపై ముద్ర వేస్తే .. తంబళ్లపల్లిలో జరిగిన అనేక కార్యక్రమాలకు ఆయన సాక్షి. రేపు ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. అది టీడీపీమెడకే చుట్టుకుంటుంది. పైగా.. ఆయనను వైసీపీ ఎట్టి పరిస్థితిలోనూ చేర్చుకోదు. కాబట్టి.. ఆయన ఎప్పటికైనా టీడీపీ నాయకుడిగానే ఉంటారు. ఈ విషయాన్నిమరిచిపోయి.. ఎప్పుడో దశాబ్దం కిందటి ఫొటోలు తీసి.. నకిలీ మద్యంలో వైసీపీ ఉందని ప్రచారం చేయడం వల్ల.. ప్రయోజనం లేదు.
ఇప్పుడు జరిగిన తప్పును ప్రభుత్వంపై పడకుండా కాపాడాలని అనుకోవడం తప్పుకాకపోయినా.. పూర్తిగా దీనిలో వైసీపీ ప్రమేయం ఉందని ప్రచారం చేస్తే.. అది మొదటికే వికటించే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. తప్పులు జరిగితే వైసీపీపైనా.. మంచి జరిగితే టీడీపీలోనూ వేసుకోవడం తప్పుకాదని అనుకుంటే.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాల్సి ఉంటుంది.
