టిడిపి పార్టీ పై నెపం నెట్టే కుట్ర.. జనార్ధన్ రావు నకిలీ మద్యం కథ!
మొదటగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించాడు. అధికారులు పసిగట్టకుండా ఉండేందుకు ఒక వినూత్న ఎత్తుగడ వేశాడు.
By: A.N.Kumar | 14 Oct 2025 9:24 AM ISTఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన తంబళ్లపల్లి నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం కేవలం నకిలీ మద్యం తయారీకి సంబంధించినది మాత్రమే కాదు, టిడిపి పార్టీ పై నెపం నెట్టే కుట్ర అని నిందితుడు జనార్ధన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం వ్యవహారం లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. ముఖ్యంగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ కేసులో ఏ-1 నిందితుడైన జనార్దన్ రావు విచారణలో తాజాగా వైసీపీపై సంచలన ఆరోపణలు చేశారు. అప్పటి మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందంటూ జనార్ధన్ రావు బాంబు పేల్చారు.
వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పటి ఎమ్మెల్యే, మంత్రి అయిన జోగి రమేష్ ఆదేశాల మేరకు తాము నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు అంగీకరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జోగి రమేష్ మళ్లీ జనార్దన్ రావుకు ఫోన్ చేసి, నకిలీ మద్యం తయారు చేయాలని ఆదేశించారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి, నింద వారిపై వేయడానికి ఈ కుట్ర పన్నారని అన్నారు. మొదట ఇబ్రహీంపట్నంలో అనుకున్నా, తర్వాత తంబళ్లపల్లి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉండడంతో, అక్కడ తయారీ కేంద్రాన్ని పెట్టాలని జోగి రమేష్ ఆదేశించారని... ప్రభుత్వంపై బురద చల్లడానికి ఇది అనువుగా ఉంటుందని స్కెచ్ వేశారని ఆరోపించారు..
*జనార్ధన్ రావు.. ఆర్థిక కష్టాల నుంచి అడ్డదారిలోకి..
2012 నుంచే మద్యం వ్యాపారంలో ఉన్న జనార్దన్‌రావు ఇబ్రహీంపట్నంలో 'ఏఎన్‌ఆర్' బార్‌ను విజయవంతంగా నడిపాడు. ఈయన ఒక మద్యం వ్యాపారి. అయితే, జాతీయ రహదారి పక్కనే ఉన్న బార్‌ను మార్చడం, ఆపై కరోనా సంక్షోభం కారణంగా 2021 నాటికి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయాడు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకే అతను సులువైన మార్గంగా నకిలీ మద్యం తయారీని ఎంచుకున్నాడు.
మొదటగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఒక గదిని అద్దెకు తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించాడు. అధికారులు పసిగట్టకుండా ఉండేందుకు ఒక వినూత్న ఎత్తుగడ వేశాడు. 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాల్లో మద్యాన్ని నింపి, వాటిపై 'ఫినాయిల్' స్టిక్కర్లు అంటించి, నకిలీ ఇన్‌వాయిస్‌లతో ఇబ్రహీంపట్నానికి తరలించేవాడు. అక్కడ ఐదో నిందితుడైన హాజీ వాటిని లీటర్ బాటిళ్లలో నింపి విక్రయించేవాడు.
* గోవా కేంద్రంగా భారీ నెట్‌వర్క్
2023లో జనార్దన్‌రావు గోవాకు వెళ్లినప్పుడు, అక్కడే స్థిరపడిన తెలుగు వ్యక్తి, మూడో నిందితుడు బాలాజీతో పరిచయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని, గోవా నుంచి తక్కువ ధరకు తెచ్చి అమ్మితే భారీ లాభాలు వస్తాయని బాలాజీ ఆశ చూపడంతో వీరిద్దరూ కలిసి నకిలీ మద్యం తయారీని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నారు.
ముడిసరుకు (స్పిరిట్): డిస్టిలరీలతో పరిచయాలున్న బాలాజీ సరఫరా చేసేవాడు. హైదరాబాద్‌కు చెందిన రవి (ఏ4) సమకూర్చేవాడు. ప్రసాద్ అనే వ్యక్తి ఇచ్చేవాడు. ముడిసరుకును బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల నుంచి ఐషర్ వ్యాన్‌లలో తరలించేవారు.
*బార్‌లోనే కల్తీ.. రాజకీయ స్నేహం
నివేదిక ప్రకారం, 2023 నుంచి జనార్దన్‌రావు ఇబ్రహీంపట్నంలోని తన 'ఏఎన్‌ఆర్' బార్‌లోనే కల్తీ మద్యం తయారీని ప్రారంభించాడు. మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ వంటి ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ మద్యాన్ని తయారుచేసి, మొదటగా తమ సొంత బార్‌లోనే విక్రయించేవారు. ఈ దందాలో ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై అతనికి ₹35 నుంచి ₹40 వరకు లాభం వచ్చినట్లు తేలింది.
2024 ఎన్నికల సమయంలో నిఘా పెరగడంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమయంలోనే తంబళ్లపల్లి జయచంద్రారెడ్డితో మద్యం వ్యాపారి అయిన జనార్దన్‌రావుకు స్నేహం ఉందని, ఆయన అనుచరులైన సురేంద్ర నాయుడు, పీఏ రాజేష్‌లు కూడా వైన్ షాపులు దక్కించుకున్నారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.
ఈ కేసులో ఇప్పటివరకు 10 మందిని అరెస్టు చేయగా, జనార్దన్‌రావును విచారించడం ద్వారా మరిన్ని కీలక విషయాలు, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న పెద్దల పాత్ర బయటపడ్డాయి.
