Begin typing your search above and press return to search.

కల్తీ లిక్కర్.. ఫేక్ ప్రచారం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం

ఏపీలో మద్యం విక్రయాల్లో చోటుచేసుకుంటున్న అవకతవకల నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.

By:  Tupaki Political Desk   |   13 Oct 2025 4:24 PM IST
కల్తీ లిక్కర్.. ఫేక్ ప్రచారం.. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం
X

ఏపీలో మద్యం విక్రయాల్లో చోటుచేసుకుంటున్న అవకతవకల నిగ్గు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గత ప్రభుత్వం నుంచి మద్యంలో కల్తీ వారసత్వంగా వస్తోందని చెబుతున్న చంద్రబాబు.. అసలు గుట్టు విప్పేలా ప్రత్యేక సిట్ ఏర్పాటుకు నిర్ణయించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువలో కల్తీ మద్యం కనుగొన్న తర్వాత కూటమి ప్రభుత్వంలోనే పెద్ద స్కాం జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న రూ.3,500 కోట్ల స్కాం అంతా ఉత్తి ప్రచారమే అన్నట్లు వైసీపీ సోషల్ మీడియా ఉదరగొడుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులకు చెక్ చెప్పేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ తేవడమే కాకుండా, ప్రస్తుతం వెలుగుచూసిన నకిలీ బాగోతం లింకులు గత ప్రభుత్వంలో ఉన్నాయని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీని వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను గుర్తించేందుకు మరో సిట్ వేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో మద్యం మాఫియా గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో వెలుగుచూసిన మద్యం స్కాంలో పలువురు అరెస్టు అయ్యారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో కూడా దాదాపు 16 మందిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం 23 మంది నిందితులుగా గుర్తించారు.

మద్యం విషయంలో కొందరు చేస్తున్న కుట్రలు ముఖ్యమంత్రికి చికాకు తెప్పిస్తున్నట్లు చెబుతున్నారు. రోడ్డుపై మరణించిన బిచ్చగాళ్లను కూడా కల్తీ మద్యం వల్లే చనిపోయారని చూపుతుండటాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారని, అందుకే ప్రత్యర్థుల అసలు రంగు తేల్చేయాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థను గాడిలో పెట్టి, బెస్ట్ పాలసీ తెచ్చినా ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారం ప్రజల్లోకి వెళ్లడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించినట్లు చెబుతున్నారు.

గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేదని, అప్పట్లో నాణ్యమైన మద్యం లేకపోవడం, ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతయ్యేదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటివన్నీ కంట్రోల్లో పెట్టినా, మద్యం విషయంలో ఇంకా కొందరు కుట్ర చేస్తున్నారని సీఎం అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా నేరాలు చేయడం, ఎదుటి వారిపై ఆ నేరాల్ని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం సందేహిస్తున్నారు. ఈ కారణంగానే మరో సిట్ వేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో స్కాంపై సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తుండగా, తాజాగా వెలుగు చూసిన నకిలీ మద్యంపై మరో సిట్ సమాంతరంగా దర్యాప్తు చేయనుంది.