ఫిల్మ్ నగర్ పోలీసులకు దొరికిన నకిలీ ఐపీఎస్... పెర్ఫార్మెన్స్ పీక్స్ అంట!
అవును... హైదరాబాద్ లో హల్ చల్ చేస్తున్న ఫేక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
By: Raja Ch | 27 Nov 2025 9:40 AM ISTపోలీసులమని చెప్పి రోడ్లపై వాహనాలు ఆపి, డబ్బులు గుంజుకునే నకిలీ పోలీసుల గురించి తెలిసిందే! ఇదే క్రమంలో.. ప్రభుత్వ అధికారులమని చెప్పి మరికొంతమంది నకిలీ బ్యాచ్ డబ్బులు సంపాదిస్తుంటారు! ఈ క్రమంలో ఏకంగా తాను ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారి అంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని తాజాగా ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని పక్కన ఇద్దరు గన్ మెన్ లు ఉండటం గమనార్హం.
అవును... హైదరాబాద్ లో హల్ చల్ చేస్తున్న ఫేక్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. పైగా ఈ ఫేక్ అధికారికి రిటైర్డ్ అయిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గన్ మెన్ లు గా ఉన్నారు. దీంతో... ఇతనిని నమ్మే, నమ్మాల్సిన జనం మరింత సులువుగా ఇతడి బుట్టలో పడిపోయేవారని అంటున్నారు. ఈ సమయంలో... పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ ఇతడి వివరాలు వెల్లడించారు.
ఆ వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిన శశికాంత్ (39).. 3-డీ ఏనిమేషన్ కోర్సు చేసి చిన్న కంపెనీ ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో ఇటీవల షేక్ పేట లోని అపర్ణ ఔరా అపార్టుమెంట్ కు మకాం మార్చాడు. నేర్చుకున్న ఏనిమేషన్ కోర్సును ఉపయోగించి.. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ అధికారుల ఐడీ కార్డులు తన పేరున తయారు చేశాడు.
అక్కడ నుంచి వాటిని జేబులో పెట్టుకుని రంగంలోకి దిగాడు. ఈ సందర్భంగా... ప్రత్యేక ఆపరేషన్ల కోసం తనను ప్రభుత్వం నియమించిందని చెప్పుకుంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో నియమించుకున్న ఇద్దరు గన్ మెన్ లతో కలిసి షేక్ పేటలోని గోల్డ్ జిమ్ కు వెళ్లేవాడు. ఎక్సర్ సైజులు చేస్తున్న సమయంలో ఫోన్ రింగ్ అవ్వడం.. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, స్పెషల్ ఆపరేషన్ మీద వెళ్తున్నానంటూ వెళ్లిపోవడం చేస్తుండేవాడు.
మరోవైపు... తాను స్పెషల్ ఐఏఎస్ అధికారిని అంటూ సదరు జిమ్ ఎండీ అలీ హసన్ కు చెప్పాడు. ఈ క్రమంలో పరిశ్రమ స్థాపన కోసం స్థలం కేటాయింపు జరిగిందంటూ నకిలీ అలాట్మెంట్ ఆర్డర్ చూపించి.. అలీ హసన్ నుంచి రూ.10.50 లక్షల నగదు బ్యాంక్ నుంచి బదిలీ చేయించుకున్నాడు. ఇదే క్రమంలో.. జిమ్ కి వచ్చే మరో వ్యక్తి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు.
అయితే అతడు చూపించిన స్థలం తన పేరుపై బదిలీ కాకపోవడంతో అలీ హసన్ కు ఇతనిపై అనుమానం వచ్చి.. ఫిల్మ్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారి శశికాంత్ ను అరెస్ట్ చేశారు. ఈ సమయంలో అతని నుంచి రెండు ఫోన్లు, ఆరు సిమ్ కార్డులతో పాటు రెండు వాకీటాకీలు, ఫేక్ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
