Begin typing your search above and press return to search.

కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు..

విద్యాసంస్థల అనుమతులకు అత్యంత కీలకమైన ఫైర్ ఎన్‌వోసీల జారీలో ఏకంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

By:  A.N.Kumar   |   5 Aug 2026 3:01 PM IST
కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్ఓసీలు..
X

ఈ మధ్య కాలంలో తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన వ్యవస్థ హైడ్రా. ఆక్రమణల తొలగింపు, చెరువుల పరిరక్షణతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ సంస్థ పేరును వాడుకుంటూ కొందరు కేటుగాళ్లు దగాకోరు విద్యకు తెరలేపడం తీవ్ర కలకలం రేపుతోంది. విద్యాసంస్థల అనుమతులకు అత్యంత కీలకమైన ఫైర్ ఎన్‌వోసీల జారీలో ఏకంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగు చూసింది.

హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఏటా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక శాఖ ఇచ్చే ఫైర్ ఎన్‌వోసీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే భద్రతా ప్రమాణాలు సరిగా లేని కొన్ని ప్రైవేట్ కళాశాలలు సులభంగా గుర్తింపు పొందేందుకు అడ్డదారి తొక్కి హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ ఎన్‌వోసీలను సృష్టించాయి. ఏకంగా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని, అధికారిక సీలును ఫోర్జరీ చేసి ఒరిజినల్ పత్రాల్లా భ్రమించేలా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం గమనార్హం.

ఈ నకిలీ పత్రాలను కళాశాల యాజమాన్యాలు నిస్సిగ్గుగా ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. ఇంటర్ బోర్డు అధికారులు పత్రాల స్క్రూటినీ జరుపుతుండగా సాంకేతిక తేడాలు గమనించి, హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పెద్ద కుంభకోణం బయటపడింది. ఆ పత్రాలు పూర్తిగా ఫోర్జరీ చేసినవేనని విచారణలో నిర్ధారణ కావడంతో అధికారులు తక్షణ చర్యలకు పూనుకున్నారు.

నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ వ్యవస్థలను మోసగించినందుకు మొత్తం ఎనిమిది ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించి ఈ అక్రమాలకు పాల్పడిన ఎనిమిది కళాశాలల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని విద్యాశాఖకు హైడ్రా అధికారులు అధికారిక లేఖ రాశారు. ప్రస్తుతం పోలీసులు ఫోర్జరీ, మోసం, ప్రభుత్వ ముద్రల దుర్వినియోగం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద విచారణ జరుపుతున్నారు.

ఈ నకిలీ పత్రాల దందా కేవలం ఈ ఎనిమిది కాలేజీలకే పరిమితం కాలేదని విచారణ అధికారులు భావిస్తున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక పెద్ద ముఠా లేదా మధ్యవర్తులు ఉన్నారనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. అందులో భాగంగానే మరో 60 ప్రైవేట్ కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్‌వోసీలను కూడా అధికారులు లోతుగా స్క్రూటినీ చేస్తున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేకుండా వేలాది మంది విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటూ కాలేజీ యాజమాన్యాలు చేసిన ఈ పనిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.