Begin typing your search above and press return to search.

బెట్టింగ్ నష్టంతో మరణించిన ఫ్రెండ్ కోసం.. హైదరాబాద్ లో వైరల్ రివేంజ్ క్రైమ్!

అవును... ఎల్బీనగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మిత్రుడు ఒకరు మూసాపేటలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి నిర్వహించిన బెట్టింగులో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నారంట.

By:  Raja Ch   |   28 Dec 2025 11:16 AM IST
బెట్టింగ్ నష్టంతో మరణించిన ఫ్రెండ్ కోసం.. హైదరాబాద్ లో వైరల్ రివేంజ్ క్రైమ్!
X

నాశనమైపోయిన జీవితాలు, చితికిపోయిన కుటుంబాలు, నలిగిపోయిన మనుషులు, కుదేలైపోయిన కాపురాలు, చావే శరణ్యమనుకున్న బాధితులు.. బెట్టింగ్ ల వల్ల తలెత్తే అనర్ధాలు అన్నీ ఇన్నీ కాదనే సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ బూతం ఎన్నో జీవితాలను హరించేసింది. ఈ క్రమంలో బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి వేసిన స్కెచ్, చేసిన పని సంచలనంగా మారింది.

అవును... ఎల్బీనగర్ కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మిత్రుడు ఒకరు మూసాపేటలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి నిర్వహించిన బెట్టింగులో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నారంట. ఆ నష్టం భారీగా ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడంట. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ ఫ్రెండ్.. తన స్నేహితుడి చావుకు ఆ బెట్టింగ్ నిర్వాహకుడి నిర్వాకమే కారణం అని ఫిక్సై.. అతడిని పోలీసుల వేషంలో బెదిరించారు.

వివరాళ్లోకి వెళ్తే... ఎల్బీనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సింహరాజు (40) స్నేహితుడు ఒకరు హరీష్ కుమార్ రాజు అనే ఏపీకి చెందిన రొయ్యల వ్యాపారి నిర్వహించిన బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నాడంట. ఆ దెబ్బలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే... సరూర్ నగర్ కు చెందిన రవీంద్రబాబు (36), హబ్సిగూడకు చెందిన నరేష్ (37), రవికుమార్ (36), ప్రశాంత్ (34)లతో కలిసి నర్సింహరాజు ఓ పెద్ద ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగా... హరీష్ కుమార్ రాజుని బెదిరించి డబ్బు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. ఈ సమయంలో వీరంతా కలిసి నకిలీ పోలీసుల అవతారం ఎత్తారు. వెంటనే.. మూసాపేట లోని మెరీనా స్కై అపార్ట్మెంట్ లోని ఒక ప్లాట్లులో తన స్నేహితుడు రాజిరెడ్డితో కలిసి అద్దెకుంటున్న హరీష్ ఇంటికి శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వెళ్లారు. ఈ సందర్భంగా తమను తాము మాదాపూర్ ఎస్వోటీ పోలీసులుగా పరిచయం చేసుకున్నారు.

అనంతరం వచ్చిన పని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా... మీరు బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని.. అందుకు అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి భయపట్టారు. అనంతరం.. కేసు వద్దనుకుంటే రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తన వద్ద అంత డబ్బు లేదని హరీష్ చెప్పడంతో.. ఇష్టానురీతిగా కొట్టిన అనంతరం.. బంధువులకో, స్నేహితులకో ఫోన్ చేయమని సలహా ఇచ్చారు. అప్పటికే సమయం సాయంత్రం 7 అయ్యిందని తెలుస్తోంది!

ఈ సమయంలో వీరి దెబ్బలు భరించలేకో ఏమో కానీ.. తన సమీప బంధువు ఒకరికి కాల్ చేశాడు హరీష్. తాను పోలీసుల అదుపులో ఉన్నానని.. వెంటనే డబ్బు కావాలని చెప్పారు. ఈ సమయంలో అవతలి వ్యక్తికి కాస్త అనుమానం రావడంతో.. ఎందుకైనా మంచిదని మాదాపూర్ ఎస్వోటీ కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు! దీంతో.. అసలు ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. మూసాపేట్ లోని సదరు ప్లాటుకు వచ్చారు.

అయితే అప్పటికే ముగ్గురు నిందితులు పరారవ్వగా... మిగిలిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తమదైన శైలిలో విచారించగా.. మిగిలినవారి వివరాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. హరీష్ కుమార్ రాజు బెట్టింగుల వ్యవహారం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు!