రూ. 2 కోట్ల కట్నం కోసం భారీ స్కెచ్.. కట్ చేస్తే కటకటాల పాలైన మోసగాడు..!
తమను మోసం చేయడమే కాకుండా, తమ కూతురిని వేధించిన మధుపై బాధితులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By: Tupaki Political Desk | 14 April 2026 3:11 PM ISTసమాజంలో పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇటీవల జరిగిన ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అనగానే, అబ్బాయి బ్యాగ్రౌండ్ చెక్ చేయకుండా గుడ్డిగా నమ్మేయడం వల్ల ఒక యువతి జీవితం ఎంతటి ప్రమాదంలో పడిందో ఈ ఉదంతం చూస్తుంటే అర్థమవుతోంది.
సెంట్రల్ జాబ్ పేరుతో కోట్లలో కట్నానికి స్కెచ్..
నేటి కాలంలో అక్షరాస్యత పెరుగుతున్నా, పెళ్లి సంబంధాల విషయంలో మోసపోయే వారి సంఖ్య అంతే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అని తెలిస్తే చాలు.. కళ్లు మూసుకొని సంబంధం కాయం చేసుకునే తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకొని మధు అనే కిలేడి ఘరానా మోసానికి తెరలేపాడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న ప్రతి కుటుంబానికి ఒక గుణపాఠం.
రూ. 2 కోట్ల కట్నం.. పక్కా ప్లాన్!
నిందితుడు మధు చాలా పక్కాగా స్కెచ్ వేశాడు. తను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ అని నమ్మించడానికి నకిలీ ఐడీ కార్డు సృష్టించాడు. యువతి తల్లిదండ్రులకు ఆ ఐడీ కార్డు చూపించి, తను చాలా పెద్ద పొజిషన్లో ఉన్నానని నమ్మించాడు. అబ్బాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో, తన కూతురి భవిష్యత్తే బాగుంటుందని భావించిన యువతి కుటుంబ సభ్యులు ఏకంగా రూ. 2 కోట్ల కట్నం ఇవ్వడానికి అంగీకరించారు. పెళ్లికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు కూడా చకచకా చేసుకుంటున్నారు.
ప్రీ వెడ్డింగ్ షూట్ తో బట్టబయలైన బండారం..
సంబంధం నిశ్చయమయ్యాక.. మధు తన అసలు రంగును బయటపెట్టడం మొదలుపెట్టాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం యువతిని హైదరాబాద్‌కి తీసుకువచ్చాడు. అయితే, ఇక్కడే అతని ప్రవర్తన సరిగా లేదని సదరు యువతి గ్రహించింది. కేవలం ఫొటోలు తీసుకోవడమే కాకుండా, యువతిని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించడం, ఆమెను ‘బద్నాం’ చేసేలా కుట్రలు చేయడం ప్రారంభించాడు. బహుశా పెళ్లికి ముందే ఆమెను లొంగదీసుకోవడం ద్వారా లేదా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి డబ్బులు గుంజాలనేది అతని స్కెచ్.
అతని అతి విపరీతమైన ప్రవర్తన, మాట తీరు చూసి యువతికి అనుమానం కలిగింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది అమ్మాయిలు భయపడి మౌనంగా ఉంటారు, కానీ ఈ యువతి చాలా ధైర్యంగా వ్యవహరించింది. తన అనుమానాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వెంటనే అప్రమత్తమైన వారు తమకు తెలిసిన వారి ద్వారా మధు పని చేస్తున్నానని చెప్పిన ఆఫీసులో ఎంక్వైరీ చేయించారు. అక్కడ విచారించగా, అసలు ఆ పేరుతో ఎవరూ పని చేయడం లేదని, అతను చూపించిన ఐడీ కార్డు పక్కా నకిలీ అని తేలింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
చైతన్యపురి పీఎస్‌లో కేసు..
తమను మోసం చేయడమే కాకుండా, తమ కూతురిని వేధించిన మధుపై బాధితులు చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై చీటింగ్, ఫోర్జరీ, వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి వద్ద ఉన్న నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అతను గతంలో ఇంకెంత మందిని ఇలాగే మోసం చేశాడనే కోణంలో విచారిస్తున్నారు. ఇదొక వ్యవస్థీకృత నేరమా? లేక మధు ఒక్కడే ఈ మోసాలకు పాల్పడుతున్నాడా? అన్నది తేలాల్సి ఉంది.
