Begin typing your search above and press return to search.

ఐదుగురు విద్యార్థుల మృతికి కారణం ఇదే.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ న్యూస్

పల్నాడు జిల్లా గణపవరం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం తెలిసింది.

By:  Tupaki Political Desk   |   8 Dec 2025 3:30 PM IST
ఐదుగురు విద్యార్థుల మృతికి కారణం ఇదే.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ న్యూస్
X

పల్నాడు జిల్లా గణపవరం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం తెలిసింది. ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బలితీసుకున్న ఈ ప్రమాదానికి నకిలీ బ్రేకు ఇనస్పెక్టర్ అవతారమెత్తిన ఓ పోలీసు అధికారి కుమారుడు కారణం అని దీనిని పోలీసులు గుర్తించారు అని అంటున్నారు. నిందితుడిపై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయి. నరసారావుపేట డీఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు గణపవరం వద్ద కారులో వచ్చి కంటైనర్ ని ఆపడంతో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోర ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని పోలీసులు ప్రయత్నించగా, సీసీ టీవీ పుటేజ్ లో వెంకటనాయుడు బాగోతం బయటపడింది.

పల్నాడు జిల్లా గణపవరం వద్ద ఈ నెల 4న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. రోడ్డుపై కంటైనర్‌ను ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చారు. బ్రేక్ ఇన్‌స్పెక్టర్ అవతారం ఎత్తిన ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు వాహనాలు ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ ను కారులో ఓవర్ టేక్ చేసి రోడ్డుపై ఆకస్మికంగా ఆపాడు. హైవేపై ఒక్కసారిగా కంటైనర్ ఆగటంతో కారు ఢీకొని ప్రమాదం జరిగింది. కంటైనర్‌ను ఏఎస్ఐ కుమారుడు ఆపినట్లు సీసీ కెమెరా దృశ్యాల్లో నమోదైంది. ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. 2023న నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ రూ.40 లక్షలతో ఉడాయించారు. ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని చిలకలూరిపేట పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు మరణించడం సంచలనం రేపింది. మరణించిన విద్యార్థుల్లో నలుగురు గుంటూరులోని విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తుండగా, మరొకరు యశ్వంత్ సాయి చలపతి కాలేజీలో చదువుతున్నారు. ఈ ఘోర ఘటన జరుగుటకు కారణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగుచూసింది. మృతుల్లో ముగ్గురు ఆయప్ప స్వామి మాల ధరించి ఉన్నారు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లివస్తుండగా, ఈ ఘోరం చోటుచేసుకుంది.