భర్త మీద కోపంతో ఎలుకలమందు తాగింది.. పిల్లాడు చనిపోయాడు
విన్నంతనే అయ్యో అనిపించే విషాద ఉదంతం ఒకటి భీమవరంలో చోటు చేసుకుంది.
By: Garuda Media | 20 Jan 2026 10:37 AM ISTవిన్నంతనే అయ్యో అనిపించే విషాద ఉదంతం ఒకటి భీమవరంలో చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఒక మహిళ విఫలం కావటం ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా ఆమె కొడుకు ప్రాణాలు పోయిన వైనమిది. ఎలుకల మందు తాగిన ఆమెకు ఏమీ కాకపోవటం.. దాన్నే తెలియక తాగిన కొడుకు ప్రాణాలు పోవటం గమనార్హం. అసలేం జరిగిందంటే..
క్రిష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన సుబ్బారావుకు లక్ష్మితో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. ప్రస్తుతం వారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం బలుసుమూడిలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కనుమ రోజు ఇంటి నుంచి బయటకు వెళుతున్న భర్త సుబ్బారావుకు త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. సాయంత్రం షాపింగ్ కు వెళ్లాలన్న తన ప్లాన్ చెప్పింది. అయితే.. అందుకు భిన్నంగా భర్త సుబ్బారావు ఆ రోజు సాయంత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చాడు
దీంతో కోపానికి గురైన లక్ష్మి కూల్ డ్రింక్ లో ఇంట్లో ఉన్న ఎలుకల మందును కలుపుకొని కొద్దిగా తాగి.. మిగిలింది వంటింట్లో పెట్టి నిద్రపోయింది. తల్లి ఉంచిన కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిసిందన్న విషయం తెలియని ఐదేళ్ల కొడుకు మహారుద్రకాంత్ దాన్ని తాగి నిద్రపోయాడు. తెల్లవారుజామున రుద్రకాంత్ వాంతులు చేసుకోవటంతో ఎలుకల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగినట్లుగా గుర్తించి.. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.
మెరుగైన చికిత్స కోసం ఏలూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావటం.. చికిత్స అందించినా ఫలించక ఆదివారం మధ్యాహ్నం పిల్లాడు చనిపోయాడు. దీంతో బాలుడి మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రాణాలు తీసుకుందామనుకున్న తాను బాగుండి.. కొడుకు మరణించటంతో లక్ష్మీ తీవ్రంగా రోదిస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా షాక్ కు గురి చేసింది.
