Begin typing your search above and press return to search.

కుటుంబం కోసం సముద్రంలో 13 ఏళ్ల బాలుడి సాహసం వేరే లెవెల్!

సెలవు దినాన్ని సముద్రంలో బోటులో గడపాలని భావించిన ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది.

By:  Raja Ch   |   5 Feb 2026 11:31 AM IST
కుటుంబం కోసం సముద్రంలో 13 ఏళ్ల బాలుడి సాహసం వేరే లెవెల్!
X

సెలవు దినాన్ని సముద్రంలో బోటులో గడపాలని భావించిన ఓ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుపోయింది. హాలిడేని ఎంజాయ్ చేయాలనే సరదా కార్యక్రమం కాస్తా సముద్రపు అలల మధ్య మనుగడకోసం జరిగిన పోరాటంతో ముగిసింది. ఈ క్రమంలో తన తల్లి, చెల్లి, తమ్ముడిని కాపాడటం కోసం 13 ఏళ్ల బాలుడు సముద్రంలో సుమారు 4 గంటల పాటు ఈదిన విషయం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో.. దీన్ని అతీంద్రీయ సహాసయాత్రగా అభివర్ణిస్తున్నారు.

అవును... పశ్చిమ ఆస్ట్రేలియాలోని క్విండాలప్ లో ఓ కుటుంబం అద్దెకు తీసుకున్న కయాక్ లతో సముద్రంలోకి వెళ్లారు. ఈ సమయంలో అల్లకల్లోలంగా మారిన సముద్రంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో తన తల్లి జోవాన్ (47), తమ్ముడు బ్యూ (12), చెల్లెలు గ్రేస్ (8)లను కాపాడటం కోసం 13 ఏళ్ల ఆస్టిన్ సముద్రంలో సుమారు 4 గంటలపాటు దాదాపు నాలుగు కిలోమీటర్లు ఈదాడు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒడ్డుకు చేరుకుని, అధికారులను ఆశ్రయించాడు.

దీంతో ఓ పోలీసు హెలికాప్టర్ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో జోవాన్, తో పాటు 12 ఏళ్ల కుమారుడు, 8 ఏళ్ల కుమార్తెను గుర్తించింది. ఆ సమయంలో వీరు ముగ్గురూ స్టార్టింగ్ పాయింట్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలో, దాదాపు 10 గంటలు నీటిలో గడిపారు. ఆ సమయంలో చలి కారణంగా ఆమె కుమారుడు బ్యూ కాళ్లలో స్పర్శ కోల్పోయాడు. ఈ సందర్భంగా స్పందించిన పోలీస్ ఇనిస్పెక్టర్ బ్రాడ్లీ... ఆస్టిన్ చర్యలు అసాధారణమైనవని తెలిపారు.

అదృష్టవశాత్తు ఆ ముగ్గురూ లైఫ్ జాకెట్లు ధారించారని.. ఇది వారి మనుగడకు దోహదపడిందని అన్నారు. ఇదే సమయంలో 13 ఏళ్ల ఆ బాలుడి ధృడ సంకల్పం, ధైర్యం.. తన తల్లి, తమ్ముడు, చెల్లిల ప్రాణాలు కాపాడాయని తెలిపారు. పోలీసులు వారిని రక్షించిన తర్వాత.. ఆస్పత్రి చికిత్స అవసరం లేకుండానే ఇంటికి క్షేమంగా చేరారు.

ఈ సందర్భంగా స్పందించిన ఆస్టిన్... తాను వేగంగా వెళ్లేందుకు ఫ్రీస్టైల్లో ఈత కొట్టినట్లు తెలిపాడు.. బలమైన అలలను తట్టుకునేందుకు బ్రెస్ట్ స్ట్రోక్ వాడినట్లు.. అలిసిపోయినప్పుడు సర్వైవల్ బ్యాక్ స్ట్రోక్ వాడినట్లు వెల్లడించాడు. ఈ విధంగా ఈదుతూ తీరానికి చేరుకోవడానికి కొన్ని గంటల సమయం పట్టిందని తెలిపాడు.

ఈ సమయంలో స్పందించిన నేచురలిస్ట్ వాలంటీర్ మెరైన్ రెస్క్యూ కమాండర్ పాల్ బ్రెస్లాండ్... ఆ యువకుడి ప్రయత్నాలను అతీంద్రీయ మానవుడిగా అభివర్ణించాడు. అతను మొదట రెండు గంటలు లైఫ్ జాకెట్ ధరించి ఈదాడని.. ఆ తర్వాత రెండు గంటలు లైఫ్ జాకెట్ లేకుండా ఈదాడని వెల్లడించారు. అతడి కమిట్మెంట్ వేరే లెవెల్ అని అన్నారు.