రిలయన్స్.. రత్నదీప్.. విజేత.. మోర్.. అన్నీ అదే రూట్లోనేనా?
శుక్రవారం జీహెచ్ఎంసీకి చెందిన ఆహార భద్రతాధికారులు 44 చోట్ల తనిఖీలు నిర్వహించారు.
By: Garuda Media | 20 Sept 2025 12:00 PM ISTహైదరాబాద్ మహానగరం మొదలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాలు.. పట్టణాలు.. ఒక మోస్తరుగా ఉండే టూటైర్ సిటీస్ లోనూ సూపర్ మార్కెట్లు.. అందునా చైన్ షాపీ లాంటివి పెద్ద ఎత్తున ఓపెన్ అవుతున్న వైనం గురించి తెలిసిందే. మిగిలిన ప్రాంతాల సంగతిని పక్కన పెడితే.. హైదరాబాద్ మహానగరం అన్నంతనే వీధికి ఒకటి చొప్పున ఉండే చైన్ షాపీ సూపర్ మార్కెట్లలో రత్నదీప్.. విజేత.. రిలయన్స్.. మోర్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు బ్రాండెడ్ సూపర్ మార్కెట్లు దర్శనమిస్తాయి.
శుక్రవారం జీహెచ్ఎంసీకి చెందిన ఆహార భద్రతాధికారులు 44 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత లేకపోవటం.. బొద్దింకలు కనిపించటంతో పాటు.. వివిధ ఉత్పత్తుల్ని గడువు తీరిన తర్వాత కూడా అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా పలు వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. రిలయన్స్ కాచిగూడ క్రాస్ రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో ఆగస్టు చివరి వారం.. సెప్టెంబరు రెండో వారంలో గడువు ముగిసిన అవకాడో.. పదిహేనున గడువు ముగిసిన యాపిల్.. ఆరెంజ్ పండ్ల డబ్బాల్ని గుర్తించారు సైదాబాద్ మోర్ సూపర్ మార్కెట్ లో రాయల్ గాలా యాపిల్ పండ్ల గడువు ముగిసింది.
కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్ లో ఈ నెల ఐదున ముగిసిన ఎల్లోరింగ్స్.. పాలక్ రైస్ పాపడ్.. ఆగస్టు మూడున ముగిసిన గోద్రెజ్ జెర్సీ థిక్ షేక్ డబ్బాలు దర్శనమిచ్చాయి. ఇదే కొండాపూర్ లో కేపీఎన్ ఫాం ఫ్రెష్.. అంబికా హోం ఫుడ్స్ లో పూతరేకులు.. పంచదార గవ్వలు.. సున్నుండలు గడువు తీరిపోగా.. సెప్టెంబరు 13న గడువు ముగిసిన గ్రీన్ యాపిల్ పండ్లు అమ్ముతున్న వైనాన్ని గుర్తించారు.
ఇదే కొండాపూర్ రత్నదీప్ లో సెప్టెంబరు 18న ముగిసిన 21 దీపక్ జున్ను పాకెట్లు.. రత్నదీప్ స్వీట్ కార్న్.. కలర్ క్యాప్సికం ఉత్పత్తుల్ని అమ్ముతున్నట్లుగా గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెప్పారు. ఇదంతా చూసినప్పుడు.. సూపర్ మార్కెట్ ఏదైనా.. బ్రాండ్ మరేదైనా.. కొనే ప్రతి వస్తువ గడువు ముగిసిందా? లేదా?అన్నది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలన్న విషయాన్ని మనసులో బలంగా గుర్తు ఉంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు.
