హెచ్-1బి వీసా రద్దు దిశగా 'ఎక్సైల్' చట్టం: భారతీయ టెక్కీలకు ముప్పు తప్పదా?
ఈ బిల్లును సమర్థిస్తూ స్ట్యూబ్ కొన్ని దిగ్గజ కంపెనీల పేర్లను ఉదహరించారు. మైక్రోసాఫ్ట్ లో 2025లో 9,000 హెచ్-1బి వీసాలు జారీ అయిన తర్వాత సుమారు 16,000 మంది స్థానిక ఉద్యోగులు తొలగించబడ్డారని పేర్కొన్నారు.
By: A.N.Kumar | 12 Feb 2026 11:11 AM ISTఅమెరికాలో స్థానిక ఉద్యోగాల రక్షణ పేరుతో విదేశీ నైపుణ్య కార్మికులపై మరోసారి వేటు వేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు గ్రెగ్ స్ట్యూబ్ ప్రతిపాదించిన 'ఎక్సైల్' (ఎండింగ్ ఎక్స్ ప్లోటివ్ ఇంపోర్టెడ్ లేబర్ ఎక్సెంప్షన్ యాక్ట్) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే, దశాబ్దాలుగా విదేశీయులకు అమెరికాలో ఉద్యోగ కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ పూర్తిగా రద్దు కానుంది.
ఏంటి ఈ 'ఎక్సైల్' చట్టం?
గ్రెగ్ స్ట్యూబ్ ప్రతిపాదించిన ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అమెరికాలోని ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌ను సవరించడం ప్రధానంగా కనిపిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం నాటికి హెచ్-1బి వీసాల సంఖ్యను సున్నాకు తగ్గిస్తోంది. అమెరికా కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను తెచ్చుకుంటూ స్థానిక అమెరికన్ యువతకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను హరిస్తున్నాయని స్ట్యూబ్ ఆరోపిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇకపై ఏ అమెరికా కంపెనీ కూడా విదేశీయులను హెచ్-1బి కేటగిరీ కింద నియమించుకోలేదు.
కంపెనీలపై గ్రెగ్ స్ట్యూబ్ ఆరోపణలు
ఈ బిల్లును సమర్థిస్తూ స్ట్యూబ్ కొన్ని దిగ్గజ కంపెనీల పేర్లను ఉదహరించారు. మైక్రోసాఫ్ట్ లో 2025లో 9,000 హెచ్-1బి వీసాలు జారీ అయిన తర్వాత సుమారు 16,000 మంది స్థానిక ఉద్యోగులు తొలగించబడ్డారని పేర్కొన్నారు. డిస్నీ & ఫెడెక్స్ లో గతంలో జరిగిన లేఆఫ్స్‌ను ప్రస్తావిస్తూ విదేశీ కార్మికుల వల్ల అమెరికన్ల "అమెరికన్ డ్రీమ్" దెబ్బతింటోందని వాదించారు.
ఇక వైద్య రంగంలో విదేశీ డాక్టర్ల రాక వల్ల వేలాది మంది స్థానిక వైద్యులకు రెసిడెన్సీ ప్రోగ్రామ్‌లలో సీట్లు దక్కడం లేదని ఆరోపించారు.
భారతీయులపై పడే ప్రభావం
హెచ్-1బి వీసా పొందుతున్న వారిలో ప్రతి ఏటా సుమారు 70% నుంచి 80% మంది భారతీయులే ఉంటున్నారు. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి భారతీయ కంపెనీలతో పాటు గూగుల్, మెటా వంటి సంస్థల్లో పనిచేసే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భారత్ పంపే విదేశీ మారక ద్రవ్యం పై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది చట్టం అవుతుందా?
ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది చట్టంగా మారాలంటే సుదీర్ఘ ప్రక్రియ ఉంది. ఈ బిల్లు ప్రతినిధుల సభ , సెనేట్ రెండింటిలోనూ మెజారిటీతో ఆమోదం పొందాలి. అమెరికాలోని టెక్ కంపెనీలు నైపుణ్యం గల కార్మికుల కోసం హెచ్-1బిపై ఆధారపడతాయి. కాబట్టి ఈ బిల్లును వారు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో లేదా రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి బిల్లులు తరచుగా వస్తుంటాయి. గతంలో కూడా మార్జోరీ టేలర్ గ్రీన్ వంటి నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేశారు.. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతానికి హెచ్-1బి వీసా రద్దు కాలేదు. ఇది ఒక సభ్యుడి ప్రతిపాదన మాత్రమే. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వీసా ఫీజులను పెంచడం... లాటరీ విధానంలో మార్పులు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ బిల్లు రావడం ఆందోళన కలిగిస్తోంది.
