జోగిని వదలని టెన్షన్.. చంద్రబాబు ఫుల్ కాన్సంట్రేషన్
నిజానికి మాజీ మంత్రి జోగి రమేష్ సూచనలతోనే తాము ఈ దందాలో దిగినట్లు ఏ1 అద్దేపల్లి జనార్దనరావు గత నెలలోనే ఒక వీడియోలో ఆరోపించారు.
By: Tupaki Political Desk | 1 Nov 2025 5:00 PM ISTకల్తీ మద్యం కేసులో సిట్ దూకుడు మాజీ మంత్రి జోగి రమేష్ ను టెన్షన్ కు గురిచేస్తోందని అంటున్నారు. తనకే పాపం తెలియదని ఆయన నెత్తీనోరు బాదుకుంటున్నా.. నిందితులు మాత్రం జోగి రమేష్ పేరును పదేపదే చెబుతున్నారని ప్రభుత్వం లీకులిస్తూ ఆయనను టెన్షన్ పెడుతోంది. ఈ వ్యవహరం బయటకి వచ్చిన నుంచి మాజీ మంత్రిని అరెస్టు చేస్తామని ప్రచారం చేయడమే తప్ప, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మాజీ మంత్రి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బయటకు గుంభనంగా కనిపిస్తున్నా, ఆయన లోలోన టెన్షన్ పడుతున్నట్లుగానే కనిపిస్తోందని పరశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ సొంత ఊరు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. ఆయన ఇంటికి ఎదురుగానే కల్తీ మద్యం కేసు నిందితుల ఇళ్లు ఉండటంతో మాజీ మంత్రి ప్రమేయంపై ప్రభుత్వ వర్గాలు అనుమానాలు వ్యాప్తి చేస్తున్నాయి. కల్తీమద్యం కేసు నిందితులతో జోగికి పూర్వం నుంచి సంబంధాలు ఉండటంతో కల్తీ దందాలోనూ ఆయనకు లింకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తనను కావాలనే ఈ కేసులో ఇరికించి టార్చర్ చేస్తున్నారని మాజీ మంత్రి వాపోతున్నారు. తన తప్పు లేదని చెప్పుకునేందుకు ఆయన గుడులు గోపురాలు చుట్టూ తిరుగుతున్నారు.
తనకు కల్తీ మద్యం నిందితులకు సంబంధం లేదని మాజీ మంత్రి జోగి ఎంతలా చెబుతున్నా, ఆయన ప్రమేయం ఉందన్న ప్రచారాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా హోరెత్తిస్తోంది. నేడో, రేపో అరెస్టు అంటూ ప్రచారం చేస్తుంది. కల్తీ మద్యం కేసు నిందితులను తాజాగా విచారించిన సిట్ పోలీసులు, మాజీ మంత్రి జోగికి వ్యతిరేకంగా వాంగ్మూలం తీసుకున్నట్లు మీడియా కథనాలు ప్రసారం అవుతున్నాయి. నిందితుల వాంగ్మూలం ఆధారంగా ఒకటి రెండు రోజుల్లో మాజీ మంత్రి జోగిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
నిజానికి మాజీ మంత్రి జోగి రమేష్ సూచనలతోనే తాము ఈ దందాలో దిగినట్లు ఏ1 అద్దేపల్లి జనార్దనరావు గత నెలలోనే ఒక వీడియోలో ఆరోపించారు. అయినప్పటికీ సిట్ పోలీసులు ఆ వీడియోను సాక్ష్యంగా పరిగణించలేదు. నిందితుల లిఖిత పూర్వక వాంగ్మూలాన్ని ప్రామాణికంగా తీసుకుని మాజీ మంత్రికి ఉచ్చు బిగించేలా వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు మాస్టర్ మైండ్ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి ముందు జోగి నిరసనకు దిగినందునే ఆయనపై కక్ష సాధిస్తున్నారని ఆ పార్టీ విమర్శిస్తోంది. అయితే ఇదే సమయంలో జోగిపై ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టలేకపోతోందని అంటున్నారు.
లిక్కర్ కేసులో జోగి పాత్ర వెలుగు చూసినప్పటి నుంచి ఆయన ఒక్కరే ఒంటరి పోరు చేస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర పార్టీలో కానీ, జిల్లాలో కానీ జోగికి మద్దతుగా ఏ ఒక్కరూ మాట్లాడటం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో దూకుడుగా పనిచేసే వైసీపీ నేతలు చాలా మంది ఉన్నప్పటికీ కల్తీ మద్యం కేసులో జోగి మాత్రమే వివరణ ఇచ్చుకుంటున్నారు. మిగిలిన వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడకపోవడానికి కారణం ఏంటన్న చర్చ జరుగుతోంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహమే ప్రధానంగా చెబుతున్నారు. ఒక విధంగా ప్రభుత్వ చర్యలు వైసీపీ నేతలను భయపెడుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే తమను టార్గెట్ చేసే అవకాశం ఉందని ఎక్కువ మంది నేతలు వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అందుకే కల్తీ లిక్కర్ విషయంలో టెన్షన్ మొత్తం మాజీ మంత్రి జోగి అనుభవిస్తున్నారని అంటున్నారు.
