Begin typing your search above and press return to search.

జ‌న‌సేన‌లోకి వైసీపీ మాజీ మంత్రి.. ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌?

ఈ క్ర‌మంలోనే చేరికల క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒక‌రు జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌ని ప్ర‌చారం.

By:  Garuda Media   |   25 Jun 2026 7:00 PM IST
జ‌న‌సేన‌లోకి వైసీపీ మాజీ మంత్రి.. ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌?
X

చేరిక‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఇప్పుడు దాదాపు గేట్లు తెరిచింది. గ‌త రెండేళ్లుగా సొంత‌గా నాయ‌కుల‌ను త‌యారు చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చినప్ప‌టికీ.. మారుతున్న కాల మాన ప‌రిస్థితులు .. సీనియ‌ర్ల కొర‌త‌, ఆలోచ‌నా దృక్ఫ‌థం వంటివాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. ఇప్పుడు ఇత‌ర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చేరికల క‌మిటీల‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఒక‌రు జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌ని ప్ర‌చారం.

వైసీపీ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన అవంతి శ్రీనివాస్‌.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓడిపోయారు. అనంత‌రం ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ క్ర‌మంలోనే వైసీపీ అధినేత‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్‌ తీరువ‌ల్లే పార్టీ పుట్టిమునిగింద‌ని.. తాము ఎన్ని చెప్పినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేక పోవ‌డం వ‌ల్లే మొత్తం అంద‌రూ న‌ష్ట‌పోయార‌ని జ‌గ‌న్‌బాగానే ఉన్నార‌ని కూడా అవంతి వ్యాఖ్యానించారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న పార్టీకి రాజీనామా స‌మ‌ర్పించారు.

అనంత‌రం.. టీడీపీలో చేరేందుకు అవంతి ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఆయ‌నకు రైవ‌ల్‌గా ఉన్న గంటా శ్రీనివాస‌రావు.. అవంతి చేరిక‌కు స‌సేమిరా అన‌డంతో ఈ ప్ర‌క్రియ నిలిచిపోయింది. ఈ నేప‌థ్యంలో గ‌త రెండేళ్లుగా అవంతి త‌న విద్యావ్యాపారాన్ని చూసుకుంటున్నారు. తాజాగా జ‌న‌సేన గేట్లు ఎత్త‌డంతో ఆయ‌న చ‌ర్చ‌లు ప్రారంభించార‌ని.. జ‌న‌సేన ఓకే అంటే చేర‌డం ఖాయ‌మ‌ని విశాఖ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన అవంతిగ‌తంలో టీడీపీ త‌ర‌ఫున అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో వైసీపీ త‌ర‌పున అసెంబ్లీకి పోటీ చేసి గెలుపు గుర్రం ఎక్కారు. ఆయ‌న‌కు క‌ల‌సి వ‌చ్చిన భీమిలి నియోజ‌క‌వ‌ర్గంపైనే క‌న్నేసిన‌.. అవంతి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఈ విష‌యంలో జ‌న‌సేన ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుందా? ఇవ్వ‌దా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో పార్టీలో చేర్చుకునేందుకు రెడీగానే ఉన్నా.. టికెట్ల విష‌యంపై ఏం చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.