ఏపీ: 'ఆ పోస్టు' నాకు ఇవ్వరూ.. మాజీ డీజీపీ ప్రదక్షిణలు... !
రాష్ట్రంలో 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో పనిచేసిన ఓ డీజీపీ.. తాజాగా సీఎంవో చుట్టూ ప్రదక్షి ణలు చేస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది
By: Garuda Media | 24 Oct 2025 8:00 AM ISTరాష్ట్రంలో 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో పనిచేసిన ఓ డీజీపీ.. తాజాగా సీఎంవో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. అప్పట్లో అమరావతి రాజధానికి భూములు సమీకరించే విషయంపై ఆయన కీలకంగా వ్యవహరించారు. ఒకానొక దశలో జగన్ పై ఆయన టీడీపీ నాయకుల కంటే కూడా.. తీవ్రస్థాయిలో విరుచుకుపడి.. సీఎం చంద్రబాబు దగ్గర మార్కులు సంపాయించుకున్నారన్న వాదన కూడా వినిపించింది. ఇక, ఆయన రిటైర్మెంట్ తర్వాత.. పదువులు లభిస్తాయని అనుకున్నా రు.
కానీ.. సామాజిక వర్గం కారణంగా ఆయనకు పదవులు లభించలేదన్న చర్చ అప్పట్లోనే సాగింది. ఇదిలా వుంటే.. అప్పట్లో కేంద్రం తీసుకువచ్చిన ఓ నిర్ణయం కూడా సదరు మాజీ డీజీపీకి పదవిని దూరం చేసింది. ఉన్నతస్థాయి అధికారులు రిటైర్మెంట్ తీసుకున్నాక.. కనీసంలో కనీసం 6 మాసాలైనా పదవులకు దూరంగా ఉండాలని కేంద్రం చెప్పడంతో ప్రభుత్వం సదరు అధికారికి ఎలాంటి పోస్టింగు ఇవ్వలేదు. ఇదిలావుంటే.. ఆ తర్వాత.. ఆయన పలు మార్పులు అప్పట్లోనే సీఎం ను కలిసినా.. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.
మరోవైపు.. వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత.. సదరు డీజీపీ వ్యవహారంపై దృష్టి పెట్టింది. అమరావతిలో అరటి తోటల దహనం వ్యవహారంపై డీజీపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించడంతో సదరు మాజీ డీజీపీ అమెరికాకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన ఏపీకి రాలేదు. దాదాపు ఐదేళ్లుగా ఆయన అమెరికాలో నే ఉన్నారు. తాజాగా కూటమి సర్కారు రావడం.. సీనియర్ అదికారులకు సలహాదారులగా పోస్టులు ఇవ్వడంతో మరోసారి ఆయన ఏపీపై దృష్టి పెట్టారు. గత మూడు మాసాల కిందటే హైదరాబాద్‌కు వచ్చిన సదరు మాజీ డీజీపీ ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
ఏ పోస్టు కోసం..?
టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీ గా పనిచేసి.. వైసీపీ ప్రభుత్వ వేధింపులకు గురైన ఏబీవెంకటేశ్వర రావుకు కూటమి సర్కారుకు ఏపీ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే.. ఆయన దానిని తీసుకోకుండా.. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. దీంతో ఆ పదవి ఖాళీగానే ఉంది. దీనిని దక్కించుకునేందుకు.. మాజీ డీజీపీ ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఆయనకు సీఎం అప్పాయింట్ మెంటు లభించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి సదరు మాజీ డీజీపీ ప్రయత్నాలు ఏమేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
