కూటమి అంటే ఈవీఎం... ఫుల్ ట్రోల్స్!
"ఏపీలో కూటమి గెలిచింది.. అంటే.. టీడీపీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది.. భారతీయ జనతాపార్టీ కూడా గెలిచిందని అంటున్నారు.
By: Raja Ch | 10 Aug 2025 9:50 AM ISTప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ విషయంపై కర్ణాటక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, చూపించిన నెంబర్లతో ఒక్కసారిగా ఈ చర్చ మరింత తీవ్రంగా మారింది. ఇక ఏపీలో 2024 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ చర్చ మరింత బలంగా మొదలైన సంగతి తెలిసిందే.
అవును... 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైపోవడానికి గల కారణం ఈవీఎంలలో జరిగిన మోసాలే అని నాటి నుంచి నేటి వరకూ బలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అంటే ఈవీఎం లే అని ట్రోల్స్ ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి.
"ఏపీలో కూటమి గెలిచింది.. అంటే.. టీడీపీ గెలిచింది, జనసేన పార్టీ గెలిచింది.. భారతీయ జనతాపార్టీ కూడా గెలిచిందని అంటున్నారు.. కానీ, గెలిచింది కూటమి పార్టీలు కాదు.. గెలిచింది ఈవీఎంలు" అంటూ నారా లోకేష్ వీడియోలతో నెటిజన్లు ట్రోలింగ్స్ బలంగా మొదలుపెట్టారు. ఆ మాటలతో 'జల్సా'లో పవన్ కల్యాణ్ పడిన ఆవేదన సన్నివేశాన్ని జత చేశారు.
ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి ఎన్నో ట్రోల్స్ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు వీటిని షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాను కుదిపేస్తున్నారు.
ఈ ట్రోలింగ్స్ సంగతి అలా ఉంటే... గత ఎన్నికల్లో దేశం మొత్తం మీద ఈవీఎంలలో ఏదో జరిగిందనే చర్చ మాత్రం ఓ వర్గం ఓటర్లలో బలంగా మొదలైందని కొంతమంది అంటుండగా... అప్పటి అధికార పార్టీల పరిస్థితి గురించి ఇప్పుడు మరిచిపోవడం వల్ల అలాంటి కామెంట్లు చేస్తున్నారని మరొక వర్గం వారు వాదిస్తున్న పరిస్థితి.
మరోవైపు 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటక అసెంబ్లీ సెగ్మెంట్ లో భారీ ఓటర్ల మోసం జరిగిందని దర్యాప్తులో తేలిందని.. ఎన్నికలను దొంగిలించడానికి ఎన్నికల సంఘం అధికార బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
