ఎవరెస్ట్ 'గ్రీన్ బూట్స్' మిస్టరీ వీడింది.. 30 ఏళ్ల తర్వాత కిందకు రానున్న భారత పర్వతారోహకుడి మృతదేహం
ఎవరెస్ట్ పర్వతారోహణ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన, విషాదకరమైన ఒక మిస్టరీకి ఎట్టకేలకు తెరపడబోతోంది.
By: A.N.Kumar | 1 July 2026 10:44 PM ISTఎవరెస్ట్ పర్వతారోహణ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన, విషాదకరమైన ఒక మిస్టరీకి ఎట్టకేలకు తెరపడబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ ఉత్తర మార్గంలో ప్రయాణించే ప్రతి పర్వతారోహకుడికి సుపరిచితమైన "గ్రీన్ బూట్స్" గడ్డకట్టిన మృతదేహాన్ని దాదాపు 30 ఏళ్ల తర్వాత కిందకు తీసుకురావడానికి భారత అధికారులు ఒక చారిత్రాత్మక రికవరీ మిషన్‌ను ప్రారంభించారు.
30 ఏళ్లుగా 'డెత్ జోన్'లోనే..
సముద్ర మట్టానికి సుమారు 27,000 అడుగుల ఎత్తులో, ప్రాణవాయువు అత్యంత తక్కువగా ఉండే ప్రమాదకరమైన "డెత్ జోన్" లో ఈ మృతదేహం 1996 నుంచి అలాగే ఉండిపోయింది. ఆ మృతదేహానికి ఉన్న ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు బూట్ల కారణంగా దీనికి "గ్రీన్ బూట్స్" అనే పేరు వచ్చింది. టిబెట్ వైపు నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించే వారికి ఈ మృతదేహం ఒక మైలురాయిగా తాము శిఖరానికి ఎంత దగ్గరగా ఉన్నామో తెలిపే ఒక ల్యాండ్‌మార్క్‌గా మారిపోయింది.
సవాల్‌తో కూడిన రికవరీ మిషన్
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ తాజాగా ఈ మృతదేహాన్ని సురక్షితంగా కిందకు తీసుకురావడానికి ప్రత్యేక ఏజెన్సీల నుంచి బిడ్లను ఆహ్వానించింది. టెండర్ నిబంధనల ప్రకారం.. ఎంపికైన బృందం రాబోయే అక్టోబర్ నాటికి ఈ అవశేషాలను ఢిల్లీకి తరలించాల్సి ఉంటుంది. అయితే ఈ ఆపరేషన్ సాధారణమైనది కాదు. ఎవరెస్ట్ షెర్పా ఎక్స్‌పెడిషన్ వ్యవస్థాపకుడు త్షిరింగ్ జాంగ్బు షెర్పా తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరెస్ట్ ఎక్కడం కంటే.. అక్కడ గడ్డకట్టిన మృతదేహాన్ని కిందకు తీసుకురావడం రెట్టింపు ప్రమాదకరం... ఈ మిషన్ కోసం కనీసం 10 మంది అత్యంత అనుభవజ్ఞులైన షెర్పాలు అవసరమవుతారు. తీవ్రమైన చలి, మంచు తుఫానులు, తక్కువ ఆక్సిజన్ వంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మృతదేహాన్ని వెలికితీయడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది.
వీడిన అసలు గుర్తింపు మిస్టరీ
గత మూడు దశాబ్దాలుగా ఆ గ్రీన్ బూట్స్ మృతదేహం 1996 మే 10న ఎవరెస్ట్ మంచు తుఫానులో ప్రాణాలు కోల్పోయిన 28 ఏళ్ల ఐటీబీపీ జవాన్ త్సేవాంగ్ పాల్జోర్ ది అని ప్రపంచమంతా భావించింది. ఆ రోజు ముగ్గురు భారతీయ పర్వతారోహకులు గల్లంతయ్యారు. కానీ, తాజాగా ఐటీబీపీ విడుదల చేసిన టెండర్ పత్రాలు, అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆ మృతదేహం పాల్జోర్‌ది కాదు. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా అది ఆయనతో పాటు వెళ్లిన మరో భారతీయ పర్వతారోహకుడు దోర్జే మోరుప్ దని అధికారికంగా నిర్ధారణ అయింది.
ఈ అత్యంత క్లిష్టమైన రికవరీ మిషన్ గనుక విజయవంతమైతే, ఎవరెస్ట్ చరిత్రలోనే అత్యంత చర్చనీయాంశమైన "గ్రీన్ బూట్స్" కథకు అధికారిక ముగింపు లభిస్తుంది. అలాగే 30 ఏళ్లుగా ఎవరెస్ట్ మంచు గుండెల్లో గడ్డకట్టుకుపోయిన ఓ భారతీయ వీరుడి అవశేషాలు చివరకు గౌరవప్రదంగా వారి కుటుంబ సభ్యుల చెంతకు చేరుకుంటాయి.
