పెట్రోల్ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్
తాజా గణాంకాలు చూస్తే.. పెట్రోల్ రాజా గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.
By: A.N.Kumar | 7 Aug 2026 10:38 PM IST"లీటరు పెట్రోల్ పోయించాలంటే బాండ్ పేపర్‌పై సంతకం పెట్టినంత భయమేస్తోంది సార్" ఇది ఈమధ్య పెట్రోల్ బంకుల్లో సామాన్యుడు పాడుకుంటున్న నిత్య ప్రార్థన. ఒకప్పుడు భారత ఆటోమొబైల్ రాజ్యంలో "నేనే రాజు.. నేనే మంత్రి" అని విర్రవీగిన పెట్రోల్ బాబుగారికి ఇప్పుడు రోజులు అస్సలు బాగోలేవు. మనోడి హవాకు చెక్ పెడుతూ.. ఎలక్ట్రిక్ (ఈవీ), సీఎన్‌జీ , హైబ్రిడ్ వాహనాలు కలిసి గట్టిగానే ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తున్నాయి. భారత వాహనదారులు ఇప్పుడు పెట్రోల్ బంకుల వైపు చూసి నమస్కారం పెట్టేసి ఆదా మార్గాలైన ఛార్జింగ్ సాకెట్లు, సీఎన్‌జీ బంకుల వైపు తమ చూపు మళ్లిస్తున్నారు. పెట్రోల్ భారం తగ్గించుకోవాలనే ఆలోచనే వినియోగదారులను ఈ కొత్త ట్రెండ్ వైపు పరుగులు తీయిస్తోంది.
తాజా గణాంకాలు చూస్తే.. పెట్రోల్ రాజా గారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. 2026 జులై నాటికి మన ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, హైబ్రిడ్ వాహనాల గ్యాంగ్ ఏకంగా 40.6 శాతం వాటా కొట్టేసింది. అదే సమయంలో పెట్రోల్ కార్ల వాటా 41.7 శాతానికి పడిపోయి మూలన పడే పరిస్థితికి వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య తేడా కేవలం ఒక్క శాతానికి మాత్రమే పరిమితమైంది. నిన్నమొన్నటి వరకు అంటే గత ఏడాది ఇదే సమయానికి ఈ తేడా ఏకంగా 13.2 శాతంగా ఉండేది. ఏడాది తిరిగేసరికి పెట్రోల్ కార్ల మార్కెట్ వాటా 47.6 శాతం నుంచి 41.6 శాతానికి పడిపోవడం చూస్తుంటే పెట్రోల్ ప్రియులకు 'కరెంట్ షాక్' తగలడం ఖాయం.
కార్ల సంగతి అలా ఉంచితే ద్విచక్ర వాహనాల విభాగంలో కూడా ఈవీ స్కూటర్లు, బైకులు సైలెంట్‌గా వచ్చి పెద్ద శబ్దమే చేస్తున్నాయి. గతేడాది 7.7 శాతంగా ఉన్న ఎలక్ట్రిక్ బైకుల అమ్మకాలు ఇప్పుడు ఏకంగా 11.2 శాతానికి చేరాయి. నగరాల్లో రోజువారీ ఆఫీసు ప్రయాణాలకు పెట్రోల్ పోయించి పాకెట్ ఖాళీ చేసుకునే కంటే ఇంట్లోనే స్మార్ట్‌ఫోన్‌లాగా బైక్‌ను ఛార్జింగ్ పెట్టుకోవడం నయమని జనం ఫిక్స్ అయిపోయారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో సీఎన్‌జీ, మెరుగైన ఇంధన పొదుపుతో హైబ్రిడ్, అసలు పొగ-శబ్దం లేని ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి.
కేవలం ప్రజల ఆలోచనే కాదు ప్రభుత్వం కూడా ఈ మార్పుకు గట్టిగానే ఊతమిస్తోంది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించే విధానాలు, ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ, దేశీయ తయారీకి ప్రాధాన్యం ఇస్తూ ఈవీ రంగానికి బూస్ట్ ఇస్తోంది. దీనికి తోడు ఆటోమొబైల్ కంపెనీలు సైతం వరుస పెట్టి కొత్త ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లను మార్కెట్లోకి వదులుతుండటంతో వినియోగదారులకు ఎంపికలు కూడా బాగా పెరిగిపోయాయి.
అలా అని పెట్రోల్ కార్లు రేపే హిమాలయాలకు వెళ్లిపోతాయని మార్కెట్ నుంచి పూర్తిగా అంతరించిపోతాయని అనుకుంటే పొరపాటే అవుతుంది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ సదుపాయాలు ఇంకా అన్ని మూలలా అందుబాటులోకి రాకపోవడం.. ఊళ్లకు వెళ్లేటప్పుడు "మధ్యలో బ్యాటరీ అయిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్?" అనే ఆందోళనలు, బ్యాటరీ మార్పిడి ధరలు ఇంకా కొరకరాని కొయ్యగానే ఉన్నాయి.
ఏది ఏమైనా పెట్రోల్ రాజు గారి ఏకఛత్రాధిపత్యానికి మాత్రం కాలం చెల్లిందనేది పచ్చి నిజం. సైలెంట్‌గా వచ్చి దంచికొడుతున్న ఈ కొత్త ప్రత్యామ్నాయ ఇంధన విప్లవం భారత రవాణా రంగాన్ని ఒక సరికొత్త ఊపు ఊపుతోంది.
