మొన్న ఫ్రాన్స్.. నేడు జర్మనీ.. జెన్ జీ యువత తిరుగుబాటుకు కారణమేంటి?
ఒకప్పుడు వినోదానికి.. కాస్ట్యూమ్ పార్టీలకు వేదికగా నిలిచిన పండుగలు ఇప్పుడు ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే ఉద్యమ వేదికలుగా మారుతున్నాయి.
By: A.N.Kumar | 1 Nov 2026 8:35 PM ISTఒకప్పుడు వినోదానికి.. కాస్ట్యూమ్ పార్టీలకు వేదికగా నిలిచిన పండుగలు ఇప్పుడు ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తే ఉద్యమ వేదికలుగా మారుతున్నాయి. మొన్నటివరకు ఫ్రాన్స్‌ను కుదిపేసిన యువత నిరసన జ్వాలలు.. ఇప్పుడు జర్మనీకి పాకాయి. ఐరోపా వ్యాప్తంగా ‘జెన్ జీ’ యువతరం రోడ్లపైకి వచ్చి తమ భవిష్యత్తు కోసం గొంతుకల విప్పుతోంది. హాలోవీన్ వేడుకల సందడిని సైతం పక్కనబెట్టి తమ ప్రాథమిక హక్కులు, జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలపై బెర్లిన్ నుంచి పారిస్ వరకు వేలాది మంది యువతీ యువకులు నిరసన బాట పట్టడం ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
సాధారణంగా ప్రతి ఏటా హాలోవీన్ సమయంలో యూరప్ నగరాలు వినోదభరిత వాతావరణంలో మునిగితేలుతుంటాయి. అయితే ఈసారి జర్మనీలోని బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్, కొలోన్, మ్యూనిచ్ వంటి ప్రధాన నగరాల్లో భిన్నమైన వాతావరణం కనిపించింది. వింత వేషధారణలతోనే హాలోవీన్ నిరసన ర్యాలీలు చేపట్టిన యువత.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. విద్య, ఉపాధి, పర్యావరణం వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ ర్యాలీలు నిర్వహించారు.
యువత ఇంత పెద్ద ఎత్తున రోడ్డెక్కడానికి పలు కీలక సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. యూరప్ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం వల్ల యువత తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. విశ్వవిద్యాలయాలు, పాఠశాలల్లో నిధుల కోత విద్యా వ్యవస్థ నాణ్యతను దెబ్బతీస్తోంది. భవిష్యత్ తరాల నివాస యోగ్యతకు పర్యావరణ పరిరక్షణ ముఖ్యం అని మొత్తుకుంటున్నా ప్రభుత్వాల వైఖరిలో ఆశించిన మార్పు రావడం లేదు. ముఖ్యంగా జర్మనీలో తిరిగి తప్పనిసరి సైనిక సేవను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు జెన్ జీ యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. తమ ఇష్టంతో సంబంధం లేకుండా నిర్ణయాలు రుద్దడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు.
మరోవైపు ఫ్రాన్స్‌లో కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. గతంలో దేశాన్ని ఊపేసిన ‘ఎల్లో వెస్ట్స్’ తరహా ఉద్యమం మళ్లీ పురుడుపోసుకునే సంకేతాలు కనిపిస్తుండటంతో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. హాలోవీన్ సందర్భంగా నిరసనకారులు శాంతియుతంగా వ్యవహరించాలని.. ముఖాలు స్పష్టంగా కనిపించేలా కాస్ట్యూమ్స్ ధరించాలని నిర్వాహకులు సూచించినప్పటికీ నిరసనకారులు వినలేదు. రోడ్లపైకి వచ్చారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
ఈ పరిణామాలు కేవలం తాత్కాలిక నిరసనలు కావు. భవిష్యత్తును నిర్ణయించే విధాన రూపకల్పనలో తమకూ భాగస్వామ్యం కావాలని యూరోపియన్ జెన్ జీ యువత ఇస్తున్న బలమైన సందేశం. యువత ఆకాంక్షలను.. అసంతృప్తిని తక్కువగా అంచనా వేస్తే.. రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలు మరింత ఉధృతమై ప్రభుత్వాల ఉనికికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
