మండుతోన్న యూరోప్.. అసలు కారణమేంటి?
ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తింపు ప్రకారం ఐరోపా ఖండంలో మొత్తం 44 దేశాలు ఉండగా.. యూరోపియన్ యూనియన్ లో మాత్రం 27 దేశాలు ఉన్నాయి.
By: Garuda Media | 18 Oct 2026 12:28 PM ISTప్రశాంతమైన జీవనానికి.. సంపన్న సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి యూరోపియన్ దేశాలు. చరిత్రలోకి వెళితే ఒకప్పుడు ప్రపంచాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని వందలాది దేశాల్ని శాసించటమే కాదు.. భారీ ఎత్తున సహజ వనరులను కొల్లగొట్టటం..తమ ఆధిక్యతను నిలుపుకోవటానికి కోట్లాది మంది ప్రాణాలను తీసేందుకు సైతం వెనుకాడని చరిత్ర యూరోప్ సొంతం. దాదాపు 500 ఏళ్లు ఐరోపా ఖండానికి చెందిన బ్రిటన్.. ఫ్రాన్స్.. పోర్చుగల్.. డచ్.. బెల్జియం..దేశాలు ప్రపంచంలోని పలు దేశాల్ని వలసవాదంతో పాలించాయి. వారి సహజవనరుల్ని కొల్లగొట్టాయి. భారతదేశంతో పాటు పలు ఆసియా దేశాల్ని.. ఆఫ్రికా ఖండంలోని దేశాలు మాత్రమే కాదు.. ఇప్పటి ప్రపంచానికి పెద్దన్న అమెరికాను సైతం యూరోపియన్ దేశాలే పాలించాయి.
ప్రపంచ దేశాల సంపదను.. వనరులను దోచుకోవటంలో ఏ మాత్రం మొహమాటం.. పాపభీతిని ప్రదర్శించని ఈ దేశాలు ఆర్థికంగా బలపడటమే కాదు.. సంపన్నంగా మారాయి. విలాసవంతమైన జీవనానికి తెర తీశాయి. వారి అధీనంలోని వలస రాజ్యాలు స్వాతంత్య్రాన్ని సొంతం చేసుకోవటం.. ఏ దేశానికి ఆ దేశం తమ ఆస్తిత్వాన్ని చాటుకోవటంతో కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన ఆ దేశాలు ఇప్పుడు అశాంతికి చిహ్నాలుగా మారాయి. ఉపాధి కోసం.. పెరిగిన ధరలు.. విద్యా వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాలంటూ తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయా దేశాలకు చెందిన పౌరులు రోడ్ల మీదకు వస్తున్నారు. సొంత ప్రభుత్వాల మీదే ఆందోళనలు చేస్తూ.. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న వైనం ఇప్పుడు యూరోప్ లోని పలు దేశాల్లో కనిపిస్తోంది.
ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తింపు ప్రకారం ఐరోపా ఖండంలో మొత్తం 44 దేశాలు ఉండగా.. యూరోపియన్ యూనియన్ లో మాత్రం 27 దేశాలు ఉన్నాయి. వారందరికి ఒకే కరెన్సీ (యూరో) చెలామణిలో ఉన్న సంగతి తెలిసిందే. యూరోప్ దేశాలకు భౌగోళిక సరిహద్దులుగా రష్యా.. టర్కీ.. కజకిస్తాన్.. జార్జియా.. అజర్ బైజాన్ లాంటి దేశాలు ఉన్నాయి. తాజాగా నిరసనలతో అట్టుడుగుతున్న దేశాలుగా ఫ్రాన్స్.. బెల్జియం.. పోర్చుగల్.. ఇటలీ.. గ్రీస్.. అల్బేనియా.. జర్మనీ దేశాల్లో నిరసనకారుల నిరసనలతో మండుతున్నాయి. అక్కడి ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఫ్రాన్స్ విషయానికి వస్తే.. అక్కడి స్కూళ్లలో మౌలిక వసతుల కొరత.. టీచర్ల కొరతతో పాటు.. పెరిగిన జీవన వ్యయం.. ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబరు 17-18 తేదీల్లో జరిగిన నిరసనల్లో లక్షలాది మంది పాల్గొనటం గమనార్హం. పారిస్.. మార్సేయ్ లాంటి నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు జరగటం గమనార్హం. బెల్జియం విషయానికి వస్తే..అక్కడి వర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు.. విద్యారంగంలో బడ్జెట్కోతలు.. నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలతో రాజధాని బ్రస్సెల్స్ నగరం అట్టుడుతోంది. ఆందోళనకారులను అడ్డుకోవటం కోసం పోలీసుల లాఠీ ఛార్జ్ తో పాటు టియర్ గ్యాస్.. వాటర్ క్యానన్లను ప్రయోగించాల్సిన పరిస్థితి.
పోర్చుగల్ విషయానికి వస్తే తక్కువ వేతనాలు.. జీవన వ్యయాలు పెరగటంతో పాటు ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరగటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటలీలో పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా భారీ నిరసనలుచోటు చేసుకుంటున్నాయి. సామాజిక సంక్షేమ బడ్జెట్లను కాపాడాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక.. విద్యా సంస్కరణలు.. బడ్జెట్ కోతలు.. ఆర్థిక ఇబ్బందులపై గ్రీస్.. అల్బేనియా.. జర్మనీ దేశాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనలు కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలకు కారణంగా మారుతున్నాయి.
ఎందుకిలా జరుగుతోంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తాయి. డోమినో ఎఫెక్ట్ గా కొందరు విశ్లేషిస్తున్నారు. ఒక దేశంలో విజయవంతమైన పోరాటం.. దాని పక్కనే ఉన్న దేశంలోని ప్రజల్లో స్ఫూర్తిని నింపటంతో పాటు.. తెర వెనుక ఉన్న కొన్ని శక్తులు.. వ్యవస్థాగత లోపాలను ఎత్తి చూపుతూ ఆందోళనలకు తెర తీస్తున్నారు. దీంతో నిరసనలు పెరుగుతున్న దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చైన్ సిస్టం మాదిరిగా ఉన్న నిరసనలకు సోషల్ మీడియా (టిక్ టాక్.. టెలిగ్రామ్.. ఎక్స్.. యూట్యూబ్.. ఇన్ స్టా) కీలకంగా మారుతున్నాయి.
ఆందోళనకారులు.. నిరసనకారులు తమ వాదనల్ని వినిపించేందుకు ఈ వేదికల్ని ఆయుధాలుగా వినియోగిస్తున్నాయి. తమదైన నెరెటివ్ ను క్రియేట్ చేసి జనాల మీదకు వదులుతున్నాయి. ఒక దేశంలోని నిరసనలు.. మరో దేశంలోని ఆందోళనకారులకు స్ఫూర్తిగా మారుతున్నాయి. ఫ్రాన్స్ లో విద్యార్థులు.. కార్మికులు రోడ్ల మీదకు వచ్చి అక్కడి ప్రభుత్వానికి చెమటలు పట్టించిన విజువల్స్ నిమిషాల వ్యవధిలో ఆ దేశానికి దగ్గర్లోని బెల్జియం.. పోర్చుగల్ యూత్ కు చేరటం.. తమ సమస్యల పరిష్కారానికి ఆందోళనల బాట పట్టటమే అన్న భావన యువతలో వేగంగా పెరుగుతోంది. దీనికి తోడు ఐరోపా వ్యాప్తంగా ఉన్నకార్మిక సంఘాలు.. విద్యార్థి సంఘాలు డిజిటల్ గ్రూపుల ద్వారా కనెక్ట్ అవుతూ.. తమ నిరసనల వ్యూహాలను. .నినాదాలను మరో దేశానికి ఆందోళనలకు ముడి సరుకుగా అందిస్తున్నాయి.
యూరోప్ లో జరుగుతున్న ఈ వరుస ఆందోళన వెనుక బయట శక్తులు కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు ఐరోపా దేశాలు మద్దతు ఇస్తున్నాయి. దీనికి ప్రతీకారంగా రష్యా లాంటి దేశాల డిజిటల్ వేదికల్ని ఆయుధాలుగా మార్చుకొని ఆ దేశాల్లోని అంతర్గత సమస్యల మీద ఫోకస్ చేస్తున్నట్లుగా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో నిరసనలను మరింత పెంచేలా ఫేక్ అకౌంట్లు.. బాట్లు కుప్పలుగా వెల్లువెత్తతూ.. సరికొత్త సవాళ్లను విసురుతున్నట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు గడిచిన కొన్నేళ్లుగా మధ్యప్రాచ్యం.. ఆఫ్రికా దేశాల నుంచి వలసలు భారీ ఎత్తున పెరగాయి. దీంతో.. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు తగ్గాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ నిధులు వలసదారులకు వెళుతున్నాయన్న అసంతృప్తి అంతకంతకూ పెరిగి ఆగ్రహంగా మారినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో ఉంచుకొని వారిపై అధికారం చెలాయించారో.. ఇప్పుడు ఆయా దేశాలకు చెందిన వలసలు ఐరోపా దేశాల్లో కలకలాన్ని క్రియేట్ చేస్తున్న వైనం చూస్తే..కర్మ ఎవరిని వదిలి పెట్టదన్న భావన కలుగక మానదు. కాకపోతే కొన్ని దశాబ్దాల సమయం పట్టిందంతే.
