Begin typing your search above and press return to search.

ట్రంప్ కు దెబ్బకు దెబ్బ.. ఈయూ ప్రతీకారం షురూ

మొండితనం నా మొగుడు అన్నట్టు ముందుకెళుతున్న డొనాల్డ్ ట్రంప్ కు స్నేహితులే షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

By:  A.N.Kumar   |   19 Jan 2026 11:30 AM IST
ట్రంప్ కు దెబ్బకు దెబ్బ.. ఈయూ ప్రతీకారం షురూ
X

మొండితనం నా మొగుడు అన్నట్టు ముందుకెళుతున్న డొనాల్డ్ ట్రంప్ కు స్నేహితులే షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అగ్రరాజ్యం అంటూ అందరినీ కబళిస్తామంటే చూస్తూ ఊరుకోమని యూరప్ దేశాలన్నీ కలిసిగట్టుగా అమెరికాపై పోరాడేందుకు రెడీ అవుతున్నాయి. ట్రంప్ విధిస్తున్న టారిఫ్ లకు ప్రత్యామ్మాయంగా అమెరికాను దెబ్బకు దెబ్బ తీసే ఎత్తుగడను అమలుచేస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి అంతర్జాతీయ వాణిజ్య రంగంలో పెను సంచలనానికి దారితీస్తోంది. ముఖ్యంగా గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్స్ విధించడం ఇప్పుడు యూరోపియన్ యూనియన్‌కు కంటగింపుగా మారింది. అమెరికా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఈయూ తన అమ్ములపొదిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని బయటకు తీస్తోంది.

ఏమిటీ ‘ట్రేడ్ బజూకా’?

వాణిజ్య యుద్ధంలో ప్రత్యర్థి దేశానికి భారీ ఆర్థిక నష్టం కలిగించేలా ప్రయోగించే కఠినమైన సుంకాలను ‘ట్రేడ్ బజూకా’గా అభివర్ణిస్తారు. ఈయూ చరిత్రలో ఇలాంటి అస్త్రాన్ని ప్రయోగించడం ఇదే తొలిసారి కానుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న కీలక ఉత్పత్తులపై వీటిని ఈయూ ప్రయోగించనుంది. సుమారు 93 బిలియన్ యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 9.8 లక్షల కోట్లు) విధించనున్నారు. ట్రంప్ విధించిన సుంకాలను దీటుగా ఎదుర్కొంటూనే అమెరికా ఎగుమతులపై భారీ టారిఫ్స్ విధించనున్నారు.

రాయిటర్స్ నివేదికతో వెలుగులోకి..

అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించిన కథనం ప్రకారం.. యూరోప్ దేశాల ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడమే ఈయూ ప్రధాన ఉద్దేశం. ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల యూరోపియన్ ఉత్పత్తులు ఖరీదైపోయి అక్కడి పరిశ్రమలు కుదేలయ్యే ప్రమాదం ఉంది. అందుకే, "దెబ్బకు దెబ్బ" తీయడమే సరైన మార్గమని ఈయూ భావిస్తోంది.

ప్రపంచ మార్కెట్లపై పెను ప్రభావం?

ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే దాని ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమలోని కార్ల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, చిప్స్ సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు. చమురు, గ్యాస్ ధరలపై కూడా దీని నీడ పడే ప్రమాదం ఉంది.

ప్రస్తుతం ఈయూ నిర్ణయం ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ‘ట్రేడ్ బజూకా’ నిజంగానే ప్రయోగించి అమెరికాకు షాక్ ఇస్తుందా? లేక దౌత్యపరమైన చర్చల ద్వారా ట్రంప్ మెడలు వంచుతుందా? అన్నది వేచి చూడాలి.