విధి ఆడిన వింత నాటకం.. 4 వేల కిలోమీటర్ల ఆశల ప్రయాణం.. హైదరాబాద్ చేరకముందే అనంత లోకాలకు చిన్నారి
కానీ దురదృష్టం.. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని వైద్యులు ప్రకటించారు.
By: A.N.Kumar | 28 Jun 2026 12:03 PM ISTకన్నబిడ్డ ప్రాణాలను కాపాడుకోవాలనే ఆరాటం ఆ తల్లిదండ్రులను సరిహద్దులు దాటించింది. "మా పాపకు నయమైపోతుంది.. మళ్లీ నవ్వుతూ ఆడుకుంటుంది" అనే ఒకే ఒక్క ఆశతో ఏకంగా 4 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది. కానీ విధి ఆ కుటుంబంపై కనికరం చూపలేదు. చేతికి అందినట్టే అందిన ఆశల తీరం కళ్లముందే కరిగిపోయింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తమ 13 ఏళ్ల కుమార్తెకు మెరుగైన వైద్యం అందించాలనే తపనతో ఇథియోపియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆ కుటుంబానికి ఆస్పత్రి చేరకముందే గుండెకోత మిగిలింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.
ఒక అద్భుతం జరుగుతుందనే ఆశతో..
ఇథియోపియాకు చెందిన ఆ 13 ఏళ్ల బాలిక కొంతకాలంగా ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోంది. స్వదేశంలో వైద్యం చేయించినా పరిస్థితి విషమించడంతో తల్లిదండ్రుల గుండెలు నలిగిపోయాయి. ఎలాగైనా తమ కంటిపాపను బతికించుకోవాలని వారు తపించారు. హైదరాబాద్‌లోని వైద్య సేవలు, ఇక్కడి ప్రముఖ ఆస్పత్రుల గురించి తెలుసుకుని, ఇక్కడికి వస్తే తమ బిడ్డ ప్రాణాలు దక్కుతాయని నమ్మారు. ఆ నమ్మకమే వారిని నడిపించింది. ఉన్నదంతా అమ్ముకుని.. అప్పులు చేసి, చేతిలో ఉన్న చివరి పైసాను కూడా కూడబెట్టుకుని ప్రయాణమయ్యారు. సుదీర్ఘమైన 4 వేల కిలోమీటర్ల ప్రయాణం.. మనసంతా ఆందోళన, కళ్లల్లో మాత్రం తమ బిడ్డ కోలుకుంటుందనే ఆశల వెలుగులతో వారు విమానం ఎక్కారు.
తీరం చేరే ముందే ఆరిపోయిన దీపం..
కానీ కాలం వారి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించింది. ఇథియోపియా నుంచి బయలుదేరిన విమానం సుదీర్ఘ ప్రయాణం ముగించుకుని.. శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడానికి కొద్ది నిమిషాల ముందు ఆ చిన్నారి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఊపిరి తీసుకోవడానికి బాలిక విలవిలలాడిపోయింది. విమాన సిబ్బంది వెంటనే స్పందించి, ల్యాండింగ్ కాగానే ఎయిర్‌పోర్ట్ అత్యవసర వైద్య విభాగానికి తరలించారు.
కానీ దురదృష్టం.. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయని వైద్యులు ప్రకటించారు. విమానాశ్రయం బయట ఎదురుచూస్తున్న అంబులెన్స్, ఆస్పత్రి బెడ్.. అన్నీ అలాగే ఉండిపోయాయి. ఆ తల్లిదండ్రుల ఆశల సామ్రాజ్యం క్షణాల్లో కూలిపోయింది. తమ కళ్లముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లీదండ్రుల రోదనలు ఎయిర్‌పోర్ట్ ప్రాంగణాన్ని కలచివేశాయి.
స్వదేశానికి తీసుకెళ్లే స్థోమత లేక.. ఇక్కడే అంత్యక్రియలు
ఈ విషాదం అంతటితో ఆగలేదు. తమ బిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇథియోపియాకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత కూడా ఆ పేద తల్లిదండ్రుల వద్ద లేకపోవడం మరో ఘోర కలికాలం. కూతురి వైద్యం కోసమే సర్వస్వం ధారపోసిన ఆ దంపతులు, మృతదేహాన్ని స్వదేశానికి తరలించే అంత ఖర్చును భరించలేకపోయారు. దీంతో గుండె నొచ్చుకుంటూనే కన్నీటి నదిని దాటుకుంటూ.. హైదరాబాద్‌లోనే తమ కుమార్తెకు అంత్యక్రియలు నిర్వహించాలని ఆ నిస్సహాయ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు.
ఆలోచింపజేసే నిజం..
వైద్య సేవల కోసం సరిహద్దులు దాటి వేరే దేశాలకు వచ్చే ఎన్నో పేద కుటుంబాల నిస్సహాయతను, కష్టాలను ఈ సంఘటన మరోసారి కళ్లకు కట్టింది. ఒక అద్భుతం జరుగుతుందనే ఆశతో ప్రారంభమైన ఆ 4 వేల కిలోమీటర్ల ప్రయాణం.. చివరకు గుండెల్ని పిండేసే మహా విషాదంగా ముగిసింది. ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని.. ఆ తల్లిదండ్రులకు ఈ శోకాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుందాం.
