Begin typing your search above and press return to search.

ఎచ్చెర్ల సీటుకు టీడీపీలో కొత్త పోటీ ?

శ్రీకాకుళం జిల్లా ముఖ ద్వారంగా ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటుకు అపుడే పోటీ స్టార్ట్ అయిపోయింది.

By:  Satya P   |   19 Jun 2026 9:16 AM IST
ఎచ్చెర్ల సీటుకు టీడీపీలో   కొత్త పోటీ ?
X

శ్రీకాకుళం జిల్లా ముఖ ద్వారంగా ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ సీటుకు అపుడే పోటీ స్టార్ట్ అయిపోయింది. నిజానికి ఈ సీటు కోసం 2024 లోనే కీలక నేతలు గట్టి ప్రయత్నాలు చేశారు. మాజీ మంత్రి ఏపీ టీడీపీ తొలి అధ్యక్షుడు అయిన కిమిడి కళా వెంకట్రావు తన కుమారుడి కోసం అడిగారని ప్రచారం సాగింది. అలా తన కొడుక్కి ఆ సీటు ఇస్తే తాను విజయనగరం ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. చివరికి ఆయనను విజయనగరం జిల్లా చీపురుపల్లి లో పోటీ చేయమని అధినాయకత్వం ఆదేశించింది. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి వెళ్ళింది.

ఎంపీ గారి చూపు :

అంతే కాదు విజయనగరం ఎంపీగా అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చి లాస్ట్ మినిట్ లో సీటు దక్కించుకున్న కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఎచ్చెర్ల మీదనె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆయనను ఎంపీగా చేయమని హై కమాండ్ కోరడంతో ఆయన అక్కడకు వెళ్లారు. ఘన విజయం సాధించారు. అయితే అటు కళా వెంకట్రావు ఇటు కలిశెట్టి అప్పలనాయుడు తమ మూలాలను మరచిపోకుండా ఎచ్చెర్లకు వచ్చి మరీ తమ రాజకీయ పలుకుబడిని పటిష్టం చేసుకుంటున్నారు. తమ వర్గాన్ని గట్టిపరచుకుంటున్నారు. ఇదంతా భవిష్యత్తు మీద ఆలోచనలతోనే అని అంటున్నారు.

ఈసారి చాన్స్ కోసం :

వచ్చే ఎన్నికల్లో అయినా పోటీ చేసి ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యే కావాలని అటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చూస్తున్నారు. ఆయన లోకేష్ బృందంలో కీలకంగా ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి వస్తే కనుక మంత్రి పదవి కూడా కచ్చితంగా దక్కవచ్చు అన్నది ఆయన అభిమానుల ఆలోచనగా ఉంది. అందుకే కలిశెట్టి కూడా వీలు దొరికినపుడల్లా సొంత నియోజకవర్గం మీద ఫుల్ ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. ఇక కళా వెంకట్రావు కుమారుడి చూపు అయితే ఈ సీటు మీదనే ఉంది. కళా కూడా తన వారసుడికి సీటు తెచ్చుకుని తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఇలా ఈ ఇద్దరి నేతల మధ్య ఈ సీటు విషయంలో గట్టి పోటీ ఉన్న నేపధ్యంలో సడెన్ గా మరో ప్రచారం అయితే సాగుతోంది.

ఆయన టీడీపీలోనే :

ప్రస్తుతం ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ఉన్న ఈశ్వరరావు వచ్చే ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఈ సీటుని తిరిగి అందుకుంటారు అని టాక్ అయితే నడుస్తోంది. పూర్వాశ్రమంలో ఈశ్వరరావు టీడీపీకి చెందిన నాయకుడే అని గుర్తు చేస్తున్నారు. ఆ తరువాత ఆయన బీజేపీలోకి వెళ్ళి సీటు పొందారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చి మరీ సీటుని నిలబెట్టుకోవాలని ఈశ్వరరావు కొత్త ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీలో మూడు ముక్కలాట ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ఎచ్చెర్ల సీటు అయితే వెరీ హాట్ గురూ అని ఇప్పటి నుంచే అంతా అంటున్న నేపధ్యం ఉంది.