Begin typing your search above and press return to search.

బుల్లి ఎర్రన్నాయుడుకు బాబు ఆశీస్సులు

ఉత్తరాంధ్ర టైగర్ గా పేరు గడించిన బీసీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు. ఆయన 2012లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు.

By:  Satya P   |   23 Aug 2025 3:58 PM IST
బుల్లి ఎర్రన్నాయుడుకు బాబు ఆశీస్సులు
X

ఉత్తరాంధ్ర టైగర్ గా పేరు గడించిన బీసీ నేత కింజరాపు ఎర్రన్నాయుడు. ఆయన 2012లో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలో నంబర్ టూగా వ్యవహరించేవారు. ఆయన ఢిల్లీలో నాయుడు గా అందరి వద్ద పిలుపించుకొని కేంద్ర స్థాయిలో తాను ఏంటో నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో 1983లో నెగ్గిన ఎర్రన్నాయుడు మొదటి నుంచి చంద్రబాబుతోనే తన రాజకీయ ప్రయాణం చేస్తూ వచ్చారు. బాబుకు ఆయన అత్యంత సన్నిహితుడుగా ఒక ముఖ్య స్నేహితుడిగా ఉండేవారు.

కుడి భుజం విరిగింది :

ఇక చంద్రబాబు అప్పట్లో ఉమ్మడి ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. అది నవంబర్ నెల. రోడ్డు ప్రమాదంలో ఎర్రన్నాయుడు మరణించారు అని వార్త తెలిసి బాబు తన పాదయాత్ర ఆపేసి వచ్చారు. ఎర్రన్న మృత దేహం చూసి ఆయన చలించిపోయారు. తన ప్రాణ స్నేహితుడు ఇక లేడంటూ ఎంతో బాధపడ్డారు. అయితే ఎర్రన్నాయుడు వారసుడిగా కుమారుడు రామ్మోహన్ నాయుడుకు బాబు చాన్స్ ఇచ్చి సొంత కుమారుడిగా ప్రోత్సహించారు. ఇక రామ్మోహన్ నాయుడు కూడా తండ్రికి తగిన తనయుడిగా ఎదిగారు. మంచి వాక్చాతుర్యం తో పాటు భాష మీద పట్టుతో సమయ స్పూర్తి అన్నీ కలసి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ సీటు నుంచి మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సక్సెస్ కొట్టారు.

పిన్న వయసులో కేంద్ర మంత్రిగా :

తండ్రి నాలుగు పదులు దాటిన తరువాత కేంద్ర మంత్రి అయితే రామ్మోహన్ అంతకంటే పిన్న వయసులోనే కెంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతే కాదు కీలకమైన పౌర విమానయాన శాఖను చేపట్టారు. టాప్ ఫైవ్ పోర్టు పోలియోలలో అది ఒకటి. అలా ముందు వరసలో పార్లమెంట్ లో కూర్చునే ఘనతను సాధించారు. ఇదిలా ఉంటే రామ్మోహన్ నాయుడు ఇంట్లో తాజాగా ఒక శుభం జరిగింది. ఆయనకు కుమారుడు పుట్టారు. దాంతో అంతా దానిని ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

బుల్లి ఎర్రన్నాయుడు అంటూ :

రామ్మోహన్ నాయుడు వారసుడిగా బుల్లి ఎర్రన్నాయుడు పుట్టారని శ్రీకాకుళం జిల్లాలో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రామ్మోహన్ నాయుడు ఇంటికి వెళ్ళారు. రామ్మోహన్ నాయుడు కుమారుడిని తన చేతిల్లోకి తీసుకుని బాబు ఎంతగానో మురిసిపోయారు. తన నిండు దీవెలను ఆ బిడ్డకు అందించారు. పుట్టింది ఎవరో కాదు తన ప్రాణ స్నేహితుడు ఎర్రన్నాయుడే అని బాబు ఎంతో ఆనందించారు.

అదృష్ట జాతకుడు :

పుడుతూనే రాజకీయ దిగ్గజం అయిన చంద్రబాబు ఒడిలోకి వెళ్ళిన ఆ బిడ్డ అదృష్ట జాతకుడు అంటున్నారు. బాబు నిండు దీవెనలతో మంచి భవిష్యత్తును అందుకుంటారని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే రామ్మోహన్ నాయుడు సతీమణి మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన బండారు సత్యనారాయణ మూర్తి రెండవ కుమార్తె. దాంతో రెండు వైపుల నుంచి కూడా టీడీపీ బంధం గట్టిగా పెనవేసుకుంది అని అంటున్నారు.

మూడు తరాల వారసత్వం :

ఇదిలా ఉంటే దివంగత ఎర్రన్నాయుడు చంద్రబాబుతో కలిసి పని చేశారు. రామ్మోహన్ లోకేష్ కి కుడి భుజంగా ఉంటూ వస్తున్నారు. ఇక రామ్మోహన్ నాయుడు కుమారుడు లోకేష్ కుమారుడు దేవాన్ష్ తో కలసి పనిచేస్తారు భవిష్యత్తులో అని అంతా ఎంతో ముచ్చటగా చర్చించుకుంటున్నారు. మొత్తానికి బాబు దీవెనలతో ఎర్రన్నాయుడు స్థాయికి ఈ బిడ్డ ఎదుగుతారు అని కింజరాపు కుటుంబం అయితే హర్షం వ్యక్తం చేస్తోంది.