చిన్నపిల్లాడి మాదిరి ఈ కన్నీళ్లేంది ఎర్రబెల్లి?
పవర్ లో ఉంటే ఒకలా.. పవర్ పోతే మరోలా వ్యవహరించటం రాజకీయ నేతలకు మామూలే.
By: Garuda Media | 18 Feb 2026 10:38 AM ISTపవర్ లో ఉంటే ఒకలా.. పవర్ పోతే మరోలా వ్యవహరించటం రాజకీయ నేతలకు మామూలే. కాకుంటే.. అధికారం చేతిలో ఉన్నప్పుడు అహంకారానికి ప్రతిరూపంగా.. తమకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరించినోళ్లు.. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఎదురుదెబ్బలు తగిలినంతనే.. చిన్నపిల్లాడి మాదిరి భావోద్వేగానికి గురై.. కంటతడి పెట్టటం లాంటి పిల్లాడి తరహా చేష్టలకు పాల్పడటం చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ఇప్పుడు ఇలాంటి తీరునే ప్రదర్శించి వార్తల్లో నిలిచారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా కొనసాగి.. పార్టీ ఫిరాయింపుతో బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత మంత్రిపదవిని చేపట్టటం.. ఆ సందర్భంగా ఆయన ప్రదర్శించిన దర్పం అంతా ఇంతా కాదు. నోరు విప్పితే తనకు మించినోళ్లే లేరన్నట్లుగా ఆయన మాటలు ఉండేవి. తాజాగా జరిగిన తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల వేళ ఆయన రియాక్టు అవుతూ..‘రాజకీయాల్లో ఉండాలో.. వద్దో కూడా అర్థం కావటం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యతో పాటు.. కాసిన్ని కన్నీళ్లు కార్చటం ద్వారా.. అయ్యో పాపం ఎర్రబెల్లికి ఎంత కష్టం వచ్చిందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఎర్రబెల్లి లాంటి నేత చివరకు తనకు ఎదురైన ఓటమికి కన్నీళ్లు పెట్టుకోవటం మహా విచిత్రం. తాను అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపుల విషయంలోనూ.. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట తీరు ఎలా ఉందో... ఇప్పుడెలా మారిందన్నది అందరికి తెలిసిందే. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించే తన సొంత నియోజకవర్గమైన పాలకుర్తిలో తొర్రూరు మున్సిపాలిటీని తన సొంత కోటలా ఎర్రబెల్లి భావించేవారు. 2023 ఎన్నికల్లో తాను ఓడిపోవటం.. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ పదవి తన వాళ్లకు మిస్ కావటంతో.. అదే సమయంలో తనకు ఏ మాత్రం పొసగని వారు ఛైర్మన్ కుర్చీలో కూర్చోవటం ఆయనకు ఇబ్బందికరంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. మున్సిపల్ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఎర్రబెల్లిని.. ఆయన సతీమణి ఉషను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రభావోద్వేగానికి గురయ్యారు. వాస్తవానికి ఎర్రబెల్లి సతీమణి ఉష మీదా పలు ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా ఓటమి ఆయన్ను తీవ్రంగా కుంగేలా చేసిందని చెప్పాలి.
