Begin typing your search above and press return to search.

ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: అమెరికా రాజకీయాల్లో మళ్లీ మొదలైన 'ట్రంప్' వివాదం

ఈ పత్రాల విడుదలతో డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకోవడం లేదు.. పైగా కత్తులు దూస్తున్నారు. ఈ ఫైళ్లను ఇన్నాళ్లూ ఎందుకు గోప్యంగా ఉంచారని వారు న్యాయశాఖను నిలదీస్తున్నారు.

By:  A.N.Kumar   |   6 March 2026 6:37 PM IST
ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: అమెరికా రాజకీయాల్లో మళ్లీ మొదలైన ట్రంప్ వివాదం
X

జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం, దశాబ్దాలుగా అమెరికా రాజకీయ, సామాజిక వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా న్యాయశాఖ (డీఓజే) సుమారు 47 వేల పత్రాలను బహిరంగపరచడం.. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలు ప్రస్తావనకు రావడం.. మరోసారి ఈ కేసును కేంద్ర బిందువుగా మార్చింది. ఈ పరిణామాలు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన ఆరోపణలు మాత్రమే కాకుండా.. అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, న్యాయం, రాజకీయ కక్షసాధింపుల చుట్టూ తిరుగుతున్న ఒక సంక్లిష్టమైన చర్చగా మారుతున్నాయి.

పాత గాయాలు.. కొత్త ప్రకంపనలు

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు 1980ల నాటి ఘటనలను గుర్తు చేస్తున్నాయి. ఒక మహిళ ఎఫ్‌బీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ మహిళ తాను మైనర్‌గా ఉన్నప్పుడే జెఫ్రీ ఎప్‌స్టీన్ ద్వారా ట్రంప్‌కు పరిచయం చేయబడ్డానని.. ఆ తర్వాత ఇద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించడం తీవ్ర కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆ సమయంలో ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, అడ్డుకున్నందుకు తనను హింసించారని పేర్కొనడం ఈ కేసులో నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలోనే ఈ ఆరోపణలు చర్చకు వచ్చినప్పటికీ ఇప్పుడు అధికారిక పత్రాల రూపంలో బయటకు రావడం వాటి తీవ్రతను పెంచింది.

రాజకీయ చదరంగం.. డెమోక్రాట్ల డిమాండ్లు

ఈ పత్రాల విడుదలతో డెమోక్రాటిక్ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకోవడం లేదు.. పైగా కత్తులు దూస్తున్నారు. ఈ ఫైళ్లను ఇన్నాళ్లూ ఎందుకు గోప్యంగా ఉంచారని వారు న్యాయశాఖను నిలదీస్తున్నారు. గత ట్రంప్ పాలనలో ఈ కేసు విచారణ ఏ విధంగా సాగిందో ఏ స్థాయిలో ప్రభావం చూపారో తెలియాలంటే పూర్తి స్థాయి విచారణ జరగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది కేవలం న్యాయపరమైన అంశం మాత్రమే కాదు.. ఎన్నికల వేళ ప్రత్యర్థిని ఇరుకున పెట్టడానికి దొరికిన ఒక బలమైన ఆయుధంగా డెమోక్రాట్లు భావిస్తున్నారు.

ట్రంప్ వర్గం ఎదురుదాడి

మరోవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆరోపణలను సుస్పష్టంగా, తీవ్రంగా ఖండించారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని తన ప్రతిష్టను దిగజార్చడానికి ఆడుతున్న డ్రామా అని ఆయన వర్గం వాదిస్తోంది. ఎప్‌స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను ఆయన ఎప్పుడూ తోసిపుచ్చుతూనే ఉన్నారు. న్యాయశాఖ గతంలోనే ఈ ఆరోపణల విషయంలో కొంత గందరగోళం ఉందని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మళ్లీ వాటిని తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

నిష్పాక్షికమైన విచారణే ఏకైక మార్గం

ఎప్‌స్టీన్ కేసులో బాధితుల గోడు ఒకవైపు రాజకీయ నాయకుల పరస్పర ఆరోపణలు మరోవైపు ఉన్నాయి. 47 వేల పత్రాల సమాచారం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇందులో ఎంతో మంది రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖుల ప్రస్తావన ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పత్రాలలోని అంశాలు ఎంతవరకు నిజం? వాటిలో పేర్కొన్న సంఘటనలకు ఆధారాలు ఏమిటి? అనేవి దర్యాప్తు సంస్థలు నిష్పాక్షికంగా తేల్చాలి. కేవలం మీడియా కథనాలు లేదా రాజకీయ ఆరోపణల ప్రాతిపదికన ఎవరినీ దోషులుగా నిర్ధారించలేం.

ఎప్‌స్టీన్ ఫైల్స్ కేవలం గతానికి సంబంధించిన పత్రాలు మాత్రమే కావు.. అవి వర్తమాన రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టించే శక్తివంతమైన పత్రాలు. అమెరికాలో ఈ ఆరోపణలు ప్రజలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. ఏది ఏమైనా న్యాయం గెలవాలి.. బాధితులకు సరైన పరిష్కారం లభించాలి. ఈ మొత్తం వివాదంలో నిజానిజాలు బయటకు రావాలంటే నిష్పక్షపాతమైన, పారదర్శకమైన దర్యాప్తు మాత్రమే ఏకైక మార్గం.