ఎప్ స్టీన్ ఫైల్స్ లో భారత సంతతికి చెందిన దర్శకురాలు... ఎవరీ మీరా!
లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కేసు దర్యాప్తుకు సంబంధించి విడుదలైన ఫైల్స్ లో పలు కీలక వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 31 Jan 2026 2:12 PM ISTలైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్ స్టీన్ కేసు దర్యాప్తుకు సంబంధించి విడుదలైన ఫైల్స్ లో పలు కీలక వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్ లతో పాటు పలువురు బిలియనీర్లు, రాజకీయ నాయకుల పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. ఈ సమయంలో తాజాగా భారత సంతతికి చెందిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు కూడా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.
అవును... ఎప్ స్టీన్ కు సంబధించిన తాజా డాక్యుమెంట్లలో భారత సంతతికి చెందిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు తెరపైకి వచ్చింది. ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి తాజాగా అమెరికా న్యాయ శాఖ 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు, 1,80,000 ఫోటోలు, 2,000 వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో.. వాటిలో తాజాగా మీరా నాయర్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె న్యూయార్క్ మేయర్ మమ్దానీకి తల్లి కావడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది.
2009లో ఆమె తీసిన "అమేలియా" సినిమా తర్వాత లైంగిక అక్రమ రవాణాదారు గిస్లైన్ మాక్స్ వెల్ ఇంట్లో జరిగిన పార్టీకి ఆమె జారైనట్లు తాజా ఫైల్స్ వెల్లడించాయి. అక్టోబర్ 21 - 2009న పెగ్గీ సీగల్.. ఎప్ స్టీన్ కు పంపిన ఈ-మెయిల్ లో ఈ విషయం కనిపించిందని అంటున్నారు! ఈ పార్టీ నుంచి నిష్క్రమించిన తర్వాత సీగల్ తెల్లవారుజామున ఈ ఈ -మెయిల్ పంపినట్లు చెబుతున్నారు. ఈ పార్టీకి బిల్ క్లింటన్, అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కూడా హాజరయ్యారు.
ఈ ఈ-మెయిల్ లో... 'సినిమా కోసం జరిగిన పార్టీ తర్వాత గిస్లైన్ టౌన్ హౌస్ నుంచి ఇప్పుడే బయలుదేరాను.. బిల్ క్లింటన్, జెఫ్ బెజోస్ కూడా అక్కడ ఉన్నారు.. జీన్ పిగోని, డైరెక్టర్ మీరా నాయర్ మొదలైనవారు ఉన్నారు' అని రాసి ఉందని చెబుతున్నారు. కాగా... న్యూయార్క్ నగరానికి 112వ మేయర్ గా జోహ్రాన్ మమ్దానీ 2026 జనవరి 1న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
మీరా నాయర్ తన సినిమా కెరీర్ లో 12 సినిమాలు, 5 డాక్యుమెంటరీలు, 6 షార్ట్ ఫిల్మ్ లు, 2 టెలివిజన్ సిరీస్ లు తీశారు. ఈ క్రమంలో 1988లో వచ్చిన ఆమె తొలి చిత్రం "సలాం బాంబే!" సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడి, ప్రత్యేక అభినందనలు అందుకుంది. 2001లో వచ్చిన “మాన్సూన్ వెడ్డింగ్” సినిమా గోల్డెన్ లయన్ అవార్డును అందుకుంది.
మరోవైపు.. ఈ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన తాజా ఫైల్స్ లో బ్రిటన్ రాజు చార్లెస్-3 సోదరుడు ఆండ్రూ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఇందులో భాగంగా... 2010లో ఎప్ స్టీన్ ను బకింగ్ హోమ్ ప్యాలెస్ లో డిన్నర్ కు ఆండ్రూ ఆహ్వానించారని.. వీరి మధ్య జరిగిన ఈ-మెయిల్స్ సంభాషణ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే... ఆ ప్యాలెస్ కు ఎప్ స్టీన్ వెళ్లారా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది!
