ట్రంప్, క్లింటన్, బిల్ గేట్స్.. ఎప్‌స్టీన్ ఫైల్స్ మరో బాంబ్
ప్రపంచాన్ని కుదిపేస్తున్న హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్ స్టీన్ ఫైల్స్’ లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 13 Dec 2025 12:28 PM ISTప్రపంచాన్ని కుదిపేస్తున్న హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్ ‘ఎప్ స్టీన్ ఫైల్స్’ లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికన్ రాజకీయ, వ్యాపార ప్రముఖులకు సంబంధించిన మొత్తం 19 కొత్త ఫొటోలను తాజాగా విడుదల చేశారు. అమెరికన్ ఫైనాన్షియర్ , ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ‘జెఫ్రీ ఎప్ స్టీన్’కు సంబంధించిన హైప్రొఫైల్ సె*క్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులోకీలకమైన ‘ఎప్ స్టీన్ ఫైల్స్’ లో భాగంగా డెమోక్రాట్ నేతృత్వంలోని హౌజ్ ఓవర్ సైట్ కమిటీ మరికొన్ని సంచలన ఫొటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఈ ఫొటోలలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ అప్పుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ , ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్ , ప్రముఖ ఫిల్మ్ మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ వంటి పలువురు ప్రముఖులు జెఫ్రీ ఎప్ స్టీన్ తో సన్నిహితంగా ఉన్నట్టు కనిపిస్తోంది.
ట్రంప్ ఫొటోలు, కండోమ్ ప్రస్తావన..
కొత్తగా విడుదలైన ఫొటోలలో డొనాల్డ్ ట్రంప్.. కొంతమంది అమ్మాయిలతో కలిసి దిగిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు ఉన్నాయి. మరొక ఫొటోలో ఎప్ స్టీన్ తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇంకొక ఫొటోలో ట్రంప్ పేరుతో ఉన్న కండోమ్ కనిపించడం గమనార్హం. బిల్ క్లింటన్ ఎప్ స్టీన్ తో కలిసి ఉన్న ఫొటోలు, ఎప్ స్టీన్ ప్రైవేట్ ఎస్టేట్ లో బిల్ గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫొటోలు కూడా ఈ విడుదలలో ఉన్నాయి. స్టీవ్ బానన్ ఎప్ స్టీన్ తో సెల్ఫీ దిగిన ఫొటో, అలాగేఎప్ స్టీన్ ఐల్యాండ్ లోని ఓ గోడపై బిల్ గేట్స్ ఫొటో కూడా కనిపిస్తోంది.
రిపబ్లికన్ల స్పందన
విడుదలైన ఫొటోలపై రిపబ్లికన్లు స్పందిస్తూ ఇవి పలు ఈవెంట్లలో సాధారణ సంభాషణల్లో దిగినవేనని.. ఈ ఫొటోల్లో ఉన్న వారంతా ఎప్ స్టీన్ పాపాల్లో భాగం అయినట్టుగా ఎక్కడా లేదని చెబుతూ ఈ ఫొటోలను తేలికగా తీసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఫొటోలపై స్పందించాడు. వాటిని తాను కూడా చూడలేదని.. అయితేస్టీవ్ బానన్ ను ఉద్దేశిస్తూ ‘అతను పామ్ బీచ్ లో ఎక్కడైనా కనిపించేవాడు. అతడితో వందలాది మంది ఫొటోలు ఉన్నాయి. అదిపెద్ద విషయం కాదు. నాకు దాని గురించి ఏమీ తెలియదు’ అంటూ బదులిచ్చాడు. నిజానికి ట్రంప్, ఎప్ స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులే.. అయితే లైంగికదాడి కేసులో ఎప్ స్టీన్ 2004లో అరెస్ట్ తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డ్ పడింది.
కామ పిశాచి జెఫ్రీ ఎప్ స్టీన్ నేపథ్యం..
అమెరికన్ ఫైనాన్సియర్ అయిన జెఫ్రీ ఎప్ స్టీన్ పై మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ఆయన తన ప్రైవేట్ దీవులైన లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ లలో చాలా ఏళ్ల పాటు లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. 90వ దశకం నుంచి అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్ స్టీన్ అమ్మాయిలను స్లై చేశాడన్న అభియోగాలు కూడా ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసులో 2004లో అరెస్టై విడుదలైన ఎప్ స్టీన్ , మీటూ ఉద్యమ సమయంలో 2019లో మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019 లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. అధికారులు దానిని ఆత్మహత్యగా ప్రకటించారు.
ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఏముంది
ఈ స్కామ్ కు సంబంధించిన కీలక పత్రాలు బయటకొచ్చాయి. ఎప్ స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్ లు, అతడికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నట్లు గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే ట్రంప్, ఎప్ స్టీన్ సన్నిహిత సంబంధాల కారణంగానే ఫైల్స్ వివరాలను ట్రంప్ బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలున్నాయి. తీవ్ర ఒత్తిడి నడుమ, నవంబర్ 30వ తేదీన అధ్యక్ష హోదాలో ట్రంప్ ఫైల్స్ విడుదలకు సంతకం చేశారు.
మరిన్ని సంచలనాలు ఖాయం
డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ ఫైళ్లను హౌజ్ ఓవర్ సైట్ కమిటీకి అందజేయాల్సి ఉంది. ఇప్పటికే ఎప్ స్టీన్ ప్రైవేట్ ల్యాండ్ కు సంబంధించిన 150 ఫొటోలు, 20వేల పేజీల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. ఇందులో ప్రముఖ రాజకీయ, మీడియా, హాలీవుడ్, విదేశీ నాయకులతో ఎప్ స్టీన్ ఈమెయిల్ సంభాషణలు ఉన్నాయి. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాలి కాబట్టి ఈ వ్యవహారంలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
