ఇతగాడి టాలెంట్ కు అవాక్కు అవ్వాల్సిందే.. ఒకే పోల్ కు 40 సీసీ కెమేరాలు
‘ఎవరయ్యా.. నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్’ అన్న సినిమా డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే.
By: Garuda Media | 23 Sept 2025 10:59 AM IST‘ఎవరయ్యా.. నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్’ అన్న సినిమా డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాతి కాలంలో ఈ పొడవాటి డైలాగ్ ను సినిమాలో మాదిరి పలుకుతూ ఇమిటేట్ చేసే వారి సంఖ్య పెరిగింది. పలు సందర్భాల్లో ఈ డైలాగ్ ను వాడేస్తున్నారు అయితే.. తాజాగా వైరల్ అయిన ఒక ఫోటోను చూసినప్పుడు మాత్రం ఈ డైలాగ్ కు అచ్చు గుద్దినట్లుగా సూట్ అయ్యేలా ఉందన్న భావన కలుగుతుంది.
వీధిలోని ఒక స్తంభాన్ని పాతిన వ్యాపారి ఒకరు.. ఆ స్తంభానికి ఏకంగా 40 సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేయటం ద్వారా అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నాడు. ఇంతకూ ఒకే స్తంభానికి ఇన్ని కమెరాలు ఎందుకు? ఆ ప్రాంతానికి ఏదైనా ప్రత్యేకత ఉందా? అంటే ఏమీ లేదని చెప్పాలి. మరి ఎందుకు అంటే.. తేలిగ్గా తన వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవటంతో పాటు.. సీసీ కెమేరాలు అన్నంతనే తన పేరు గుర్తుకు వచ్చేలా చేశాడు.
సూర్యాపేట జిల్లా హుజూర్ గనర్ లోని వివేకానంద సెంటర్ నుంచి పీఎస్ఆర్ సెంటర్ కు వెళ్లే దారిలో సీసీ కెమేరాల వ్యాపారం చేస్తుంటాడు. తన దుకాణం గురించి.. తన వ్యాపారం గురించి అందరికి తెలిసేలా చేయటం కోసం.. షాపు ఎదుట ఒక స్తంభాన్ని పాతి.. దానికి 40కు పైగా సీసీ కెమేరాలు అమర్చాడు. అలా అని ఇవన్నీ పని చేసేవి అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పని చేయని పాత సీసీ కెమేరాల్ని ఇలా స్తంభానికి అమర్చటం ద్వారా.. అటు వైపు వెళ్లేవారంతా ఈ స్తంభాన్ని చూసి మాట్లాడుకోవటం కనిపిస్తోంది. రోటీన్ కు భిన్నంగా చేసిన ఈ ఏర్పాటు అందరిని అతడి గురించి.. అతడి వ్యాపారం గురించి మాట్లాడుకోవటం విశేషం. చెడిపోయిన కెమేరాలతో చూపించిన టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.
