Begin typing your search above and press return to search.

బోర్డర్ లో బాటిల్స్... ఈ ఆసక్తికర విషయం తెలుసా..!

ఇక్కడ భారత్ కు సమస్య కేవలం పాక్ సైన్యంతోనే కాదు.. పాక్ దత్త పుత్రులైన ఉగ్రవాదుల చొరబాట్లు కూడా అనేది తెలిసిన విషయమే..

By:  Raja Ch   |   12 Feb 2026 9:00 PM IST
బోర్డర్ లో బాటిల్స్... ఈ ఆసక్తికర విషయం తెలుసా..!
X

భారత్ - పాక్ సరిహద్దు నిత్యం కాక మీద ఉంటుందనే సంగతి తెలిసిందే! పశ్చిమాసియాలో చాలా శత్రుదేశాల మధ్య కూడా లేని స్థాయిలో అన్నట్లుగా ఈ రెండు దేశాల సరిహద్దుల్లో వాతావారణం ఉంటుంది. ఇక్కడ భారత్ కు సమస్య కేవలం పాక్ సైన్యంతోనే కాదు.. పాక్ దత్త పుత్రులైన ఉగ్రవాదుల చొరబాట్లు కూడా అనేది తెలిసిన విషయమే.. అందుకే ప్రతీ చిన్న విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది 'బీఎస్ఎఫ్' ఈ క్రమంలో 'బోర్డర్ లో బాటిల్స్' అనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... భారత్ - పాక్ సరిహద్దు వెంబడి ప్రధానంగా పంజాబ్, జమ్మూలోని పలు ప్రాంతాల వెంబడి ముళ్ల కంచెలు, ఫ్లడ్ లైట్లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, నైట్ విజన్ పరికరాలు, కొన్ని సెలక్టివ్ ఏరియాల్లో మోషన్ సెన్సార్లు, రెగ్యులర్ గస్తీతో భారీగా కాపలా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో ముళ్ల కంచెలకు ఖాళీ గాజు సీసాలను దగ్గర దగ్గరగా వేళాడ దీస్తారు. ఇదోరకం ఖర్చు తక్కువ కీలక సెక్యూరిటీ అని తెలుసా..?

ఖర్చు తక్కువ... సౌండ్ ఎక్కువ!:

ప్రధానంగా సరిహద్దుల్లో రాత్రిపూట దృశ్యమానత పరిమితం అయ్యే ప్రాంతాల్లో.. ఇదే క్రమంలో పొలాలు, నదీ తీర ప్రాంతాల గుండా విస్తారమైన కంచెలు ఉన్న ప్రాంతాల్లో ఖాళీ గాజు సీసాలు కట్టి కనిపిస్తాయి. అయితే.. ఈ సరళమైన సాంకేతికతే అదనపు అప్రమత్తతను అందజేస్తుందని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇవి చేసే గట్టి శబ్ధపు హెచ్చరికలే అని అంటున్నారు.

వాస్తవానికి గాలి వీచినప్పుడు ఈ ఖాళీ గాజు సీసాలు కంచెకు వ్యతిరేకంగా ఒకదానినొకటి ఢీకొంటాయి.. ఆ సమయంలో ఓ ప్రత్యేకమైన క్లాకింగ్ శబ్ధం వస్తుంది! ఇదే సమయంలో.. ఎవరైనా కంచెను కత్తిరించినప్పుడు.. దానిపైకి ఎక్కడానికి లేదా, దానిగుండా పాకడానికి ప్రయత్నించినప్పుడు.. మరికొన్ని సందర్భాల్లో ఇనుప తీగలను కట్ చేసే ప్రయత్నం జరిగినప్పుడు ఈ సీసాలు బిగ్గరగా శబ్ధం చేస్తూ.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ను తమవంతుగా అప్రమత్తం చేస్తాయి!

గాజు సీసాలే ఎందుకు..?:

అయితే ఇక్కడ గాజు సీసాలే ఎందుకు.. పల్చటి స్టీలు ప్లేట్లు కూడా కట్టొచ్చు, పెట్టొచ్చు అని అనుకోవచ్చు. అయితే దీనికి చాలా ప్రధాన కారణాలున్నాయి! గాజు సీసాలు సులభంగా లభిస్తాయి.. ఇవి చవకైనవి.. మరియూ బహిరంగ పరిస్థితుల్లో చాలా మన్నికైనవి.. లోహానికంటే ఎక్కువ శబ్ధం చేస్తుంటాయి! పైగా.. వీటికి విద్యుత్ అవసరం లేదు, మెయింటినెన్స్ ఖర్చు ఉండదు.. ఎవరో ఎత్తుకెళ్లిపోతారనే భయమూ ఉండదు!

అలా అని సీసాలు ఏమీ ప్రాథమిక రక్షణ వ్యవస్థ కాదు కానీ... అవి అనుబంధ నిరోధక, హెచ్చరిక యంత్రాంగంగా పనిచేస్తాయి. డ్రోన్లు, థర్మల్ కెమెరాల కాలంలో కూడా ఈ ఖాళీ సీసాల పాత్రను పరిగణలోకి తీసుకోవాలా అంటే... సరిహద్దు భద్రత విషయంలో ప్రతీ చిన్న శబ్ధమూ, ప్రతీ చిన్న హెచ్చరికా ముఖ్యమైనదే కదా!