ఉద్యోగికి బాత్రూం బ్రేక్.. జాబ్ తీసిన కంపెనీపై కోర్టుకు కట్ చేస్తే?
పని ప్రదేశంలో తరచూ బాత్రూంకు వెళ్లే ఉద్యోగికి షాకిచ్చిన కంపెనీపై కోర్టుకు వెళ్లాడో మాజీ ఉద్యోగి.
By: Garuda Media | 15 Dec 2025 10:00 AM ISTపని ప్రదేశంలో తరచూ బాత్రూంకు వెళ్లే ఉద్యోగికి షాకిచ్చిన కంపెనీపై కోర్టుకు వెళ్లాడో మాజీ ఉద్యోగి. బాత్రూంకు వెళితే కూడా జాబ్ తీసేస్తారా? అన్న సందేహం కలగొచ్చు. మన దగ్గర ఇలాంటి తీరు కొత్తగా అనిపించినా.. విదేశాల్లో మాత్రం అలాంటివి కామన్. పని ప్రదేశంలో పని మాత్రమే తప్పించి.. మిగిలిన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వటం.. పని మీద ఫోకస్ లేకపోవటాన్ని కంపెనీలు తీవ్రంగా పరిగణిస్తుంటాయి. మన దగ్గర కంపెనీల్లో పని చేసే కొందరు ముచ్చట్లు పెట్టటం.. తరచూ బ్రేక్ లు తీసుకోవటం లాంటివి చేస్తుంటారు. చైనాలో అలాంటివి నడవవు.
ఆఫీసు వేళలో తరచూ రెస్టు రూంకు వెళ్లిన ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసిన కంపెనీపై న్యాయపోరాటానికి దిగాడో ఉద్యోగి. తనను అక్రమంగా తొలగించినట్లుగా కోర్టును ఆశ్రయించాడు. రూ.41 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఉదంతానికి సంబంధించి ప్రాశ్చాత్య మీడియాలో ఒక వార్తా కథనం పబ్లిష్ అయ్యింది. అసలేం జరిగిందంటే.. తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్సు కు చెందిన లీ అనే వ్యక్తి 2010లో జాబ్ లో చేరాడు.
అతడి పని ఏమంటే.. తన వద్దకు వచ్చే మెసేజ్ లకు తక్షణం స్పందించాల్సి ఉంటుంది. అయితే.. అందుకు భిన్నంగా అతను తరచూ వర్కు ప్లేస్ కు దూరంగా.. బాత్రూంకు తరచూ వెళుతున్న విషయాన్ని గుర్తించారు. చాట్ యాప్ ద్వారా అతన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేసిన సంస్థ.. గత ఏడాది ఏప్రిల్ - మే మధ్యకాలంలో 14సార్లు బాత్రూం బ్రేక్ తీసుకున్నట్లుగా గుర్తించారు.
బాత్రూంకు వెళ్లిన ప్రతిసారీ అరగంట పాటు సమయాన్ని తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. ఒక సందర్భంలో ఏకంగా నాలుగు గంటల పాటు బాత్రూంలో గడిపిన వైనాన్ని గమనించారు. దీంతో.. సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించిన అతన్ని జాబ్ నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సంబంధిత కార్మిక సంఘానికి సైతం సంస్థ సమాచారం ఇచ్చింది. అయితే.. తనను అక్రమంగా జాబ్ నుంచి తీసేసినట్లుగా ఆరోపిస్తూ సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. అనారోగ్యం కారణంగానే తాను బాత్రూం వెళ్లినట్లుగా పేర్కొంటూ తనకు రూ.41 లక్షల పరిహారం ఇవ్వాలని కోరాడు.
ఈ కేసును విచారించిన కోర్టు.. సదరు ఉద్యోగి అనారోగ్యానికి అవసరమైన దాని కంటే ఎక్కువ టైం బాత్రూంలో గడిపినట్లుగా పేర్కొంది. అదే సమయంలో అతడి అనారోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాల్ని సంస్థకు షేర్ చేయని వైనాన్ని గుర్తించింది. అయితే.. అతను సంస్థకు అందించిన సేవలు.. జాబ్ పోయిన తర్వాత అతను ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో సుమారు రూ.4 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇటీవల కాలంలో బాత్రూం రెస్టు కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది.
