కొత్త రూల్.. ఆ విమానాల్లో పవర్ బ్యాంక్ లపై బ్యాన్!
ఇటీవల కాలంలో విమానాల్లో జరిగిన ప్రమాదాలు, పలు అత్యవసర ల్యాండింగ్ లు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 1 Oct 2025 2:26 PM ISTఇటీవల కాలంలో విమానాల్లో జరిగిన ప్రమాదాలు, పలు అత్యవసర ల్యాండింగ్ లు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆ ఎయిర్ లైన్స్, ఈ ఎయిర్ లైన్స్ అనే తారతమ్యాలేమీ లేకుండా చాలా సంస్థలు ఈ సమస్యలను ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈకి చెందిన ఎమిరేట్స్ విమానాల్లో నేటి నుంచి (అక్టోబర్ 1) కొత్త రూల్ అమల్లోకి వచ్చింది.
అవును... యూఏఈకి చెందిన ఎమిరేట్స్ విమానయాన సంస్థ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. తమ విమానాల్లో పవర్ బ్యాంక్ ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రూల్ ప్రకారం.. ప్రయాణికులు 100 వాట్ల కంటే తక్కువ పవర్ ఉన్న పవర్ బ్యాంక్ ను బ్యాగేజీతోపాటు తీసుకెళ్లవచ్చు.
అయితే... ఆ పవర్ బ్యాంక్ లను విమానంలో మాత్రం ఉపయోగించకూడదు. దీంతో ఇకపై ఎమిరేట్స్ ప్రయాణికులు విమానంలో స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ లు ఉపయోగించే అవకాశం లేదన్నమాట. ఈ సందర్భంగా స్పందించిన సంస్థ ఈ నిబంధన తేవడానికి గల కారణాలను వెళ్లడించింది.
ఇందులో భాగంగా... తమ విమానాల్లో ప్రయాణికులు ఎక్కువగా పవర్ బ్యాంక్ లను వినియోగిస్తుండడం వల్ల ఆన్ బోర్డ్ విమానాలలో లిథియం బ్యాటరీలపై ప్రభావం పడుతుందని ఎమిరేట్స్ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే పవర్ బ్యాంక్ లపై నిషేధం విధించినట్లు తెలియజేసింది. ఇదే సమయంలో మరిన్ని వివరాలు వెల్లడించింది.
ఇందులో భాగంగా... విమానాల్లో తీసుకురావడానికి ఆమోదించిన పవర్ బ్యాంకులకు సంబంధించిన స్పష్టమైన సామర్థ్య రేటింగ్ లను ముందుగానే ఎయిర్ లైన్స్ కు వినియోగదారులు తెలియజేయాలని.. వాటిని ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్లలో కాకుండా సీటు జేబులో లేదా ముందు సీటు కింద మాత్రమే ఉంచాలని విమానయాన సంస్థ పేర్కొంది.
కాగా... పోర్టబుల్ బ్యాటరీలపై తన విధానాన్ని కఠినతరం చేయడంలో ఎమిరేట్స్ తో పాటు ఇప్పటికే సింగపూర్ ఎయిర్ లైన్స్, కాథే పసిఫిక్, కొరియన్ ఎయిర్, ఈవీఏ ఎయిర్, చైనా ఎయిర్ లైన్స్, ఎయిర్ ఏషియా వంటి ఇతర ప్రధాన క్యారియర్ లు ఇప్పటికే విమానంలో పవర్ బ్యాంక్ లను ఉపయోగించడంపై ఆంక్షలను అమలు చేస్తున్నాయి.
