Begin typing your search above and press return to search.

ఏపీలో రాజ‌కీయ శ‌క్తులు.. @ 2025 ..!

గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో రాజకీయ వ్యక్తులు, శ‌క్తులు పెరిగాయి. ఇప్పటివరకు వైసీపీ, టిడిపి జనసేన, బిజెపి అదేవిధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక శక్తులుగా ఉన్న విషయం తెలిసిందే

By:  Garuda Media   |   24 Dec 2025 10:00 PM IST
ఏపీలో రాజ‌కీయ శ‌క్తులు.. @ 2025 ..!
X

గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో రాజకీయ వ్యక్తులు, శ‌క్తులు పెరిగాయి. ఇప్పటివరకు వైసీపీ, టిడిపి జనసేన, బిజెపి అదేవిధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలక శక్తులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కొత్తగా జై భీమ్ పార్టీ అదేవిధంగా బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని పార్టీలు కూడా ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలోని సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా బలమైన శక్తిగా అవతరించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇక వివాదాస్పద ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా సొంత పార్టీ పెట్టే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. మాల సామాజిక వర్గాన్ని ఐక్యం చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నారు. ఇదే సమయంలో కాపు, ఎస్సీ వర్గాలు కలవడం ద్వారా అధికారాన్ని దక్కించుకునే అంశంపై ఆయన చేస్తున్న ప్రయోగం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై తొలుత వివాదాలు వచ్చినప్పటికీ రాజకీయంగా ఈ రెండు శక్తులు బలంగా కలవడం వల్ల వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకొని సీఎం, డిప్యూటీ సీఎం పదవులు పొందేందుకు అవకాశం ఉంటుందని రాజ్యాధికారం దక్కించుకునేందుకు ఛాన్స్ దక్కుతుందని కూడా సునీల్ కుమార్ చెప్పిన వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించకపోయినా షర్మిల ఇమేజ్ కొంతమేరకు రాజకీయ వర్గాల్లో కనిపించింది. తొలి దశలో వైసిపి అధినేత, తన సోదరుడు జగన్ పై షర్మిల విమర్శలు గుప్పించినప్పటికీ రానురాను ప్రభుత్వ విధానాలు, ప్రజల సమస్యలపై షర్మిల గళం విప్పడం ప్రారంభించారు. అయితే చిత్రంగా పార్టీలో మాత్రం అసంతృప్తి, అసమ్మ‌తి కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళ నాయకుల నుంచి సీనియర్ల వరకు కూడా షర్మిల నాయకత్వాన్ని విభేదిస్తూ వస్తున్నారు.

ఈ పరిణామం ఇలా ఉంటే చిన్నాచితకా పార్టీలు పుంజుకునే దిశగా అడుగులు వేస్తుండటం, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పెట్టిన పార్టీలు ప్రజల మధ్యకు వెళ్లే కార్యక్రమాలను చేపట్టడం వంటివి ఏడాది స్పష్టంగా కనిపించింది. అయితే ఎన్నికలు నిర్వహించడానికి మరో మూడేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ పార్టీలు పుంజుకున్నప్పటికీ ఇబ్బంది లేదు అన్న వాదన ఉంది. కానీ, ఎస్సీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయా వర్గాల ఓట్లను చీల్చే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.