బిగ్ బాస్ విన్నర్ ఇంటి పై బుల్లెట్ల వర్షం... కారణం చెప్పిన నిందితులు!
అవును... ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పుల జరిపిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడు.
By: Raja Ch | 17 Aug 2025 4:39 PM ISTప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ హిందీ విన్నర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పుల జరిపిన సంగతి తెలిసిందే. ఆదివారం (ఆగస్టు 17) తెల్లవారుజామున బైక్ లపై వచ్చిన దుండగులు గురుగ్రామ్ లోని సెక్టార్ 56లోని ఎల్విష్ ఇంటిపై దాదాపు 24 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడింది తామేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది.
అవును... ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు కాల్పుల జరిపిన సంగతి తెలిసిందే. అయితే కాల్పుల జరిగిన సమయంలో ఎల్విష్ ఇంట్లో లేడు. కాల్పుల సంఘటన ఆదివారం ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య జరిగింది. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇందులోభాగంగా... గురుగ్రామ్ లోని ఎల్విష్ ఇంటికి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. ప్రాథమిక దర్యాప్తులో ఎల్విష్ ను బెదిరించడానికి కాల్పులు జరిగి ఉండవచ్చని తేలిందని సమాచారం. మరోవైపు ఎల్విష్ ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ సమయంలో ఈ దాడులకు పాల్పడింది ఎవరో చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది! ఇందులో భాగంగా... ఎల్విష్ యాదవ్ ఇంట్లో కాల్పులు జరిపింది విదేశాల్లో ఉన్న ఇద్దరు గ్యాంగ్ స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్ పురియా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పేర్కొంది.
ఈ సమయంలో రెండు తుపాకులతో పాటు "2020 నుండి భావు గ్యాంగ్" అనే టెక్స్ట్ ఉన్న ఈ పోస్ట్ లో, అక్రమ బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్నందున యూట్యూబర్ ఇంటిపై దాడి జరిగిందని పేర్కొంది. సోషల్ మీడియాలో అతడి లాంటి చీడపురుగులకు ఇదొక హెచ్చరిక అని, ఈ యాప్స్ ప్రమోట్ చేస్తే ఏ క్షణమైనా బుల్లెట్ దిగొచ్చని హెచ్చరిక జారీ చేసింది!
