ఇలాంటి దొంగతనం చేయాలంటే భయపడేలా ట్రీట్ మెంట్ ఇవ్వాలి
ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్జిల్లా ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
By: A.N.Kumar | 28 Oct 2026 11:00 PM ISTరైతు కష్టపడి పంట పండించాలంటే విత్తనం.. నీరు.. కరెంటు ఎంతో ముఖ్యం. ముఖ్యంగా సాగునీటి కోసం బోర్లపైన, మోటార్లపైన ఆధారపడే రైతుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అనేది కేవలం ఒక ఇనుప యంత్రం మాత్రమే కాదు.. అది అతడి పంటకు ఊపిరి పోసే ప్రాణాధారం.. ఆ ట్రాన్స్ఫార్మర్ నడిస్తేనే పొలానికి నీళ్ళు పారతాయి.. పచ్చని పంట నవ్వుతుంది.. రైతు ఇల్లు గడుస్తుంది. అలాంటి కంటికి రెప్పలా చూసుకునే ట్రాన్స్ఫార్మర్లను కొందరు స్వార్థపరులు ధ్వంసం చేసి.. రాగి తీగలను దొంగిలిస్తుంటే.. అది కేవలం చోరీ కాదు.. పచ్చని పంటలను ఎండబెడుతూ రైతుల కడుపు కొట్టడమే..
ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతర్జిల్లా ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకంగా 35 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి 1,020 కిలోల రాగి తీగలను దోచుకెళ్లిన ఈ ముఠా నుంచి కారు.. బైక్.. రాగి తీగలతో పాటు ప్రత్యేక టూల్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. జైలులోనే పరిచయమై బయటపడగానే ఇలాంటి దారుణానికి పూనుకోవడం నేరస్థుల దిగజారుడుతనానికి అద్దం పడుతోంది.
సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో దొంగలు రాగి తీగలను అమ్ముకుని వేల రూపాయలు పొందుతుండవచ్చు. కానీ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతినడం వల్ల ఆ వేళకి పంటకు నీరు అందక.. కళ్ళముందే పైరు ఎండిపోతుంటే ఆ రైతు గుండె ఎంతలా విలవిలలాడుతుందో ఆ నేరస్థులకు తెలియదు. కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చేవరకు ఎదురుచూడటం.. విద్యుత్ శాఖ చుట్టూ తిరగడం.. ఇప్పటికే అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు కావడం.. ఇవన్నీ అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తాయి.
పోలీసులు ఈ ముఠాను పట్టుకుని ప్రశంసలు అందుకున్నప్పటికీ అసలు సమస్య భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడటమే.. వ్యవసాయ రంగానికి వెన్నుముకలాంటి విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడం అంటే.. నేరుగా దేశానికి కూడు పెట్టే రైతు జీవనాధారాన్ని దెబ్బతీయడమే. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం.. చోరీ చేసిన రాగిని కొనుగోలు చేసే అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపడం అత్యవసరం.
ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేయడం అంటే విద్యుత్ శాఖకు నష్టం కలిగించడం మాత్రమే కాదు.. చెమటోడ్చి పనిచేసే రైతు కంటిపాపను పొడవడమే. పోలీసు యంత్రాంగం, విద్యుత్ శాఖ, స్థానిక ప్రజలు కలిసికట్టుగా నిఘా ఉంచి.. ఇటువంటి దుర్మార్గులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చేసినప్పుడే అన్నదాతకు నిజమైన న్యాయం జరుగుతుంది.
