Begin typing your search above and press return to search.

బాబోయ్ ఎలాన్ మస్క్ మావా.. నీ ఆస్తి మొత్తం పంచేస్తే మాకు ₹11,600 వస్తాయటగా?

ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు.. పేదవాళ్లు ఇంకా పేదవాళ్లు అవుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం "మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం" అని పండగ చేసుకుంటున్నాయి.

By:  A.N.Kumar   |   14 Jun 2026 7:00 AM IST
బాబోయ్ ఎలాన్ మస్క్ మావా.. నీ ఆస్తి మొత్తం పంచేస్తే మాకు ₹11,600 వస్తాయటగా?
X

ఈరోజుల్లో ప్రపంచంలో బతకాలంటే టాలెంట్ కాదు బాబోయ్.. మస్క్ మామ అకౌంట్లో ఉన్న డబ్బులు కావాలి. పొద్దున్నే లేచి ఆఫీసుకెళ్లి బాస్ తిట్లు తింటూ నెల చివర్లో జీతం ఎప్పుడొస్తుందా అని చాతక పక్షుల్లా ఎదురుచూసే శ్రామిక జీవులారా... మీకో గుడ్ న్యూస్ అదేంటో తెలుసా? మీ కష్టాలు తీరాలన్నా మీరు కోరుకున్న ఐఫోన్ ఈఎంఐ క్లియర్ అవ్వాలన్నా ఇప్పుడు ఒకే ఒక్క మార్గం ఉంది. ఎలాన్ మస్క్ గారు తన ఆస్తి మొత్తాన్ని ప్రపంచ దేశాల ప్రజలందరికీ సమానంగా పంచేయడమే. అవును మీరు విన్నది నిజమే. అంతర్జాతీయ సంస్థ ‘ట్యాక్స్ జస్టిస్’ వాళ్ళు ఖాళీగా ఉండలేక తీవ్రంగా పరిశోధించి ఒక విస్తుపోయే నివేదికను బయటపెట్టారు.

మస్క్ మామ ఆస్తి మన జేబులో ₹11,600

ఈ నివేదిక సారాంశం ఏంటంటే.. టెస్లా కార్లు, స్పేస్‌ఎక్స్ రాకెట్లు, 'X' పక్షిని కొనేసిన మన ఎలాన్ మస్క్ త్వరలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ లక్ష కోట్ల డాలర్ల అధిపతి అయిపోతున్నారట. సరే ఆయన అంత సంపాదిస్తే మనకేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్ మస్క్ ఆస్తి మొత్తాన్ని తీసి ఈ భూమ్మీద ఉన్న మనుషులందరికీ తలా ఇంత అని పంచితే.. మనలో ప్రతి ఒక్కరికీ దాదాపు ₹11,600 వస్తాయట.. "అబ్బా.. ₹11,600 ఆ దీంతో ఒక మంచి గోవా ట్రిప్ ప్లాన్ చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేయొచ్చు. థాంక్యూ ట్యాక్స్ జస్టిస్.. రేపే వెళ్లి మస్క్ అకౌంట్ నెంబర్ కనుక్కుంటా"

ఒకరి దగ్గర కొండంత.. మన దగ్గర గోరంత!

ఈ నివేదిక చూశాక అర్థమైంది ఏంటంటే.. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు ఏ రేంజ్‌లో ఉన్నాయో చెప్పడానికి మస్క్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం సంపదలో 75 శాతం కేవలం 56 వేల మంది మహా ముదుర్ల ధనవంతుల చేతుల్లోనే ఉందట. మిగిలిన కోట్లాది మంది జనాలు.. నెల నెలా కరెంట్ బిల్లు ఎంతొస్తుందో పెట్రోల్ రేట్లు ఎప్పుడు తగ్గుతాయో అని లెక్కలు వేసుకుంటూ బతికేస్తున్నారు.

మస్క్‌పై 10% టాక్స్ వేస్తే.. 80 కోట్ల మంది సేఫ్

పోనీ ఆస్తి మొత్తం పంచకపోయినా పర్లేదు భయ్యా.. మస్క్ ఆస్తులపై కేవలం 10 శాతం ‘వెల్త్ ట్యాక్స్’ వేసినా చాలట. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడతారట. ఆ డబ్బుతో అందరికీ చదువు, వైద్యం, ఫ్రీగా ఫుడ్డు పెట్టేయొచ్చని ట్యాక్స్ జస్టిస్ వాళ్ళు ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ చిన్న లాజిక్.. మన ఊర్లో కోటీశ్వరుడే సరిగ్గా టాక్స్ కట్టడానికి ఏడుస్తుంటే, ప్రపంచ కుబేరుడు 10 శాతం టాక్స్ కట్టేసి ఊరుకుంటాడా చెప్పండి.

ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు.. పేదవాళ్లు ఇంకా పేదవాళ్లు అవుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం "మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం" అని పండగ చేసుకుంటున్నాయి.

ఏది ఏమైనా.. మస్క్ రేపు పొద్దున్నే లేచి "ఇకపై ఈ ఆస్తులు, పాస్తులు నాకొద్దు.. ప్రపంచశాంతి కోసం అందరికీ పంచేస్తున్నా" అని ట్వీట్ చేస్తే చూడాలని ఉంది. అప్పటివరకు మనం ఆ ₹11,600 వస్తే ఏం కొనాలో లిస్ట్ రాసి పెట్టుకుందాం.. ఏమంటారు ఫ్రెండ్స్..