వైరల్ పిక్: మళ్లీ ఒక్కటైన ట్రంప్-మస్క్? అమెరికా రాజకీయాల్లో కొత్త ములుపు!
గత కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు తాజాగా ఒకే టేబుల్‌పై విందు ఆరగించడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
By: A.N.Kumar | 5 Jan 2026 12:32 PM ISTఎన్నికల ముందర ఒకరి కోసం ఒకరి పనిచేశారు. ట్రంప్ గెలుపును ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు అయిన ఎలన్ మస్క్ నెత్తిన ఎత్తుకున్నారు. డబ్బు, పరపతి.. సోషల్ మీడియాతో ఎలాగోలా గెలిపించేశాడు. ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన శాఖలకు మస్క్ అధిపతి కూడా అయ్యాడు. కానీ అభిప్రాయభేదాలతో వారిద్దరూ విడిపోయి తర్వాత తిట్టుకున్నారు కూడా.. కానీ మరోసారి క్రిస్మస్ పండుగ సెలవుల్లో తాజాగా కలిసిపోవడం సంచలనమైంది.
ప్రపంచ కుబేరుడు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న 'కోల్డ్ వార్'కు తెరపడిందా? గత కొంతకాలంగా ఎడమొఖం పెడమొఖంగా ఉన్న ఈ ఇద్దరు దిగ్గజాలు తాజాగా ఒకే టేబుల్‌పై విందు ఆరగించడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
ఉత్కంఠ రేపిన డిన్నర్ భేటీ
ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో కలిసి ఎలాన్ మస్క్ డిన్నర్ చేశారు. ఈ ఫోటోను స్వయంగా మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. “అధ్యక్షుడు, ఫస్ట్ లేడీతో అద్భుతమైన రాత్రి గడిచింది. 2026 అద్భుతంగా ఉండబోతోంది” అని క్యాప్షన్ ఇచ్చారు. 2025 ప్రారంభంలో వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపిన తర్వాత మళ్ళీ ఇంత సన్నిహితంగా కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వెనిజువెలా ఆపరేషన్ తర్వాత మారిన సమీకరణాలు
వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే ఈ భేటీ జరగడం గమనార్హం. ఈ ఆపరేషన్‌ను మస్క్ బాహాటంగా సమర్థించారు. "ఇది నియంతలకు గట్టి హెచ్చరిక" అంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ విదేశాంగ విధానానికి ఆయన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశాయి.
దూరం పెరగడానికి కారణమేంటి?
2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం మస్క్ భారీగా ఖర్చు చేశారు. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, టారిఫ్ పాలసీల విషయంలో మస్క్ విమర్శలు గుప్పించారు. దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని, మస్క్ వైట్ హౌస్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది.
2026 లక్ష్యంగా కొత్త స్నేహం
ప్రస్తుతం మస్క్ మళ్ళీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు నిధులు సమకూరుస్తుండటం విశేషం. ముఖ్యంగా 2026 మిడ్‌టర్మ్ ఎన్నికలపై మస్క్ కన్నేశారని తెలుస్తోంది. ట్రంప్ రాజకీయ బలం, మస్క్ టెక్నాలజీ, ఆర్థిక వనరులు తోడైతే అమెరికా రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించే అవకాశం ఉంది.
టెక్నాలజీ, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అమెరికా ఆధిపత్యం కొనసాగాలంటే మస్క్ మద్దతు ట్రంప్‌కు అవసరం. అదే సమయంలో తన వ్యాపార సామ్రాజ్యానికి ప్రభుత్వపరమైన అడ్డంకులు లేకుండా చూసుకోవడం మస్క్ వ్యూహం. ఈ ఇద్దరి కలయిక కేవలం ఒక డిన్నర్‌కే పరిమితం కాకుండా ప్రపంచ రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా "2026 అద్భుతంగా ఉండబోతోంది" అని మస్క్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు డెమొక్రాట్లలో వణుకు పుట్టిస్తోంది. మరి ఈ 'పవర్ కపుల్' రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.
