ప్రపంచ చరిత్రలో తొలిసారి.. ఆ ఘనత దిశగా మస్క్
అరుదైన ఘనతను సాధించే వరుసలో ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.
By: Garuda Media | 6 Sept 2025 6:00 PM ISTఅరుదైన ఘనతను సాధించే వరుసలో ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పంచాయితీతో పాటు.. మార్కెట్లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే టెస్లాకు ఎదురవుతున్న గట్టి పోటీ నేపథ్యంలో సవాళ్లను.. ప్రతికూలతల్ని ఎదుర్కొంటున్న ఎలాన్ మస్క్.. వాటిని అధిగమించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ చరిత్రలో తొలిసారి అరుదైన రికార్డును సొంతం చేసుకోవటమే కాదు.. చరిత్రలో నిలిచిపోయే అంశానికి దగ్గరకు వచ్చేసినట్లు చెబుతున్నారు.
ఇంతకూ అదేమంటే.. ఆయన సంపద అమాంతం పెరిగి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అవతరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉండటం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సంపద విలువ 400 బిలియన్ డాలర్లు. రానున్న రోజుల్లో ఆయన కంపెనీ మార్కెట్ విలువ భారీగా పెంచేందుకు టెస్లా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మస్క్ కు టెస్లా భారీ ఆఫర్ ను ప్రకటించింది. ప్రపంచ కార్పొరేట్ ప్రపంచంలో ఎవరికి దక్కని భారీ ప్యాకేజీని ఆఫఱ్ చేశారు.
టెస్లా మార్కెట్ విలువను ప్రస్తుతం ఉన్న 1.12 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు (8.5 లక్షల కోట్లు డాలర్లు) స్థాయికి చేర్చి.. కంపెనీ కార్ల వార్షిక అమ్మకాలను 2 కోట్ల యూనిట్లకు (గత ఏడాది అమ్మింది 20 లక్షలే) పెంచటం.. రోబో ట్యాక్సీలు.. హ్యుమనాయిడ్ రోబోల అమ్మకాల్ని10 లక్షల యూనిట్లకు పెంచటం లాంటివి చేస్తే.. మస్క్ కు లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తిగా అవతరించేందుకు వీలుగా ఆఫర్ లభించింది.
ప్రస్ుతతం ఆయన ఆస్తి మన రూపాయిల్లో 33.26 లక్షల కోట్లు. డాలర్లలో చెబితే 378 బిలియన్ డాలర్లు. దాన్ని లక్ష కోట్ల డాలర్ల సంపద ఉండే వ్యక్తిగా మారేందుకు తాజా ఆఫర్ దోహదం చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ 1.1 ట్రిలియన్ డాలర్ల అన్న విషయం తెలిసిందే. పదేళ్లలో తాము అనుకున్న లక్ష్యాలకు చేరుకునేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం కొత్త కాన్సెప్టుల్ని తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రోబో ట్యాక్సీ.. ఏఐ మార్కెట్ విస్తరణ లాంటి అంశాలపై ఫోకస్ చేస్తోంది. దీనికి తగ్గట్లే ఆయనకు ప్రతిపాదిత ప్రోత్సాహక ప్యాకేజీ కింద మస్క్ కు భారీగా షేర్లు సమకూరుతాయి. అదెంత భారీ అంటే.. దగ్గర దగ్గర 900 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు.
అదే జరిగితే మస్క్ సంపద విలువ ఏకంగా ట్రిలియన్ డాలర్లు దాటిపోతుంది. ఇది కార్పొరేట్ చరిత్రలో అత్యంత భారీ ప్రోత్సాహకంగా చెబుతున్నారు. ట్రిలియన్ డాలర్లను ఎలా లెక్కించాలి? సింఫుల్ గా ఎలా గుర్తు పెట్టుకోవాలి? ట్రిలియన్ డాలర్లు అంటే మన రూపాయిల్లో ఎంత? లాంటి ప్రశ్నలకు సమాదానాలు వెతికితే.. ఒక ట్రిలియన్ అంటే ఒకటి తర్వాత 12 సున్నాలు. మన దేశంలో అంకెల్ని కోట్లుగా లెక్కిస్తే.. సాధారణంతా విదేశాల్లో మిలియన్.. బిలియన్ ను వాడుతుంటారు.
ఒక మిలియన్ అంటే పది లక్షలు అదే ఒక బిలియన్ అంటే వంద కోట్లకు సమానం. రూపాయిల్లో చెప్పాలంటే ఇప్పుడున్న రూపాయి వర్సెస్ డాలర్ మారకంలో చూస్తే.. ఒక బిలియన్ డాలర్లు అంటే రూ.8500 కోట్లు. అదే ఒక ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.85 లక్షల కోట్లు అవుతుంది. ఈ లెక్కన మస్క్ కు అందే 900 బిలియన్ డాలర్లు అంటే దగ్గర దగ్గర ఒక ట్రలియన్ డాలర్లు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.లక్ష కోట్లు. మరి.. ఆ రికార్డుకు ఆయన చేరుతారా? ఎప్పటికి చేరుతారో చూడాలి.
