Begin typing your search above and press return to search.

స్టార్‌లింక్‌కు వారే అడ్డంకి ...మస్క్ హాట్ కామెంట్స్ !

ఇండియాకు స్టార్ లింక్ సేవలు అందించడానికి తాము ఎపుడూ సిద్ధమే అని మస్క్ స్పష్టం చేశారు.

By:  Satya P   |   8 Oct 2026 8:55 AM IST
స్టార్‌లింక్‌కు  వారే అడ్డంకి ...మస్క్ హాట్ కామెంట్స్ !
X

ఎలాన్ మస్క్ భారత్ లో కొంత మంది మీద ఇండైరెక్ట్ గా హాట్ కామెంట్స్ చేశారు. వారే అడ్డంకి అంటూ టార్గెట్ చేశారు. భారత్ లో స్టార్ లింక్ సేవలకు కౌంట్ డౌన్ ఎపుడు అన్న ఒక నెటిజన్ ప్రశ్నకు మస్క్ అయితే ఎక్కడికో వెళ్ళారు, ఎవరికో గుచ్చారు, కుబేరులు కొంతమంది బ్రేకులు వేస్తున్నారు అని డైలాగులు పేల్చారు. ఇంతకీ మస్క్ చేసిన ఆ సంచలన కామెంట్స్ ఎవరి మీద అన్నది అయితే అర్ధమైన వాళ్ళకే అర్ధమవుతుంది అంటున్నారు. ఇండియాలో స్టార్ లింక్ సేవలు అందుబాటులో రాకుండా అడ్డుకోవడం అయితే జరుగుతోంది అని మస్క్ తేల్చేశారు.

గుత్తాధిపత్యం అంటూ :

ఇండియాకు స్టార్ లింక్ సేవలు అందించడానికి తాము ఎపుడూ సిద్ధమే అని మస్క్ స్పష్టం చేశారు. అయితే తమకు రానీయకుండా కొంతమంది మాత్రమే గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు అని ఆయన నిశితంగా విమర్శలు చేశారు. అంతే కాదు మరో పెద్ద మాట కూడా ఆయన వాడారు. ఇది భారత్ ప్రజల మీద జరుగుతున్న అతి నేరం అని నెటిజన్ పెట్టిన ట్వీట్ కి రీ ట్వీట్ చేస్తూ కామెంట్స్ చేశారు. దురదృష్టవశాత్తు భారత ప్రజలపై ఏకఛత్రాధిపత్యం కొనసాగించేందుకు కొంతమంది కుబేరులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పిన మస్క్ వారి పేర్లను మాత్రం బయటపెట్టలేదు, వారెవ్వరో మీరే గెస్ చేయండి అని నెటిజన్లకే వదిలేశారు.

స్టార్ లింక్ అవసరం :

ఇదిలా ఉంటే స్టార్ లింక్ అనేది ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్ సంస్థ అందిస్తున్న శాటిలైట్ ఇంటర్నెట్ సేవ. సాంప్రదాయ శాటిలైట్ ఇంటర్నెట్ కాకుండా భూమికి అత్యంత సమీపంలో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల నెట్‌వర్క్‌ను ఇది చక్కగా ఉపయోగించుకుంటుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం చాలా ఎక్కువగా ఉండటంతో పాటు ఆలస్యం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్ లింక్ సాధారణంగా 100 ఎంబీపీఎస్ నుండి 400 ప్లస్ ఎంబీపీఎస్ వరకు హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తాయి. 4కే స్ట్రీమింగ్ ఆన్‌లైన్ గేమింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వంటి వాటికి స్టార్ లింక్ సేవలు ఎంతగానో అనుకూలంగా ఉంటాయి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లేదా మొబైల్ టవర్లు అందుబాటులో లేని మారుమూల గ్రామీణ ప్రాంతాలు అదే విధంగా కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాల వారికి స్టార్ లింక్ సేవలు బాగా ఉపయోగపడతాయి. అంతే కాదు స్టార్ లింక్ రోమ్ స్టార్ లింక్ మిని ద్వారా ప్రయాణాలలోనూ క్యాంపింగ్‌లో కూడా ఇంటర్నెట్ చాలా సౌకర్యవంతంగా వాడుకోవచ్చు.

ఎందుకంత ఆలస్యం :

భారత్ లో స్టార్ లింక్ సేవలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయన్నది నెటిజన్ల ఆవేదన ఆందోళనగా ఉంది. వారికి ఎవరు తమకు వాటిని అందిస్తున్నారు అన్నది అవసరం లేదు, తమకు మరింతగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయని యువతతో పాటు గ్రామీణ ప్రాంతాల వారు ఎదురుచూస్తున్నారు. స్టార్ లింక్ సేవలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలలో అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో కూడా త్వరలో పూర్తిస్థాయిలో లాంచ్ అయ్యే దశలో ఉన్నాయని చెబుతున్నా కూడా ఇంకా ఆలస్యం అయితే సాగుతోంది. స్టార్‌లింక్ ఇప్పటికే భారత్‌లో శాటిలైట్ సేవలు అందించడానికి అవసరమైన లైసెన్స్ పొందినప్పటికీ టెలికమ్యూనికేషన్స్ విభాగం నుండి తుది స్పెక్ట్రమ్ కేటాయింపుల కోసం భద్రతాపరమైన తుది అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మరో వైపు భారత్‌లో ఇప్పటికే టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థల నుంచి ఈ శాటిలైట్ ఇంటర్నెట్ స్పెక్ట్రమ్ కేటాయింపుల విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయన్నది మస్క్ ట్వీట్ చేసిన దాంతో అర్ధం అని అంటున్నారు.