వన్ అండ్ ఓన్లీ మస్క్... సంపదలో సరికొత్త రికార్డ్!
ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్, ఎక్స్, టెస్లా, స్టార్ లింక్, న్యూరాలింక్ సంస్థల నాయకుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
By: Raja Ch | 2 Oct 2025 12:38 PM ISTప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్, ఎక్స్, టెస్లా, స్టార్ లింక్, న్యూరాలింక్ సంస్థల నాయకుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సంపదలో ఎవరికీ అందనంత దూరంలో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 500 బిలియన్ డాలర్లు (సుమారు రూ.41,07,500 కోట్లు) దాటేసిందని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ట్రాకర్ వెల్లడించింది.
అవును... టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్, స్టార్ లింక్, న్యూరాలింక్ వంటి సంస్థల నాయకుడు ఎలాన్ మస్క్ సంపదలో చరిత్ర సృష్టించారు. ఈ భూమ్మీద అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ క్రమంలో తొలి ట్రిలియనీర్ గా చరిత్ర సృష్టించే దిశగా ఆయన దూసుకెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం అతని ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లా అని చెబుతున్నారు.
సెప్టెంబర్ 15 నాటికి టెస్కా కార్ల సంస్థలో మస్క్ కు 12.4 శాతం వాటా ఉంది. ఈ ఏడాదిలో సంస్థ షేర్లు 14 శాతం పెరగ్గా.. బుధవారం ఒక్కరోజే 3.3 శాతం పెరిగాయి. దీంతో మస్క్ సంపద 6 బిలియన్ డాలర్లు పెరిగి 9.3 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. దీంతో బుదవారం సాయంత్రం నాటికి అతని నికర విలువ $500.1 బిలియన్లుగా ఉంది.
వాస్తవానికి డోనాల్డ్ ట్రంప్ తో కలిసి ప్రభుత్వ సామర్థ్య శాఖ (డోజ్) సంబంధిత కార్యక్రమాల కోసం ప్రచారం చేస్తూ వైట్ హౌస్ లో చాలా నెలలు గడిపిన తర్వాత, టెస్లా స్టాక్ ధర పెరగడం ప్రారంభించింది. అనంతరం అధ్యక్షుడితో విభేదాల తర్వాత ఆ సంస్థ షేర్లు పతనమయ్యాయి. ఇలా టెస్లా షేర్లు కొంత ఒడుదొడుకులకు లోనయ్యాయి.
ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఈ కుబేరుడు $1 బిలియన్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. ఇదే సమయంలో... రానున్న రోజుల్లో రోబోట్యాక్సీ, ఏఐ మార్కెట్ విస్తరణ వంటి లక్ష్యాలను పెట్టింది. ఈ లక్ష్యాలను సాధిస్తే మస్క్ కు మరింత పెద్ద ఎత్తున షేర్లు సమకూరనున్నాయి.
మరోవైపు సుమారు 900 బిలియన్ డాలర్లు సమకూరనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో... ఆయన సంపద విలువ ట్రిలియన్ డాలర్లు దాటిపోవచ్చని చెబుతున్నారు. అయినప్పటికీ... టెస్లా ఇప్పటికీ తగ్గుతున్న కార్ల అమ్మకాలతో సవాళ్లను ఎదుర్కొంటోంది. నిరంతర మార్జిన్ ఒత్తిళ్లు స్టాక్ ను దెబ్బతీస్తూనే ఉన్నాయి.
కాగా బుధవారం నాటికి 350.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. మూడో స్థానంలో 245.8 బిలియన్ డాలర్లతో మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు. ఆ తర్వాత 233.5 బిలియన్ డాలర్ల సంపదతో జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో ఉండగా... లారీ పేజ్ 203.7 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో నిలిచారు.
ఇక 189 బిలియన్ డాలర్ల నికర సంపదతో సెర్గీ బ్రిన్ ఆరో స్థానంలో.. 162.6 బిలియన్ డాలర్లతో జెన్సెన్ హువాంగ్ ఏడో స్థానంలో.. 160.6 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎనిమిదో స్థానంలో.. 156.4 డాలర్లతో స్టీవ్ బాల్మర్ తొమ్మిదో స్థానంలో.. 148.5 బిలియన్ డాలర్లతో వారెన్ బఫెట్ పదో స్థానంలో ఉన్నారు.
