Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ‘గ్రోక్’ వివాదంపై స్పందించిన ఎలన్ మస్క్

ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే ఈ పెద్ద మనిషి.. ఆయన సంస్థలు కూడా ఈ వివాదాలను రాజేస్తూనే ఉంటాయి.

By:  A.N.Kumar   |   4 Jan 2026 12:48 PM IST
ఎట్టకేలకు ‘గ్రోక్’ వివాదంపై స్పందించిన ఎలన్ మస్క్
X

ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే నంబర్ 1 కుబేరుడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే ఈ పెద్ద మనిషి.. ఆయన సంస్థలు కూడా ఈ వివాదాలను రాజేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ట్రంప్ తో పెట్టుకొని విడిపోయిన మస్క్ ఇప్పుడు తన సోషల్ మీడియా ఎక్స్ ద్వారానూ పలు దేశాల్లో మంటలు పుట్టిస్తున్నారు. తాజాగా భారత్ లోనూ ఎక్స్ వివాదాలను రాజేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న ‘గ్రోక్’ చాట్ బాట్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ముఖ్యంగా భారత్ లో మహిళలు, పిల్లల చిత్రాలను అసభ్యకరంగా మార్చేందుకు ఈ టూల్ ను దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం సీరియస్ కావడంతో ఎట్టకేలకు ఎలోన్ మస్క్ తనదైన శైలిలో స్పందించారు.

ప్రభుత్వం నుంచి 72 గంటల అల్టిమేటం

గ్రోక్ ద్వారా చట్టవిరుద్ధమైన అసభ్యకరమైన చిత్రాలు సృష్టించబడుతున్నాయని గుర్తించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రిత్వ శాఖ, ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌కు ఘాటుగా నోటీసులు జారీ చేసింది. గ్రోక్ దుర్వినియోగంపై 72 గంటల్లోగా వివరణ ఇవ్వాలని తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే, ఐటీ చట్టం సెక్షన్ 79 కింద సోషల్ మీడియా సంస్థలకు లభించే రక్షణను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

తప్పు చేస్తే శిక్ష తప్పదు.. మస్క్ స్పందన

ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఎలోన్ మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రోక్ అనేది కేవలం ఒక సాధనం మాత్రమేనని.. దాన్ని ఉపయోగించే విధానంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. "ఎవరైనా గ్రోక్‌ను ఉపయోగించి చట్టవిరుద్ధమైన కంటెంట్ సృష్టిస్తే అది వారు స్వయంగా అప్‌లోడ్ చేసిన నేరం కిందకే వస్తుంది.. అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి." అని మస్క్ స్పష్టం చేశారు. దీనికి మద్దతుగా ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను ఆయన రీషేర్ చేశారు.. "ఒక వ్యక్తి అశ్లీలమైన రాతలు రాస్తే దానికి కలాన్ని నిందించలేం. అది రాసే వ్యక్తి స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. గ్రోక్ కూడా అంతే మీరు ఏ ఇన్‌పుట్ ఇస్తే అదే అవుట్‌పుట్ వస్తుంది." అని మస్క్ క్లారిటీ ఇచ్చారు.

అసలేం జరిగింది?

గ్రోక్-2 వెర్షన్‌లో ప్రవేశపెట్టిన ఇమేజ్ ఎడిటింగ్ , జనరేషన్ ఫీచర్లను కొందరు వినియోగదారులు దుర్వినియోగం చేశారు. సెలబ్రిటీలు, సాధారణ మహిళల ఫోటోలను అప్‌లోడ్ చేసి.. వాటిని అసభ్యకరంగా మార్చడం ప్రారంభించారు. రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది ఈ అంశాన్ని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం వేగంగా స్పందించింది.

నిపుణులు ఏం అంటున్నారు?

మస్క్ తన యూజర్ల బాధ్యులను చేస్తున్నప్పటికీ.. ఏఐ టూల్స్ విషయంలో రక్షణ కవచాలు ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. అసభ్యకరమైన పదాలను లేదా అభ్యర్థనలను ఏఐ ప్రాసెస్ చేయకుండా ముందే అడ్డుకోవాల్సిన బాధ్యత సంస్థపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు.

మొత్తానికి మస్క్ వ్యాఖ్యలతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇకపై గ్రోక్ లేదా ఇతర ఏఐ టూల్స్‌ను అక్రమ ప్రయోజనాలకు వాడేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టమవుతోంది.