ఎలాన్ మస్క్ 'భారీ' విరాళం: ఇది దాతృత్వమా లేక పన్ను వ్యూహమా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025 ఏడాది ముగింపు వేళ సుమారు ₹900 కోట్ల విలువైన షేర్లను విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
By: A.N.Kumar | 2 Jan 2026 3:19 PM ISTప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2025 ఏడాది ముగింపు వేళ సుమారు ₹900 కోట్ల విలువైన షేర్లను విరాళంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ విరాళం వెనుక ఉన్న అసలు లెక్కలేమిటి అన్న దానిపై బోలెడన్నీ అనుమానాలున్నాయి.
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ వంటి దిగ్గజ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ దాతృత్వంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2025 ముగియడానికి కొద్ది రోజుల ముందు ఆయన 100 మిలియన్ల డాలర్ల (దాదాపు 900 కోట్లు) విలువైన టెస్లా షేర్లను విరాళంగా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వినడానికి చాలా పెద్దది అనిపించినా.. విశ్లేషకులు మాత్రం దీని వెనుకున్న ఆర్థిక కోణాలను వెలికితీస్తున్నారు.
విరాళం వెనుక ‘టాక్స్’ లెక్కలు!
ఎలన్ మస్క్ తన విరాళాలను ఎప్పుడూ నగదు రూపంలో ఇవ్వరు. ఈసారి కూడా ఆయన టెస్లా షేర్లనే దానంగా ఇచ్చారు. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఇది కేవలం దాతృత్వం మాత్రమే కాదు.. ఒక పక్కా ‘ఇయర్ ఎండ్ టాక్స్ ప్లానింగ్’గా చెప్పొచ్చు. అమెరికా చట్టాల ప్రకారం.. షేర్లను విరాళంగా ఇచ్చినప్పుడు ఆస్తిపై వచ్చే పన్నుల నుంచి భారీగా మినహాయింపు లభిస్తుంది. నగదు విరాళం కంటే షేర్ల బదిలీ మస్క్ వంటి బిలియనీర్లకు పన్నుభారాన్ని తగ్గించుకోవడానికి సులభమైన మార్గంగా చెప్పొచ్చు.
సంపదతో పోలిస్తే ఎంత?
మస్క్ నికర ఆస్తి ప్రస్తుతం 650 బిలియన్ డాలర్లకు పైమాటే.. ఈ భారీ సంపదతో పోలిస్తే ఆయన ఇచ్చిన 100 మిలియన్లు అనేది సముద్రంలో చుక్క వంటిదేనని విమర్శకులు అంటున్నారు. ఆయన మొత్తం ఆస్తిలో ఈ విరాళం విలువ కేవలం 0.015 శాతం మాత్రమే.. సాధారణ వ్యక్తి సంపాదనతో పోల్చి చూస్తే.. ఇది ఒక మధ్యతరగతి వ్యక్తి వంద రూపాయలు దానం చేసిన దానితో సమానమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
గతంలో మస్క్ చేసిన భారీ విరాళాలు..
మస్క్ ఇలా విరాళాలు ఇవ్వడం ఇదే మొదటి సారి కాదు.. గత కొన్నేళ్లుగా ఆయన నిలకడగానే షేర్లను దానం చేస్తూనే ఉన్నారు. 2021లో 5.7 బిలియన్ డాలర్లు.. 2022లో 1.95 బిలియన్ డాలర్లు, 2024లో 112 మిలియన్ డాలర్లు, 2025లో 100 మిలియన్ డాలర్లను తాజాగా విరాళంగా ప్రకటించారు.
మస్క్ చేసిన విరాళం వల్ల దాతృత్వ సంస్థలకు.. సమాజానికి మేలు జరుగుతుందన్నది కాదనలేని సత్యం. కానీ అది తన సొంత పన్ను ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమా లేక నిజమైన మార్పు కోసమా అన్నది మాత్రం చర్చనీయాంశమే. దాతృత్వానికి వ్యాపార వ్యూహాన్ని జోడించడం మస్క్ మార్క్ శైలి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
