మరో చరిత్ర సృష్టించిన ఎలన్ మస్క్
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరో అరుదైన మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల (సుమారు 50 లక్షల కోట్లు) సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన అవతరించారు.
By: A.N.Kumar | 16 Dec 2025 6:59 PM ISTఅపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరో అరుదైన మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే 600 బిలియన్ డాలర్ల (సుమారు 50 లక్షల కోట్లు) సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన అవతరించారు.
సంపద అమాంతం పెరగడానికి కారణం
మస్క్ కు చెందిన రాకెట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ ఐపీఓ విలువ పెరుగుతున్నట్టు వార్తలు రావడంతో ఆయన సంపద అమాంతం పెరిగింది. ఒక్కరోజులోనే మస్క్ సంపద 168 బిలియన్ డాలర్లు పెరిగింది. సోమవారం మధ్యాహ్నం సమయానికి ( అమెరికా కాలమానం ప్రకారం) ఆయన నికర సంపద దాదాపు 677 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ వెల్లడించింది.
మస్క్ సంపద వృద్ధి వేగం
అక్టోబరులో మస్క్ నికర సంపద 500 బిలియన్ డాలర్లు దాటింది. 2020 మార్చి నాటికి కేవలం 24.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన ఆస్తులు, కేవలం ఐదేళ్లలోనే 600 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. ఇప్పటివరకూ ప్రపంచంలో ఏ కుబేరుడు ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు. మస్క్ తర్వాత, ఒరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ గతంలో ఓసారి 400 బిలియన్ డాలర్ల మార్క్ ను అందుకున్నారు.
స్పేస్ ఎక్స్ విలువ.. మస్క్ సంపద కు చోదక శక్తి
స్పేస్ ఎక్స్ కంపెనీలో ఎలాన్ మస్క్ కు 42 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ వచ్చే ఏడాది ఐపీఓకు వెళ్లడానికి సిద్ధమవుతోంది. తొలుత స్పేస్ ఎక్స్ 400 బిలియన్ డాలర్ల విలువతో ఎక్సేంజీ మార్కెట్ లోకి రానున్నట్లు ఈ ఏడాది ఆగస్టులో వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ సంస్థ ఏకంగా 800 బిలియన్ డాలర్ల విలువతో ఐపీఓకు వస్తున్నట్లు కంపెనీ ఇన్వెస్టర్లు కొందరు ఫోర్బ్స్ కు వెల్లడించారు. ఈ వార్తలే మస్క్ సంపద పరుగులు తీయడానికి ప్రధాన కారణం.
ట్రిలియనీర్ గా మస్క్.. ముంగిట మరో రికార్డ్
టెస్లా, ఎక్స్ ఏఐ హోల్డింగ్ లలోని తన వాటాల ద్వారా మస్క్ త్వరలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఆటో మొబైల్ కంపెనీలో మస్క్ కు 12శాతం వాటా ఉంది. ఈ ఏడాది నవంబరులో కంపెనీ వాటాదారులు సీఈవోగా మస్క్ కు ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు అంగీకరించారు. తన కృత్రిమ మేధస్సు సంస్థ అయిన ఎక్స్ ఏఐ హోల్డింగ్స్ లో మస్క్ కు 53శాతం వాటా ఉంది.
ఈ పరిణామాలు గమనిస్తే.. మస్క్ అతి త్వరలోనే ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా సరికొత్త ఘనత సాధించే అవకాశాలు ఉన్నాయి.
