Begin typing your search above and press return to search.

గంటన్నరలో హైదరాబాద్ - గుంటూరు.. ఇదే ఆ మెగా ప్రాజెక్టు!

హైదరాబాద్ నుంచి గుంటూరుకు నడికూడి రైలు మార్గం 300కి.మీ. కంటే తక్కువగా ఉంటుంది.

By:  Garuda Media   |   23 Oct 2025 12:28 PM IST
గంటన్నరలో హైదరాబాద్ - గుంటూరు.. ఇదే ఆ మెగా ప్రాజెక్టు!
X

కాలం మారుతున్న కొద్దీ జీవనశైలిలో వేగం అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది. అందుకు నిదర్శనంగా పలు ప్రాజెక్టులు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా అలాంటి సరికొత్త ప్రాజెక్టు ఒకటి తెర మీదకు వచ్చింది. గంటకు 350 కి.మీ. వేగంతో పరుగులు తీసే ఎలివేటెడ్ రైలు కారిడార్ కు సంబంధించిన ఒక కొత్త ప్రతిపాదన ఆసక్తికరంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే సిద్దం చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే.. భవిష్యత్తులో హైదరాబాద్ నుంచి గుంటూరుకు చేరుకోవటానికి గరిష్ఠంగా గంటన్నర.. కనిష్ఠంగా గంట కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకునే పరిస్థితి.

హైదరాబాద్ నుంచి గుంటూరుకు నడికూడి రైలు మార్గం 300కి.మీ. కంటే తక్కువగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా రెండు ముఖ్య రాష్ట్ర రాజధాని నగరాలను కలిపేలా రెండు ఎలివేటెడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయాలన్నది దక్షిణ మధ్య రైల్వే ఆలోచన. ఇందులో భాగంగా హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై నగరాలకు ఎలివేటెడ్ రైలు కారిడార్ లు నిర్మించేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఈ కారిడార్ల మధ్య నడిచే రైళ్లు గంటకు 350కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల మధ్య ప్రయాణ వ్యవధి భారీగా తగ్గిపోనుంది. హైదరాబాద్ - బెంగళూరు కారిడార్ 605కి.మీ. కాగా హైదరాబాద్ - చెన్నై కారిడార్ 760కి.మీ. అంటే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రెండు గంటల కంటే తక్కువ వ్యవధిలో చేరుకునే వీలుంది. ఇక.. చెన్నైకు మాత్రం రెండున్నర గంటల కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకునే వీలుంది. ఈ కారిడార్ ప్రాజెక్టు పట్టాలెక్కితే.. విమాన ప్రయాణం కంటే తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.

ఎందుకంటే.. డొమెస్టిక్ ప్రయాణాలకు తక్కువ వేసుకున్నా.. రెండు గంటల ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది. గంట నుంచి గంటన్నర పాటు ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు సమయం తీసుకోవటంతో పాటు.. అక్కడి ఎయిర్ పోర్టు నుంచి సిటీకి చేరుకోవటానికి మరో గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ఈ లెక్క మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే విమానం కంటే వేగంగా చేరుకునే వీలుంది.

అయితే.. ఈ రైల్వే కారిడార్ ఏర్పాటుకు భారీగా ఖర్చు కానుంది. దక్షిణ మధ్య రైల్వే వేసిన అంచనా ప్రకారం ఈ రెండు ప్రాజెక్టులకు రూ5.42 లక్షల కోట్లు అవసరమవుతాయి. ఈ కారిడార్ కోసం ప్రత్యేకంగా రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కారిడార్ల ఏర్పాటుతో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక - తమిళనాడు మధ్య ప్రయాణ వ్యవధి తగ్గిపోవటమే కాదు.. ఇదో గేమ్ ఛేంజర్ గా మారుతుందని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకు వెళ్లాలంటే తక్కువలో తక్కువ 12 గంటల సమయం పడుతోంది. అదే ఏపీ మీదుగా అంటే మరింత ఎక్కువ సమయం తీసుకునే పరిస్థితి. ఇలాంటి వేళ.. తెర మీదకు వచ్చిన ఈ మెగా ప్రాజెక్టు.. పేపర్ మీదనే పరిమితం అవుతుందా? లేదంటే పట్టాలు ఎక్కుతుందా? అన్నది కాలమే డిసైడ్ చేయాలి.