పంది కడుపున ఏనుగు పిల్ల! బ్రహ్మం గారి మాటలు నిజమవుతున్నాయా?
ప్రపంచంలో ఎక్కడ ఏ వింత చోటుచేసుకున్నా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మం గారి కాలజ్ఙానం.
By: Tupaki Political Desk | 20 April 2026 3:16 PM ISTప్రపంచంలో ఎక్కడ ఏ వింత చోటుచేసుకున్నా మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్రహ్మం గారి కాలజ్ఙానం. ముందు ముందు వింతైన రూపాలు పుడతాయి.. ఊహించని విపత్తులు సంభవిస్తాయి' అని వీరబ్రహ్మేంద్రస్వామి ఏనాడో కాలజ్ఞానంలో చెప్పిన విశేషాలు అప్పుడప్పుడు నిజమవుతుంటాయి. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఒక సంఘటన బ్రహ్మంగారి వాక్కులను మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఒక పంది కడుపున ఏనుగును పోలిన వింత జీవి జన్మించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ వింత ఏంటి? ఇది కాలజ్ఞానంలో చెప్పిన మార్పులకు సంకేతమా? అంటూ చర్చించుకుంటున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో అరుదైన ఘటన నమోదైంది. గ్రామానికి చెందిన కూరాకుల వెంకటయ్య పందులను పెంచుతూ జీవనం సాగిస్తుంటారు. ఈయనకు చెందిన ఓ పంది ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? నిజమే సాధారణంగా పందికి పంది పిల్లలు పుడితే వింతేమీ కాదు. కానీ, వెంకటయ్యకు చెందిన పందికి పుట్టిన ఏడు పిల్లల్లో ఒకటి వింత రూపంలో జన్మించింది. ఏనుగు పిల్లను పోలిన విధంగా తొండం, పెద్ద చెవులు ఉండటంతో వెంకటయ్యతోపాటు గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ విషయం ఆ నోటా, ఈ నోటా విస్తృతంగా ప్రచారం జరగడంతో చుట్టుపక్కల గ్రామాల వారు ఆ వింత జీవిని చూడటానికి వెల్లువలా తరలివచ్చారు. కొందరు ఏనుగును పోలిన పంది ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం పశువైద్య శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వచ్చి పంది పిల్లకు జన్యు పరీక్షలు చేశారు. అయితే వింతైన ఆకారంతో పుట్టిన ఆ పిల్లతోపాటు మరో పంది కూన కొద్ది రోజులకే మరణించింది. కాగా, ఈ ఘటనకు బ్రహ్మం గారి కాలజ్ఞానంతో ముడిపెడుతూ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
మరోవైపు పంది కడుపున పుట్టిన వింత ఆకారంతో ఉన్న జీవి కూడా పందేనని పశువైద్య నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఇది ఎలాంటి అద్భుతం కాదని, జన్యుపరమైన లోపం కారణంగా ఇలాంటి ఆకృతులు వస్తాయని అంటున్నారు. గర్భస్థ దశలో పిండం అభివృద్ధి సరిగా జరగకపోవడం వల్ల శరీర నిర్మాణంలో మార్పులు ఏర్పడతాయని వివరించారు. ఇలాంటి జీవులు సాధారణంగా ఎక్కువ కాలం బతక లేవని కూడా చెబుతున్నారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయని వెల్లడించారు. గతంలో రెండు తలల గొర్రెపిల్ల, 8 కాళ్ల మేక పిల్ల పుట్టడం కూడా ఇలాంటి జన్యు పరమైన లోపాలే కారణమని వెల్లడైందని గుర్తు చేస్తున్నారు.
