మళ్ళీ తెరపైకి టీఆర్ఎస్ సెంటిమెంట్: అక్షరాల గారడీతో ఈసీని బోల్తా కొట్టించవచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు.. ఆ పార్టీకి పెట్టిన పేరు. సాధారణంగా కొత్త పార్టీలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం కొత్త పేర్లను వెతుక్కుంటాయి.
By: A.N.Kumar | 25 April 2026 7:47 PM ISTతెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త హాట్ టాపిక్‌గా మారింది. అదే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు.. ఆ పార్టీకి పెట్టిన పేరు. సాధారణంగా కొత్త పార్టీలు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం కొత్త పేర్లను వెతుక్కుంటాయి. కానీ కవిత తన పార్టీ పేరును పాత 'టీఆర్ఎస్‘ (తెలంగాణ రాష్ట్ర సమితి)ని తలపించేలా ఉండాలని భావించడం ఇప్పుడు ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనల చుట్టూ తిరుగుతోంది.
'టీఆర్ఎస్' పేరు వెనుక అసలు కథ ఏమిటి?
కవిత తన కొత్త పార్టీ పేరును “TRS”గా ప్రకటించి.. దాని చివరన చాలా చిన్నగా గమనించని రీతిలో “ఏ” అనే అక్షరాన్ని చేర్చారు. అంటే సాంకేతికంగా అది “టీఆర్ఎస్ఏ”. అయితే ప్రచారంలోనూ పార్టీ బోర్డులపైనూ అది కేవలం “టీఆర్ఎస్”గా మాత్రమే కనిపిస్తోంది. పాత తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న బ్రాండ్ ఇమేజ్‌ను.. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్‌ను తిరిగి సొంతం చేసుకోవడమే దీని వెనుక ఉన్న ప్రధాన వ్యూహమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం మాతృ పార్టీ బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారిన నేపథ్యంలో ఖాళీగా ఉన్న 'టీఆర్ఎస్' సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని కవిత వర్గం భావిస్తోంది.
ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనలు ఏం చెబుతున్నాయి?
కొత్త పార్టీల పేర్ల ఎంపికపై భారత ఎన్నికల సంఘం 2014లోనే అత్యంత కీలకమైన, కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అప్పట్లో అనేక కొత్త పార్టీలు ఇప్పటికే ఉన్న జాతీయ లేదా ప్రాంతీయ పార్టీల పేర్లను స్వల్ప మార్పులతో వాడుకోవడంపై ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టం చేసిన అంశాలున్నాయి. ఇప్పటికే గుర్తింపు పొందిన పార్టీలకు ఉన్న ప్రజాదరణను, ఇమేజ్‌ను కొత్త పార్టీలు తప్పుడు మార్గంలో వాడుకోకూడదు. కొత్త పార్టీల పేర్లు పాత పార్టీలను పోలి ఉండటం వల్ల సామాన్య ఓటర్లు తికమకపడే అవకాశం ఉంటుంది. పోలింగ్ సమయంలో ఇది ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తుంది. గుర్తింపు పొందిన పార్టీల పేర్లతో సరిపోలేలా లేదా చాలా దగ్గరగా ఉండే పేర్లను కొత్త పార్టీలకు కేటాయించే ప్రసక్తే లేదని ఈసీ తేల్చి చెప్పింది.
సాంకేతిక మెలిక.. టీఆర్ఎస్ఏ వర్సెస్ టీఆర్ఎస్
కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ఏ అని నమోదు చేసుకోవడానికి ప్రయత్నించడం వెనుక ఒక చట్టపరమైన రక్షణ కవచం వెతుక్కునే ప్రయత్నం కనిపిస్తోంది. "మేము టీఆర్ఎస్ అని పెట్టలేదు, చివరన 'ఏ' ఉంది కదా" అని ఈసీకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఈసీ కేవలం అక్షరాల మార్పును మాత్రమే చూడదు. ఆ పేరు వినడానికి ఎలా ఉంది? అది ప్రజల్లో ఏ రకమైన భావాన్ని కలిగిస్తుంది? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఒక పార్టీ పేరు మరొక పార్టీని గుర్తు చేస్తూ, ఓటర్లను తప్పుదారి పట్టించేలా ఉంటే అక్షరాల మార్పు ఉన్నప్పటికీ ఈసీ దానిని తిరస్కరించే అధికారం కలిగి ఉంటుంది.
రాజకీయ విశ్లేషణ.. బ్రాండ్ గుర్తింపు కోసం పోరు
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి 'టీఆర్ఎస్' అనేది ఒక బలమైన బ్రాండ్. ఆ పేరుతో ప్రజలకు ఉన్న భావోద్వేగ అనుబంధం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కేసీఆర్ ఆ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత, ఆ పాత ముద్రను తిరిగి తన ఖాతాలో వేసుకోవాలని కవిత చూస్తున్నారు. అయితే, ఇది రాజకీయంగా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఈసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు ఈసీ కఠినంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ సీపీ) నమోదు సమయంలో కూడా అనేక సాంకేతిక అంశాలు చర్చకు వచ్చాయి. ఇప్పుడు కవిత పార్టీ విషయంలో కూడా ఇదే పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.
ఈసీ నిర్ణయమే కీలకం
కవిత పార్టీకి టీఆర్ఎస్ఏ గా గుర్తింపు లభిస్తుందా? లేక ఈ పేరు పాత TRSని పోలి ఉందనే కారణంతో ఈసీ తిరస్కరిస్తుందా? అనేది ఇప్పుడు సస్పెన్స్. ఒకవేళ ఈ పేరును ఈసీ ఆమోదిస్తే భవిష్యత్తులో మరిన్ని కొత్త పార్టీలు ఇలాంటి "షార్ట్ కట్" పద్ధతులను అనుసరించే ప్రమాదం ఉంది. ఒకవేళ తిరస్కరిస్తే మాత్రం కవిత మళ్ళీ కొత్త పేరును వెతుక్కోక తప్పదు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఈ 'పేరు' వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. దీనిపై ఎన్నికల సంఘం ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తు రాజకీయ పరిణామాలను శాసించనుంది.
