"సర్" గడువు పెంచారు సార్ !
కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By: Satya P | 30 Oct 2026 8:50 AM ISTకేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ సర్ ప్రక్రియ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలలో గడువుని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు గతంలో ప్రకటించిన షెడ్యూల్ ని కూడా సవరించింది. ఇక ఈ గడువు పెంచిన జాబితాలో చూస్తే ఏపీ, తెలంగాణా కూడా ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర, హరియాణా, నాగాలాండ్ రాష్ట్రాలు ఉన్నాయి. సవరించిన గడువు ప్రకారం ఈ మూడు రాష్ట్రాలలో ఓటర్ల తుది జాబితాను నవంబర్ 30న విడుదల చేస్తారు.
తెలుగు రాష్ట్రాలలో కూడా :
ఇక సర్ ప్రక్రియలో తమకు ఉన్న ఫిర్యాదులు అలాగే అభ్యంతరాలు తెలిపేందుకు ఓటర్లకు ఏపీలో నవంబర్ 20 వరకూ తెలంగాణాలో 26 వరకూ గడువుని కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. తుది ఓటర్ల జాబితా నవంబర్ 30న ప్రచురిస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా సర్ ప్రక్రియకి మరింత గడువు పొడిగించారు. అక్కడ ఓటర్ల నుంచి వచ్చే అభ్యంతరాలు, ఫిర్యాదులను తీసుకోవడానికి వాటిని పరిశీలించడానికి డిసెంబర్ 15 వరకు గడువు ఉంటుంది. ఆ మీదట ఢిల్లీలో తుది ఓటర్ల జాబితా డిసెంబర్ 22 ప్రచురిస్తారు.
ఎందుకు పొడిగిస్తున్నారు అంటే :
సర్ ప్రక్రియ ముగిసిపోయింది అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో గడువు పెంచారు. అలాగే సర్ ప్రక్రియ పూర్తి అయిన రాష్ట్రాలలో మరోసారి అవకాశం ఓటర్లకు ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే విపక్షాలు ఓటు చోరీ అని ఒక వైపు ఆరోపణలు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నాయి. అంతే కాదు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నాయి. మరో వైపు కోర్టులో ఈ అంశం మీద పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓటర్లలో అపోహలు అనుమానాలు రాకుండా కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియ గడువు పెంచడమే కాదు చాలా చోట్ల మరోసారి అవకాశం కూడా ఇస్తోంది అని అంటున్నారు.
పెద్ద ఎత్తున పెండింగ్ దరఖాస్తులు :
అదే విధంగా ఓటర్ల వివరాల నమోదు, మార్పులు చేర్పులు అభ్యంతరాలు ఎన్యుమరేషన్ ఫారాల సేకరణ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో ఇంకా పూర్తి కాకపోవడం వంటివి ఎన్నో ఉన్నాయి. అలాగే సర్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా ఎవరికీ అన్యాయం జరగకుండా పూర్తి చేయడానికి రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు గడువు పొడిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరడం కూడా జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సరిగ్గా ఉండేలా చూడటానికి తమకు అందిన ఫిర్యాదులు, క్లెయిమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడానికి అధికారులకు మరింత సమయం ఇవ్వడం కోసం ఈ గడువు పొడిగింపు అని అంటున్నారు. మొత్తానికి మరో చాన్స్ వచ్చింది కాబట్టి తమ ఓట్లు ఏమైనా తొలగించబడిన లేదా నోటీసులు అందిన వారు ఫిర్యాదులు చేసి తమ ఓటుని పొందేందుకు వీలు అవుతుందని అంటున్నారు.
