వరుణుడా.. మజాకా.. చలికాలంలోనూ తుఫాన్ల వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ఎప్పుడో?
నవంబర్, డిసెంబర్లోనూ బంగాళాఖాతంలో వరుస తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. ఈ నెలాఖరులో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి, డిసెంబర్ 4 తర్వాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా. డిసెంబర్ రెండో వారంలో మరో తుఫాను ఏర్పడే సూచనలున్నాయి. ఎల్నినో ప్రభావం 2027 మార్చి వరకు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
By: A.N.Kumar | 22 Nov 2026 4:25 PM ISTసాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలలు వచ్చాయంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? చల్లటి గాలులు.. పొద్దున్నే పొగమంచు.. బీరువాలో దాచిన స్వెటర్లు.. వేడివేడి టీ కప్పులు.. కానీ మన బంగాళాఖాతం మాత్రం అవేవీ కుదరవు బాబూ.. నాకు చలికాలం అంటే అలర్జీ అంటోంది. ప్రకృతి క్యాలెండర్లో సీజన్ మారినా వరుణదేవుడి మూడ్ మాత్రం అస్సలు మారడం లేదు. వర్షాకాలం అయిపోయిందని గొడుగులు అటకెక్కించిన జనానికి పిక్చర్ అభీ బాకీ హై అంటూ వరుస తుఫాన్లతో చుక్కలు చూపిస్తోంది వాతావరణ శాఖ.
ఇప్పటికే ఆర్నబ్ , మురుసు తుఫాన్ల దెబ్బకు వణికిపోయిన ఏపీ ప్రజలకు, మొన్నటికి మొన్న ఆక్వాన్ తుఫాను రూటు మార్చుకోవడంతో కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరికింది. హమ్మయ్య ఇక ఈ ఏడాదికి గండం గడిచిందిరా బాబూ అనుకునేలోపే బంగాళాఖాతం మళ్లీ తన విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతోంది. వాతావరణ నిపుణుల తాజా అంచనాల ప్రకారం.. వరుణుడి డైరీలో ఇంకా రెండు పెద్ద ఎపిసోడ్లు పెండింగ్లో ఉన్నాయట.. ఈ నెలాఖరులో దక్షిణ అండమాన్ సముద్రంలో ఓ అల్పపీడనం పుట్టుకురాబోతోంది. ఇది కాస్తా బలపడి తుఫానుగా మారితే డిసెంబర్ 4 తర్వాత శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు దూసుకెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక్కడితో కథ ముగిసిందనుకుంటే పొరపాటే.. డిసెంబర్ రెండో వారంలో మరో తుఫాను కూడా లైన్లో ఉందట. కాకపోతే దాని రూటు.. రేంజ్ ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగా మిస్టరీగానే ఉంది.
ఒకవైపు తుఫాన్లు భయపెడుతుంటే మరోవైపు ఎల్నినో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సాధారణంగా ఎల్నినో వస్తే వర్షాలకు బ్రేకులు పడతాయని అంటారు. కానీ ఇక్కడ సముద్రం లోపల జరుగుతున్న కథే వేరు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ శాస్త్రవేత్తలు చెప్పిన లెక్కల ప్రకారం.. సముద్ర అంతర్భాగంలో సాధారణం కంటే దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ వేడి నమోదవుతోందట. సముద్రం లోపల అంత వేడిగా ఉంటే పైన తుఫాన్లు పుట్టకుండా ఎలా ఉంటాయి మరి? 2027 మార్చి వరకు ఈ ఎల్నినో ప్రభావం 87 నుంచి 100 శాతం వరకు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు తేల్చిచెప్పేశారు. అంటే ఇప్పట్లో వాతావరణం ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.
ప్రస్తుతానికి చలికాలంలో రెయిన్కోట్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తున్నా వచ్చే ఏడాదికి మాత్రం కాస్త తీపి కబురు ఉంది. 2027 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వాతావరణం కాస్త శాంతించి తటస్థంగా మారవచ్చట. ఆ తర్వాత జూన్ నుంచి ఆగస్టు మధ్య లానినా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే 2027 నైరుతి రుతుపవనాల సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతన్నల కళ్లలో ఆనందం నిండే అవకాశం ఉంది.
ఈ ఏడాది చలికాలం మనకు స్వెటర్లతో పాటు గొడుగులను కూడా ఒకేసారి వాడే అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది. బంగాళాఖాతం పెడుతున్న ఈ వరుస ట్విస్టులు ఎటు దారితీస్తాయో తెలియాలంటే వాతావరణ శాఖ ఇచ్చే తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాల్సిందే. అప్పటివరకు చలికి వణుకుతూనే వర్షానికి తడవకుండా జాగ్రత్త పడటం బెటర్..
