మురుగునీరు రీసైకిల్.. హైదరాబాద్ లో రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్
ఒక్క నీటి చుక్కను కూడా వృథా కానివ్వకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.
By: A.N.Kumar | 28 Oct 2026 9:53 PM ISTకలల నగరం.. కోట్లాది మందికి ఉపాధినిచ్చే జీవనధారం.. మన హైదరాబాద్.. వినూత్న సాంకేతికతతో ఆకాశాన్నంటే భవనాలు, సకల సౌకర్యాలతో మహానగరంగా భాసిల్లుతున్న ఈ సిటీకి ఇప్పుడు ఒక మౌనమైన మహా సంక్షోభం చుట్టుముడుతోంది. అదే 'దాహం'. ఎల్‌నినో రాకాసి దెబ్బకు భూగర్భ జలాలు అడుగుంటిపోతున్నాయి. వానదేవుడు ముఖం చాటేస్తుంటే నగరం పక్కన ఉన్న రిజర్వాయర్లు కన్నీరు పెడుతున్నాయి. రేపటి రోజున నగరవాసుల గొంతు ఎండిపోకూడదనే తపనతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన, ముందస్తు కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
తాగునీటి సంరక్షణకు "ట్రీటెడ్ వాటర్" కవచం
ఒక్క నీటి చుక్కను కూడా వృథా కానివ్వకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. నగరంలో ప్రతిరోజూ వృథాగా పోయే మురుగునీటిని శుద్ధి చేసి, దానిని ఇతర అవసరాలకు సమర్థంగా వాడుకోవడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.
ప్రభుత్వం తీసుకుంటున్న ప్రధాన చర్యలు
భవన నిర్మాణాలు, పబ్లిక్ పార్కులు, రోడ్ల శుభ్రతకు తాగునీటిని వాడటం సంపూర్ణంగా నిషేధించి, కేవలం శుద్ధి చేసిన నీటినే వాడాలి. విపరీతమైన నీటి అవసరాలు ఉండే ఐటీ, డేటా సెంటర్లకు కూడా ఈ శుద్ధి చేసిన నీటినే సరఫరా చేసేలా చర్యలు చేపట్టనున్నారు.
నవంబర్ 1 నుంచి కఠిన నిబంధనలు పెడుతున్నారు. ఎస్టీపీ నిర్వహణను తప్పనిసరి చేస్తూ నిబంధనలను కఠినతరం చేయనున్నారు.
సాంకేతికతతో పహారా.. కమాండ్ కంట్రోల్ నిఘా
మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్.టీపీలు) కేవలం పేరుకే పరిమితం కాకుండా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ఈ ప్లాంట్లకు సోలార్ పవర్ అమర్చడమే కాకుండా ప్రతీ ప్లాంట్ నిరంతరం పనిచేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని మోసుకెళ్లే ట్యాంకర్ల కదలికలను కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తారు. నీటి అవసరాల కోసం ప్రజల వద్దకు నేరుగా చేరువయ్యేందుకు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
మన బాధ్యత.. హైదరాబాద్ భవిష్యత్తు
నగరం అంటే కేవలం రాళ్ళు, రప్పలు, భవనాలు కాదు.. అక్కడ నివసించే కోట్లాది ప్రాణాల సమూహం. ప్రభుత్వం ఎంతటి పటిష్ఠ ప్రణాళికలు వేసినా పౌరులుగా మన ఆలోచన మారనంత వరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. నీటిని వృథా చేయకుండా కాపాడుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత. భవిష్యత్ తరాలకు తాగునీటిని బహుమతిగా ఇవ్వాలో.. లేక నీటి కోసం మైళ్ల దూరం అల్లాడే పరిస్థితిని ఇవ్వాలో నిర్ణయించుకోవాల్సింది మనమే..
ఈ ప్రణాళిక క్షేత్రస్థాయిలో ఎంత వేగంగా అమలైతే మన హైదరాబాద్ నీటి భద్రత అంతగా సురక్షితమవుతుంది. ప్రతి నీటి చుక్కనూ కాపాడుకుంటేనే ఈ మహా నగర దాహార్తిని తీర్చగలం..
